27, జులై 2019, శనివారం

కలెక్టర్‌ ఆశయం విడిచి.. గిరిజనుల కోసం నడిచి..

            ర్నలిజం కోర్సులో భాగంగా ఓ మారుమూల గిరిజన గ్రామానికి వెళ్లి, అక్కడి సర్పంచ్‌తో మాట్లాడుతోంది మిత్తల్‌ పటేల్‌. అంతలో ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడవటం వినిపించింది. ఆ ఏడుపు తమ సంభాషణకు ఇబ్బంది కలిగిస్తుండటంతో పాపకు పాలు తాగించమని తల్లికి సూచించింది. దీంతో ఆ తల్లి ముఖం కోపంగా మారింది. ‘‘నేను భోజనం చేసే కొన్ని రోజులవుతోంది. ఇంకా పాపకు పాలు ఎలా తాగించనూ..’’ అంది. మిత్తల్ ఇంటికొచ్చినప్పటికీ ఆ తల్లి మాటలు తన చెవుల్లో ప్రతి ధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ గిరిజన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. ఆ ఆలోచనే గుజరాత్‌లోని కొన్ని గిరిజన తెగల పాలిట వరంగా మారింది. 
               అది 2018 అక్టోబర్‌. గుజరాత్‌లోని అద్‌గామ్‌ గ్రామంలో ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా గ్రామసభ జరుగుతోంది. మూడు గంటలుగా ఓ మహిళ చెబుతున్న అంశాలను గ్రామస్థులు శ్రద్ధగా వింటున్నారు. ఆమె మాటలు వింటుంటే తమ ప్రాంతంలో నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం వారిలో కలుగుతోంది. కొద్దిసేపటి తర్వాత ఆమె తన ప్రసంగాన్ని ముగించి వారి వైపు చూసింది. అంతా నిశ్శబ్దం. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడే గ్రామ పెద్ద ఒకరు లేచి నిలబడి గొంతు సవరించుకుంటూ ‘‘గ్రామాభివృద్ధి కోసం అందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది. నీకు మేము చేయగలిగిన సహాయమంతా చేస్తాం.’’ అన్నాడు. 
                 ఇలా వారు ఆమెకు హామీ ఇవ్వడం మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మాట ఇచ్చి తప్పారు. కానీ ఈసారి వాళ్లు మాట తప్పలేదు. తమ ప్రాంతంలో నీటి సమస్యను పరిష్కరించడానికి ఎక్కడో బయట నుంచి ఆమెతో చేతులు కలిపారు. దాని ఫలితమే రెండు వారాలు తిరిగేలోపు గ్రామంలోని మోతిసర్‌ చెరువును పునరుద్దరించగలిగారు. ఆమె నేతృత్వంలో చెరువులోని ముళ్ల చెట్లు, గడ్డిని శుభ్రం చేశారు. ప్రణాళిక బద్ధంగా పూడిక తీసి, గట్లు నిర్మించారు. అలా ఆ ఊరి చెరువు కొత్త రూపును సంతరించుకుంది. ఆ మహిళే ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం అందుకున్న మిత్తల్‌ పటేల్‌. సంచార జాతులు, గుర్తింపునకు నోచుకోని గిరిజన తెగల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి గానూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. 
కలెక్టర్‌ అవుదామనుకొని.. 
             గుజరాత్‌లోని శంఖల్‌పుర్‌కు చెందిన మిత్తల్‌ పటేల్‌ కలెక్టర్‌ కావాలనే ఆశయంతో అహ్మదాబాద్‌కు చేరుకుంది. అయితే కాకతాళీయంగా గుజరాత్‌ విద్యాపీఠంలో జర్నలిజం కోర్సులో ప్రవేశం పొందింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె తన కోర్సులో భాగంగా గుజరాత్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలపై అధ్యయనం చేసింది. ఈ ప్రయత్నంలో ఆమె బనస్‌కాంత్‌ జిల్లాలోని సంచార జాతులు, ప్రభుత్వ గుర్తింపు పొందని గిరిజన తెగలను కలిసింది. వారు గడుపుతున్న దుర్భర జీవితం ఆమెను కలచివేసింది. సరైన గుర్తింపు లేని కారణంగా వారంతా ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలకు దూరమయ్యారని గుర్తించింది. ఇక కలెక్టర్‌ కావాలన్న తన ఆశయాన్ని పక్కనపెట్టి గిరిజన తెగల హక్కుల కోసం పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే 2006లో ‘విచర్త సముదాయ్‌ సమర్థన్‌ మంచ్‌’ అనే ఎన్జీవోను స్థాపించింది.  

              తన నిర్ణయాన్ని మొదట్లో చాలా మంది తప్పుపట్టారు. గిరిజన తెగల వారిని నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. ధైర్యంగా ముందడుగు వేసింది. ముందు గిరిజనులతో పరిచయం ఏర్పరచుకుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరవుతూ వారి నమ్మకాన్ని చూరగొంది. తర్వాత నెమ్మదిగా వారిలో చైతన్యం నింపడానికి ప్రయత్నించింది. సంచార తెగల జీవన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక వారి సమస్యలకు నీటి కొరత ఓ ప్రధాన కారణమని గుర్తించింది. 
గ్రామస్థులను ఏకం చేసి..
               బనస్‌కాంత్‌ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. భూగర్భ జలాలు 900-1000 అడుగుల లోతుకు వెళ్తే గాని అందవు. దీంతో ఆ ప్రాంతంలో తాగు, సాగునీరుకు కటకటలాడాల్సిందే. అక్కడి మారుమూల గ్రామాలకు ప్రభుత్వ పైపులైన్ల ద్వారా వచ్చే తాగునీరు సరిపోవడం లేదు. అయితే ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్లందరినీ ఐకమత్యం చేసి ఆ ప్రాంతంలోని చెరువులను పునరుద్ధరించడం ద్వారా వాన నీటిని ఒడిసి పట్టొచ్చు అనుకుంది. 

         2015 ప్రారంభంలో తన ఏడుగురు బృందంతో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రతి ఊరిలో సమావేశాలు నిర్వహించి స్థానికుల్లో చైతన్యం నింపింది. మొదట్లో ఆయా గ్రామ పెద్దల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వెనుదిరగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది. అలా కేవలం రెండు సంవత్సరాల్లోనే 87 చెరువులను పునరుద్ధరించగలిగారు. 
హక్కుల సాధన కోసం..
                     నీటి సంరక్షణ కార్యక్రమాలతో పాటు గిరిజన తెగల హక్కుల కోసమూ కృషి చేస్తున్నారామె. బ్రిటిష్‌ కాలం నాటి ‘క్రిమినల్‌ ట్రైబ్స్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1871’ ప్రకారం సుమారు 198 గిరిజన తెగలను నేర స్వభావం కలిగిన వారిగా గుర్తించారు. తర్వాత ఆ చట్టాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. అయినా వారిని ఇంకా నేరస్థులగానే పరిగణిస్తున్నారు. ఆ తెగలకు చెందిన ప్రజల హక్కుల సాధన కోసం ఆమె కృషి చేస్తోంది. ఇప్పటి దాకా సుమారు 60వేల మందికి వ్యక్తిగత ఓటరు కార్డులు, వెయ్యి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజురయ్యేలా చేశారు. వారి స్వయం ఉపాధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నారు. 

కామెంట్‌లు లేవు: