అతి తీవ్ర తుఫాన్ ‘ఆంఫన్’ పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో బుధవారం సాయంత్రం తీరం దాటింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 5.30 గంటలకు ముగిసినట్టు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. కాగా, పశ్చిమబెంగాల్, ఒడిసాల్లోని తీర ప్రాంత జిల్లాలపై ఆంఫన్ ప్రభావం భారీగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఇరు రాష్ట్రాలోనూ భారీ గాలులు, వర్షాలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. హౌరా జిల్లా మణికాన్‌లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
పశ్చిమబెంగాల్‌లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. బెంగాల్‌లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై బీజేపీ విచారం వ్యక్తం చేసింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి