21, సెప్టెంబర్ 2020, సోమవారం

మద్యమే దిక్కయింది


 కష్టకాలంలో అక్కరకొచ్చిన బార్లు..    ఖజానాకు 180 కోట్ల ఆదాయం..

           ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయమే దిక్కయింది. ఓవైపు నిషేధం అంటూనే, మరోవైపు మద్యం ద్వారా అధిక రాబడికి వైసీపీ ప్రభుత్వం పక్కా వ్యూహం అమలుచేస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత మద్యం షాపులు తెరిచినప్పుడు ఒకేసారి భారీగా ధరలు పెంచి ఖజానా నింపుకొంది. ఇప్పుడు మరోసారి బార్లకు అనుమతుల ద్వారా భారీ ఆదాయం రాబడుతోంది. వాటిని ఇప్పటికిప్పుడు తెరవాల్సిన అవసరమేంటని పలువురు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

            దీనిపై గత శుక్రవారం మూడు వేర్వేరు జీవోలు జారీ అయ్యాయి. వాటిద్వారా అక్షరాలా రూ.180కోట్లు ఖజానాలో పడబోతున్నాయి. అందులో రూ.140కోట్లు వెంటనే రానుండగా, మరో రూ.40 కోట్లు నెల వ్యవధిలో సమకూరనున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ ఇటీవల పెట్రోలు, డీజిల్‌, సహజ వాయువుపై పన్నులు విధించిన ప్రభుత్వం అదే తరహాలో ఇప్పుడు బార్లపైనా కొవిడ్‌ ఫీజు వేసింది. దీంతో సర్కారుకు భారీగా ఆదాయం రానుంది. 


30లోగా కట్టండి 

             లైసెన్స్‌, రిజిస్ర్టేషన్‌ ఫీజుల చెల్లింపులు, బార్లలో కరోనా నిబంధనలపై ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆదివారం మార్గదర్శకాలు జారీ చేశారు. మూడు శ్లాబుల్లో ఎవరు, ఎంత ఫీజు చెల్లించాలో అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీ బార్లు రూ. 7,07,194, రెండో కేటగిరీలో రూ.14,14,388, మూడో కేటగిరీలో ఉన్నవి రూ. 21,21,582 చెల్లించాలని వివరించారు. ఈ నెల 30లోపు ఈ రుసుములు కట్టాలని స్పష్టం చేశారు. అలాగే లైసెన్స్‌, రిజిస్ర్టేషన్‌ ఫీజుపై విధించిన 20శాతం కొవిడ్‌ ఫీజును నెల రోజుల్లో చెల్లించాలని తెలిపారు.  మొదటి కేటగిరీ బార్లు రూ.2లక్షలు, రెండో కేటగిరీలో రూ.4లక్షలు, మూడో కేటగిరీలో రూ.6లక్షలు చొప్పున కొవిడ్‌ ఫీజు చెల్లించాలి. రాష్ట్రంలో మొత్తం 860 బార్లు ఉంటే అందులో 801 సాధారణమైనవి. మిగిలినవి స్టార్‌ హోటళ్లు, టూరిజం పరిధిలో ఉన్నాయి. ఈ 801లో మొదటి కేటగిరీ కింద 61, రెండో కేటగిరీలో 395, మూడో కేటగిరీలో 345 ఉన్నాయి. వీటినుంచి లైసెన్సు, రిజిస్ర్టేషన్‌ ఫీజుల కింద రూ.133కోట్లు, కొవిడ్‌ ఫీజు రూపంలో మరో రూ.40 కోట్లు రానున్నాయి. స్టార్‌ హోటళ్లు, టూరిజం పరిధిలోని బార్ల ద్వారా దాదాపు రూ.10కోట్లు వస్తాయి. మొత్తం దాదాపు రూ.180 కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది.  దీనికితోడు బార్లకు 20 శాతం కొవిడ్‌ ఫీజుతో పాటు మద్యం సీసాలపై మరో 10శాతం అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ విధించారు. అంటే షాపుల్లో వచ్చే ధరలపై మరో 10శాతం ధర చెల్లించి బార్ల లైసెన్సీలు మద్యాన్ని కొనుగోలు చేసుకోవాలి. దీనివల్ల షాపులతో పోలిస్తే అమ్మకాలపై 10శాతం అదనపు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది.  బార్లలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, టేబుళ్ల మధ్య భౌతిక దూరం ఉండాలని, గ్లాసులు వేడినీటితో శుభ్రం చేయాలని, రోజుకు రెండుసార్లు బార్లను శానిటైజ్‌ చేయాలని సూచించారు. కట్టడి ప్రాంతాల్లో బార్లకు కలెక్టర్‌ నుంచి విడిగా అనుమతి పొందాలని స్పష్టం చేశారు. కాగా, కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో బార్లు తెరవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తప్ప మరో ఆలోచన లేదని, అందుకే ఇలాంటి సమయంలోనూ బార్లు తెరిచేందుకు అనుమతిచ్చిందనే వాదన వినిపిస్తోంది. 


కామెంట్‌లు లేవు: