తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన బిఆర్‌ఎస్ పార్టీపై వ్యతిరేకతో.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై నమ్మకమో కానీ.. ఈసారి హస్తం పార్టీకే ఓటరు జై కొట్టారు. ఈ సమయంలోనే.. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే సిఎం అభ్యర్థి ఎవరూ అన్న చర్చ జరుగుతుండగా.. ఎక్కువగా వినిపించిన పేరు అనుముల రేవంత్ రెడ్డి. అటు అధిష్ఠానం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరబోతోంది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిది. 2023 డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో సీఎంగా వినిపించిన ఒకే ఒక్క పేరు రేవంత్ రెడ్డి. పార్టీ గెలిచినప్పటి నుంచి అధిష్ఠానం మనసులో కూడా అదే పేరు ఉన్నా.. బయటకు చెప్పలేక తచ్చాడుతున్న సమయంలోనూ.. రాష్ట్రమంతా ముక్తకంఠంతో తమకు రేవంత్ రెడ్డే సీఎం అని... మిగితా ఎవ్వరు వచ్చినా ఒప్పుకోమన్న రీతిలో తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. అయితే.. రేవంత్ రెడ్డిపై అటు అధిష్ఠానానికి, ఇటు రాష్ట్ర ప్రజానికానికి అంత నమ్మకమేంటీ.. సీఎంగా రేవంత్ రెడ్డే ఎందుకు.. ఆయనకున్న అర్హత లేంటీ అన్న చర్చ నడుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి జడ్పీటీసీగా గెలిచి.. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన ఓ సాధారణ వ్యక్తి ఏదో ఓ రోజు సిఎం అవుతానని ఆరోజే కలగన్నాడు. ఇప్పుడు ఆయన కోరుకోకపోయినా.. అటు అధిష్ఠానం, ఇటు ప్రజలు ఆయనే కావాలని బలంగా నమ్ముతున్నారంటే.. ఆయనలో ఏదో ఉంది.. అదేంటీ..?
సీఎం కావాలన్న లక్ష్యం 17 ఏళ్ల క్రితమే..: 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి.. ఎవి కాలేజీలో బిఎ చదివారు. ఆ సమయంలోనే.. ఎబివిపి తరపున స్టూడెంట్ లీడర్‌గా యాక్టీవ్ రోల్ ప్లే చేశారు. కట్ చేస్తే.. 2006లో మిడ్జిల్ మండలం జడ్‌పిటిసి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి గెలిచారు. అనంతరం.. 2007లో మాహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన చురుకుదనం చూసి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి పసుపు కండువా కప్పితే.. మరింత ఉత్సాహంతో పని చేశారు. 2009లో టిడిపి తరపున కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబుకు చాలా దగ్గరైపోయి.. పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషించారంటే.. ఆయనకున్న కమిట్‌మెంటే కారణం.
ఆ ఒక్క అరెస్టుతో మారిపోయిన సీన్: ఇక.. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ కావటంతో రేవంత్ రెడ్డి తెలంగాణలో ఓ సంచలనంగా మారిపోయారు. అయితే.. రేవంత్ ఏమాత్రం భయపడకుండా.. ఇదంతా కేసీఆర్ అండ్ కో పన్నిన కుట్రగా తిప్పికొట్టారు. ఆ సమయంలోనే.. కెసిఆర్‌్‌ను సిఎం కుర్చీ నుంచి దించుతానని మీసం తిప్పి మరీ శపథం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా ఆయన ఓ అతిథిగా వచ్చి వెళ్లటం లాంటి ఘటనలతో తీవ్రంగా బాధపడిన రేవంత్ రెడ్డి.. ఏమాత్రం కుంగిపోలేదు. వేరే నేతలైతే తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయంతో.. ఎక్కడో ఓ పాయింట్‌లో సరెండర్ అయిపోయే వారేమో. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం అర్జున్ రెడ్డి టైపులో మరింత అగ్రెస్సివ్‌గా మారిపోయారు.
టిడిపి వద్దనుకుంది.. హస్తం కావాలనుకుంది: జైలుకు వెళ్లి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత.. సీన్ మొత్తం మారిపోయింది. ముందు నుంచీ కొంత అగ్రెస్సిన్ నాయకుడిగానే పేరున్న రేవంత్.. ఆ తర్వాత తన మాటల్లో, విమర్శల్లో పదును పెంచారు. మైక్ పట్టుకుంటే చాలు కెసిఆర్‌తో పాటు ఆయన ఫ్యామిలీ మీద పరుష పదజాలంతో శివాలెత్తి పోయేవారు. సొంతంగా సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేసుకుని తన ఇమేజ్‌ను గణనీయంగా పెంచుకోగలిగారు. అదే సమయంలో.. తెలంగాణలో టిడిపి బలహీనపడిపోవటం.. ఎమ్మెల్యేలంతా సైకిల్ దిగి కారెక్కటంతో.. రేవంత్ ఒంటరిగా మిగిలిపోయారు. మరోవైపు.. చంద్రబాబు కూడా తెలంగాణపై అంతగా దృష్టి పెట్టకపోవటంతో ఆయన భవితవ్యం శూన్యంగా మారింది. అదే సమయంలో.. కొత్త పార్టీ పెట్టాలని ఆయన అభిమానులు కోరగా.. అప్పటికే బలహీనమైపోతున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌తో టచ్‌లోకి వచ్చారు. ఈ విషయం బాబుకు తెలియటంతో.. ఆయణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఏడాదిలోనే సీనియర్లకు పోటీగా: ఇంకేముంది.. హస్తంతో రేవంత్ దోస్తీ కుదిరిపోయింది. 2017 అక్టోబర్ 30న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా భుజాన వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి రేవంత్.. పొలిటికల్ కెరీర్ మరింత పుంజుకుంది. ఆయన వాగ్ధాటితో అధికార బిఆర్‌ఎస్ నేతలపై.. ముఖ్యంగా కెసిఆర్ మీద బలమైన విమర్శలు చేస్తూ.. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు తిప్పుకుని.. ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తన చురుకుదనం, అగ్రెస్సివ్‌నెస్‌తో పార్టీలో చేరిన ఏడాదికే అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. దీంతో.. టిపిసిసి అధ్యక్షుని రేసులో ఇద్దరు సీనియర్ల సరసన నిలిచారు. కానీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డికే అధిష్ఠానం పార్టీ పగ్గాలు అప్పజెప్పింది.
పార్టీని జీరో నుంచి హీరోగా మార్చి: కానీ.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ పరాభవమే మూటగట్టుకుంది. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి సైతం ఓడిపోయారు. దీంతో ఆయనపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత 2019లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొంది తిరిగి తన సత్తా చాటారు. ఎంపీగా గెలవటంతో.. డిల్లీి నేతలతో సత్సంబంధాలు పెంచుకునేందుకు రేవంత్‌కు మంచి అవకాశంగా మారింది. దీంతో.. 2021లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి.. టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. అందుకు కారణం.. యువనేత, అగ్రెస్సివ్ స్పీచులతో ప్రజలను ఆకట్టుకుంటూ మాస్ లీడర్‌గా పేరుతెచ్చుకోవటం, ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉన్న పార్టీకి ఊపిరిలూదేందుకు కావాల్సిన స్ట్రాటజీలున్న నేతగా గుర్తించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతుతారు. ఇక అప్పటి నుంచి రేవంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఆర్టిస్టు నుంచి సిఎం దాకా : రేవంత్ రెడ్డి 1969, నవంబరు 8న తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించాడు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్నా ఆర్ట్స్ లో సాధన చేశారు. ఆర్టిస్టు నుంచి ముఖ్యమంత్రి దాకా అనేక ఆటుపోటులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సారథిగా వెలుగొందుతున్నాడు. ప్రజలకు మంచి చేసి చిరస్థాయిగా నిలుస్తాడని ఆశిద్ధాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి