25, ఏప్రిల్ 2020, శనివారం

న్యూయార్క్‌లో కరోనా విలయానికి కారణం చైనా కాదట..!

న్యూయార్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యమైన అమెరికాపై కొవిడ్ విజృంభిస్తోంది. అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్.. ప్రపంచంలోనే కరోనా వైరస్‌కు అతిపెద్ద హాట్‌స్పాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో కరోనా వైరస్ ప్రబలడంపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆండ్రూ క్యూమో.. న్యూయార్క్‌లో కరోనా ప్రబలడానికి కారణం చైనా కాదని పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి యూరప్ దేశాల నుంచి న్యూయార్క్‌లోకి ప్రవేశించిందని వెల్లడించారు. న్యూయార్క్‌లో మార్చి 1న మొదటి కరోనా కేసు నమొదవ్వడానికి ముందే దాదాపు 10వేల మంది కొవిడ్ బారినపడ్డట్లు ఓ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో వెల్లడైందన్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫిబ్రవరి 2నే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాజ్ఙలు విధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఆదేశాలు జారీ చేసిన నెల తర్వాత యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ట్రంప్ ఆంక్షలు విధించారన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. అమెరిలోకి కరోనా అడుగుపెట్టకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అయితే తాను మాత్రం న్యూయార్క్‌లోకి కరోనా వైరస్ ఇటలీ నుంచి వ్యాప్తి చెందినట్లు నమ్ముతున్నానన్నారు. న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 2.77లక్షల మంది కరోనా బారిపడ్డారు. 21వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

కామెంట్‌లు లేవు: