13, జనవరి 2011, గురువారం

మా ఊరిలో సంక్రాంతి

సంక్రాంతి. ఇది రైతుల పండుగ. కంటికి కునుకు లేకుండా అహర్నిశలూ శ్రమించిన అన్నదాత కళ్లలో వెలుగులు నింపే ఆనందాల పండుగ. వరి, కందులు, వేరుశనగ వంటి పంటలు ఇంటికొచ్చే ధాన్యం పండుగ. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారిని ఒక్కచోటికి చేర్చే మమతానురాగాల పండుగ. కొత్తబట్టలు కట్టుకోకూడదనే అపవాదును మూటగట్టుకున్న కీడు పండుగ. మూడు రోజుల పాటు జరుపుకునే అతిపెద్ద పండుగ. తెలుగువారి ప్రియమైన పండుగ. ఇన్ని విశేషాలున్న సంక్రాంతి గొప్పధనాన్ని తెలుసుకోవాలంటే తెలుగు పల్లెలవైపు ఓ సారి తొంగిచూడాలి. మంచులో తడిసిన పల్లె, ఎగిసిపడే భోగిమంట, ముచ్చటైన ముత్యాలముగ్గు, ఘల్లు ఘల్లుమని మోగుతూ ఎదురొచ్చే ఎడ్లబండీ పల్లె అందాల్ని ఇనుమండింపజేస్తాయి. రవి కుంచె నుండి జాలువారిన వర్ణచిత్రాల్లా మనసు పొరల్లో ముద్రించుకుపోతాయి.
మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గం బుద్ధారం గ్రామంలో సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటారు. గిరిజనుల నృత్యాలు ఈ పండగకు అదనపు ఆకర్షణ. గ్రామంలో 6,000 మంది జనాభా ఉంది. అందులో 1,000 మంది గిరిజనులు ఉన్నారు. వ్యవసాయం, వలసలు గ్రామ ప్రధాన జీవనాధారాలు. పండుగ వారం రోజులు ఉందనగా పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారంతా కన్నతల్లిలాంటి పల్లెకు చేరుకుంటారు. ఇంటికి రాగానే గుమ్మంలోనే ఎదురుచూసే అమ్మానాన్నలను పట్టుకుని ఆడపడుచులు 'ఘొల్లు'మంటారు. ఏడాదిపాటు గుండెల్లో గూడుకట్టుకున్న ఎడబాటు కరిగిపోయేదాకా కంటతడిపెడతారు. ఇళ్లలోని సామానంతటినీ బయటపెట్టి శుభ్రంచేస్తారు. పుట్టమట్టి, పేడ, బూడిద కలగలిసిన మిశ్రమాన్ని గోడలకు పూస్తారు. మధ్యలోనే సున్నం చారికలను వేస్తారు. ఈ పది రోజుల కాలంలో పల్లెను మంచు వీడకుండానే పొలానికి వెళ్లిన రైతులు బండినిండా ధాన్యంతో ఇళ్లకు చేరుకుంటారు. బండి వస్తుంటే.. పోతుంటే.. ఎడ్లమెడలో ఉన్న మువ్వలు 'ఘల్లు.. ఘల్లు'మని చేసే శబ్ధం వీనుల విందుగా ఉంటుంది. బండి వాకిట్లోకి రాగానే మహిళలు ఇంట్లోకి వెళ్లి చెంబునిండా తెచ్చిన కలిని బండిమీదుగా చల్లుతారు. అలా చల్లితే ఏదైనా దిష్టి తగిలితే పోతుందని వారి ప్రగాఢ నమ్మకం. భోగిరోజు ఉదయాన్నే లేచి మంట పడెతారు. అంతకు ముందు రోజు ఇంటిని శుభ్రం చేయగా పోగుచేసిన చెత్తా చెదారాన్నీ, అవసరం లేని పాత చాట, చీపురు, ఇతర వస్తువులను ఆ మంటలో వేస్తారు. ఆ తర్వాత కొత్తవి కొనుక్కుంటారు. తెల్లవారగానే వేడినిళ్లు పెట్టుకుని అందులో నువ్వులు వేసుకుని స్నానం చేస్తారు. ఉతికిన బట్టలు ధరిస్తారు. నువ్వులతో చేసిన రొట్టెల్లోకి దొండ, వంకాయ, ఆలుగడ్డ వంటి ఐదు రకాల కూరగాయలతో చేసిన కూరను ఇష్టంగా తింటారు. పండుగ సందర్భంగా భోగి రోజు గ్రామంలో 60 నుండి 70 కిలోలున్న బండ ఎత్తడం(మనుషులు), బండలాగుడు(పశువులు), ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం బహుమతులను ప్రదానం చేస్తారు. ధనుర్మాసం ఆరంభం నుండే ఇళ్లముందు కల్లాపి చల్లి రంగవల్లులు వేసే మహిళలు, యువతులు సంక్రాంతి రోజు ప్రత్యేకమైన రథం ముగ్గు వేస్తారు. దీనిని బియ్యం పిండితో వేయడం ప్రత్యేకత. ముగ్గు వేశాక రంగులు వేస్తారు. పేడ, కుంకుమ, పసుపు, గరకలతో తయారు చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెడతారు. ఒకరు వేసిన ముగ్గును పక్కింటి వారి ముగ్గుతో కలుపుతూ పోతారు. ఇలా గొలుసుకట్టుగా కలుపుతారు. 'ఇది ఇరు కుటుంబాల మధ్యన ఐక్యమత్యాన్ని తెలుపుతుంది' అంటారు గ్రామ మహిళ ప్రసన్నలక్ష్మి. ఇళ్లకు మామిడాకులు, బంతిపూలతో తోరణాలు కడతారు. తర్వాత పాలు పొంగిస్తారు. పిండి వంటలు చేసుకుని తింటారు. రైతులు పశువులను దగ్గర్లోని బోర్ల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయిస్తారు. ఇంటికొచ్చాక వాటికి బొట్లు పెడతారు. అలంకరించి పూజలు చేస్తారు. బండ్ల గిర్రలను విప్పి జనుం(మరమ్మతు) వేస్తారు. ఆ తర్వాత రంగు రంగుల కాగితాలు, మామిడాకులు, బంతిపూలతో వాటినీ అలంకరిస్తారు. సాయంత్రం కాగానే బండ్లను గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. ముందు భజన బృందం వెళ్తుంది. దాని వెనుక రైలు పెట్టెల్లా బండెనక బండి గ్రామం నుండి ఆలయం వరకు బారులు తీరుతాయి. ఎడ్ల కాళ్ల గిట్టలు చేసే శబ్ధం వాటి మెడల్లోని మువ్వల శబ్ధానికి తాళం వేసినట్లుగా ఉంటుంది. ఇది ఏ సంగీత దర్శకునికీ అందని బాణి. బండ్లపై వెళ్తున్న క్రమంలో ఒకరిని ఒకరు పలుకరించుకుంటారు. వలస వెళ్లి వచ్చిన వారినీ, అత్తవారింటినుంచి వచ్చిన వారినీ కుశల ప్రశ్నలు అడుగుతారు. ఈ ఆలయం వద్దకు గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల బండ్లూ వస్తాయి. బండ్లు ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు చుట్టూ నిల్చున్న వారికి బండ్లపై ఉన్న వారు నూకలు, బెల్లం కలిపిన ఫలహారం పంచుతారు. నేల ఈనినట్టు ఆలయం చుట్టూ ఎక్కడ చూసినా ప్రజలే కనిపిస్తారు. మహిళలు బొడ్డెమ్మ కొట్టగా... పురుషులు కోలాటాలు ఆడతారు. ఆ దృశ్యం కనువిందు చేస్తుంది. కనుమ రోజు ఆలయం వద్దకు వన భోజనాల కోసం వస్తారు.
ప్రత్యేకం గిరిజనుల నృత్యం
ఈ పండుగకు గ్రామానికి చుట్టుపక్కల ఉండే తండాల గిరిజనులు చేసే సాంప్రదాయ నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది. 'పండగకు గిరిజనులు అద్దాలతో కూడిన సంప్రదాయ వస్త్రాలను ధరిస్తారు. ఇంటింటికీ తిరిగి నృత్యం చేస్తారు. పాటలు పాడతారు. గతంలోలా ఇప్పుడు గిరిజనులు సాంప్రదాయ దుస్తులను ధరించడం తగ్గిపోయింది. ఆ డ్రస్సుపై ఉన్న మక్కువను కొందరు సంక్రాంతి పండుగ రూపంలో తీర్చుకుంటున్నారు'అని చెప్తారు ఎంపిటిసి పూల్యానాయక్‌.
పండగపై సంస్కరణల ప్రభావం
సంక్రాంతి పండుగపై సంస్కరణల ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో యంత్రీకరణ పెరగడంతో పల్లెలకు శోభను తెచ్చే పశు సంపద తగ్గిపోతోంది. బుద్ధారం గ్రామంలో 15 ఏళ్ల కిందట రెండు ట్రాక్టర్లు ఉండేవి. నేడు ఆ సంఖ్య 25కు చేరింది. గ్రామంలో ఇంకా 25 ఆటోలు, 100కుపైగా బైక్‌లు, ఐదు ఫోర్‌ వీలర్స్‌ ఉన్నాయి. 'పదేళ్ల కిందట సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామం నుండి 100కుపైగా బండ్లు ఆలయానికి వెళ్లేవి. నేడు ఆ సంఖ్య 30కి చేరింది. పశు సంపద తగ్గడంతో పల్లెలు శోభను కోల్పోతున్నాయి'అని పల్లెలపై పరుచుకున్న సంస్కరణల విష వలయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు మాజీ సర్పంచి అచ్యుతరామారావు. 'వెనకటికి ప్రతి ఇంటికీ ఓ ఒండి ఉండేది. సంక్రాంతి రోజు అందరూ బండ్లు కట్టేవారు. ఇంటిల్లిపాదీ బండిపై ఊరేగింపుగా వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అందరికీ సైకిల్‌ మోటార్లు ఉన్నాయి. వాటిపై వెళ్లి వస్తున్నారు. ఒకరినొకరు పలుకరించుకోవడం తగ్గిపోయింది. బండ్ల మీద వెళ్లేటప్పుడు కనిపించినవారందరినీ ఆప్యాయంగా పలుకరించేవారం'అని నాటికీ నేటికీ ఉన్న తేడాను వివరించారు గ్రామ వద్ధులు నరసింహయ్య, మునుగాల నారాయణ.
కొత్త బట్టలు ఎందుకు వేసుకోరంటే...
సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు. అందుకే ఈ పండుగకు కొత్త బట్టలు వేసుకోరు. పాత బట్టల్ని ఉతుక్కుని వేసుకుంటారు. 'ధనుర్మాసంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి సంక్రమిస్తాడు. ఈ కాలాన్ని సంక్రమణ కాలం అంటారు. ఈ కాలం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండగకు కొత్త బట్టలు ధరించరు'అని కీడు నేపథ్యాన్ని గండిఆంజనేయస్వామి ప్రధాన అర్చకులు విజయరత్నం వివరించారు.
సంక్రాంత్రి కీడు పండుగ
రాయలసీమ పల్లెల్లో ప్రజల నమ్మకం
సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు. అందుకే ఈ పండుగకు కొత్త బట్టలు వేసుకోరు. పాత బట్టల్ని ఉతుక్కుని వేసుకుంటారు. 'ధనుర్మాసంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి సంక్రమిస్తాడు. ఈ కాలాన్ని సంక్రమణ కాలం అంటారట. ఈ కాలం మంచిది కాదని చెబుతారు. . అందుకే ఈ పండగకు కొత్త బట్టలు ధరించరు' అని కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్చాల శివాలయ అర్చకుడు రామానుజాచార్యులు కీడు నేపద్యాన్ని చెప్పారు. ఆయన వివరాల ప్రకారం..... సంక్రాంతికి అన్ని పంటలు ఇంటికి వస్తాయి. శాస్త్ర ప్రకారం ఇది కీడు పండుక కాకపోయినా మహబూబ్‌నగర్‌, కర్నూలు , అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాలక్రమంలో అలా వచ్చిందని అంటారు. మాపూర్వీకులు కూడా కీడు అనేదానికి సరయిన వివరణ ఇవ్వలేదని కేవలం జనపదాలలో వచ్చిన పద్దతే అని తెలిపారు. ఇంటికి వచ్చిన ధాన్యం నుంచి వృత్తుల వారికి , పురోహితులకు సంభావన ఇచ్చేవారు. సంభావన ఇచ్చినప్పుడు దాన్యంలోపల ఒకటి రెండు ఇనుపసీలలు వేసి ఇచ్చేవారు. అలా ఇస్తే శనిదోషం పోతుందని నమ్మకం. 10 సంవత్సరాల నుంచి సంభావనకు కూడా వెల్లడం లేదు. గ్రామంలో వృత్తులు అన్ని అంతరించాయి. అప్పటి గౌరవం వృత్తుల వాళ్లకు గ్రామాల్లో లేదు. ఏదయినా పండుగ అంటే జీర్ణవస్తువులు ధరించరాదని పెద్దలు చెప్పేవారు. కాని సంక్రాంతికి మాత్రం కొత్తబట్టులు ధరించకుండా పాతబట్టలను శుభ్రం చేసుకుని ధరిస్తారు. మామూలుగా అందరూ ఈ పండుగ రోజు కూడా పనులకు వెళ్తారు. పండుగ అంటే దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. కాని సంక్రాంతికి ఉల్చాలలో దేవాలయానికి వెళ్లరు. అన్ని పండుగలకు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మా ఊర్లో అస్సలు వ్యాపారాలు సాగవు. సంక్రాంతి పోతే తప్ప మంచి రోజులు రావని ఇక్కడి ప్రజల నమ్మకం. పెళ్లిళ్లు, తదితర శుభకార్యాల గురించి కూడా మాట్లాడరు.
సేకరణ: ప్రదీప్‌ తమ్మడి/ పానుగంటి చంద్రయ్య

2 కామెంట్‌లు:

VENKATA SUBA RAO KAVURI చెప్పారు...

సంక్రాంతి సమీక్ష భలే బాగుంది

panuganti చెప్పారు...

సుబ్బారావుగారు మీ కాంప్లిమెంటుకు ధన్వవాదాలు. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.