12, జనవరి 2011, బుధవారం

దళిత వాడల పట్ల సర్కారు వివక్ష

-జాన్‌వెస్లీ
యస్సీ సబ్‌ప్లాన్‌ ప్రకారం బడ్జెట్‌లో 16.2 శాతం నిధులను ఎస్సీ నోడల్‌ ఏజెన్సీకి కేటాయించాల్సి వున్నా ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. వీటిని ఇతర రంగాలకు మళ్లిస్తున్నారు. గత 19 సంవత్సరాలలో ఇలా దారి మళ్లించిన నిధులు 25,604 కోట్లు, కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం కోత విధించిన 11,340 కోట్లు, ప్రణాళికా సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ సూచనల ప్రకారం తిరిగి ఎస్సీ నోడల్‌ ఏజెన్సీకి కేటాయించి దళితవాడల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఫిబ్రవరి నుండి జరగబోయే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అన్ని పార్టీల శాసనసభ్యులు ఈ సమస్యపై సమగ్రంగా చర్చించాలి.

అగ్రవర్ణ దురహంకారులు దళితులను రకరకాల సామాజిక వివక్షకు గురిచేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో తరహా వివక్ష చూపుతున్నాయి. పల్లెల్లోను, పట్టణాల్లోనూ అగ్రవర్ణాలు, ధనికవర్గాలుండే వాడలు అభివృద్ధి చెందుతుంటే దళితవాడలు ఎలాంటి సౌకర్యాలు లేక వెలివేసినట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు, మండలాలు వెనుకబడిన మాట ఎంత వాస్తవమో ఈ వెనుకబడిన ప్రాంతాల్లో దళితవాడలు మరింతగా వెనుకబడి ఉన్నాయనేదీ అంతే వాస్తవం. తమ ప్రాంతం వెనుకబడిందని చెప్పే నాయకులు తమ ప్రాంతంలో దళిత వాడల వెనుకబాటుతనం గురించి కనీసం ప్రస్తావించరెందుకని? వీటికి నిధుల కేటాయింపుల్లో కోత, కేటాయించిన అరకొర నిధులను కూడా ఖర్చు చేయరు. దళితులకు ఖర్చు చేయాల్సిన వాటిని వేరే రంగాలకు మళ్లిస్తారు. గత 19 సంవత్సరాల బడ్జెట్‌లో కోత విధించిన ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు, దళితేతరులకు ఖర్చు చేసిన 25,604 కోట్లు తిరిగి దళితులకు ఇవ్వడం ద్వారా ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి. వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లుగానే దళితవాడల అభివృద్ధికి కూడా ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. వీటి అమలుకు ఒక ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు దీనిపై దృష్టి సారించాలి. అభివృద్ధిలో దామాషా ప్రాతిపదికపై దళితులకు దక్కాల్సిన వాటా దక్కేలా చూడాలి.  2010 అంచనా ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది దళితులు ఉన్నారు. 39 లక్షల దళిత కుటుంబాలు, 55,972 దళితవాడలు ఉన్నాయి. వీరిలో 80 శాతం దాకా గ్రామీణ ప్రాంతాల్లో వుండగా, పట్టణాల్లో 20 శాతం ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 ప్రకారం కులం, మతం, లింగ, ప్రాంతం పేరుతో ఎవరిపట్ల వివక్ష చూపరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 చెబుతోంది. ప్రతి పౌరుడికి సమాన హక్కులతోపాటు సంపద, వనరుల్లో సమాన అవకాశాలు కల్పించాలని ఆదేశిక సూత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నా దళితుల పట్ల అంటరానితనం, వివక్ష, దాడులు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు సాగుతూనే ఉన్నాయి. భూమి, నీరు, ప్రకృతి వనరులు, సంపద, బడ్జెట్‌లలో వీరికి న్యాయంగా లభించాల్సిన వాటా దక్కడం లేదు. గ్రామాల్లో అగ్రకుల ధనికుల సంఖ్య తక్కువే అయినా విశాలమైన ప్రదేశంలో విలాసవంతమైన భవంతులు కట్టుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న దళితులు మాత్రం గాలి వెలుతురు లేని ఇరుకైన ఇళ్లల్లో ఉండాల్సి వస్తున్నది. రాష్ట్రంలో జానెడు ఇళ్ల స్థలం కూడా లేని దళిత కుటుంబాలు 13 లక్షల దాకా వున్నాయి. పట్టణాల్లో ఒకవైపు ఆకాశాన్నంటే హర్మ్యాలు, మరో వైపు మురికి కాలువల ఒడ్డున చిన్న గుడిసెల్లో రెండేసి, మూడేసి కుటుంబాలు కాపురాలు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. 3 లక్షల 12 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా స్థలం లేనికారణంగా ఇళ్లు నిర్మించుకోలేక పోయారు. ప్రభుత్వానికి దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా గ్రామాల్లోని 6 లక్షల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 3 సెంట్లు చొప్పున 18 వేల ఎకరాలు, పట్టణాల్లో 7 లక్షల కుటుంబాలకుగాను ఒక్కొక్క కుటుంబానికి 100 గజాల చొప్పున 14,463 ఎకరాలు, మొత్తం 32,463 ఎకరాల భూమిని ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంతవరకు 12,76,902 మంది దళితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 6,06,548 ఇళ్లు పూర్తికాలేదు. పూర్తయ్యాయంటున్న ఇళ్లలో సగం దాకా పాత వాటికి మరమ్మతులతో సరిపెట్టినవే. నిధులు సరిగా అందక 2,94,724 ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న నిధులు (20 వేలు) ఇవ్వలేదు. సిమెంటు, ఐరన్‌, కలప ధరలు విపరీతంగా పెరిగినందున ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని లక్ష రూపాయలకు పెంచాలి. ఆ లెక్కన 13 లక్షల ఇళ్ల నిర్మాణానికి 13 వేల కోట్లు, మధ్యలో నిలిచిపోయిన 2,94,724 ఇళ్లకు 50 వేల చొప్పున 1,473 కోట్లు, 20 వేలు అదనంగా ఇవ్వాల్సిన 6 లక్షల ఇళ్లకు 1200 కోట్లు మొత్తం 15,674 కోట్లు కేటాయించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 వేల దళితవాడలకు నేటికీ మంచినీటి సౌకర్యం లేదు. వాస్తవానికి 50 శాతానికి పైగా దళితవాడలకు తాగునీటి సరఫరా లేదు. దీంతో కలుషిత నీరు తాగి అనార్యోగాలకు గురౌతున్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ తీసుకునే స్థోమత లేదు. రక్షిత మంచినీటి కోసం ప్రతి దళితవాడకు 2 లక్షల చొప్పున 10,075 వాడలకు 201 కోట్లు కేటాయించాలి. మిగిలిన 45,895 దళితవాడలకు ఒక లక్ష చొప్పున 458.92 కోట్లు కేటాయించాలి. 80 శాతం దళిత కుటుంబాలు మరుగుదొడ్ల సౌకర్యం లేక నిత్యం అనేక అవస్థలు పడుతున్నారు.కొన్ని వాడల్లో బహిర్భూమికి స్థలమే ఉండడం లేదు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.2,700 ఏ మూలకూ చాలడం లేదు. కాబట్టి ఈ సహాయాన్ని రూ.5 వేలకు పెంచాలి. ఆ ప్రకారం 35 లక్షల కుటుంబాలకు 1750 కోట్లు కేటాయించాలి.
దళితవాడల్లో చిన్న ఇళ్లు, వీధులతో ఇరుకుగా ఉంటున్నాయి. పెళ్ళిళ్లు, ఇతర శుభ కార్యాలకు కమ్యూనిటీ హాళ్లు ఉండడం లేదు. ఫంక్షన్‌ హాళ్లకు రెంట్‌ చెల్లించే స్తోమత వీరికి లేదు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయించకుండా ఈ బాధ్యతను జిల్లా పరిషత్‌లకు ప్రభుత్వం అప్పగించింది. దళిత జనాభా అధికంగా ఉన్న 15 వేల గ్రామాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికిగాను గ్రామానికి 5 లక్షల చొప్పున 750 కోట్లు కేటాయించాలి.
దళితవాడల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా వున్నది. దళిత వాడలకు కేటాయించిన నిధులు దళితేతరవాడలు, ప్రాంతాలకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం 39 వేల దళితవాడలకు రోడ్లు, డ్రైెనేజీ సౌకర్యం కల్పించేందుకు వాడకు 3 లక్షల చొప్పున 1,170 కోట్లు కేటాయించాలి. గతంలో వేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేని వాడలకు లక్ష చొప్పున కేటాయించాలి.
శ్మశాన స్థలాలను అడుక్కోవాలా?
బతికున్నంత కాలం గుడిసెకింత జాగా కోసం పోరాడిన దళితులు చనిపోయిన తర్వాత శవాన్ని పాతిపెట్టడానికి కాసింత చోటు కోసం కూడా పోరాడాల్సిన దుస్థితి నెలకొన్నది. శ్మశానాలు లేక దూరంగా నదులు, కుంటలు, వాగులు, రైల్వే ట్రాక్‌ల దగ్గరకు తీసుకెళ్లి శవాలను సమాధి చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి శ్మశాన స్థలాలను సైతం పెత్తందార్లు ఆక్రమిస్తున్నారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ప్రతి దళితవాడకు 2 ఎకరాల శ్మశాన స్థలాలు ఇవ్వాలని కెవిపిఎస్‌ ఆధ్యర్యాన దళితులు శవపేటికలతో కలెక్టరేట్లను స్తంభింపజేశారు. చలో అసెంబ్లీ నిర్వహించారు. ఈ ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం అన్నిమతాల వారికి శ్మశాన స్థలాలు మూడేళ్లలో కేటాయిస్తామని చెప్పి జి.ఓ.నెం. 1235ను జారీ చేసింది. అయితే దాని అమలును మరచింది. శ్శశాన స్థలాలు లేని 10 వేల గ్రామాలకు 2 ఎకరాల చొప్పున 20 వేల ఎకరాలు వెంటనే కేటాయించాలి. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనైనా ఇవ్వాలి.
దళితవాడలకు విద్యుత్‌
ట్రాన్స్‌కో లెక్కల ప్రకారమే 2007 చివరి నాటికి 4,532 దళితవాడలకు విద్యుత్‌ సౌకర్యం లేదు. ఊరంతా లైట్లు వెలుగుతుంటే చాలా దళితవాడలు చీకట్లో మగ్గుతున్నాయి. విద్యుత్‌ సౌకర్యం ఉన్న వాడల్లోకూడ తగినన్ని స్తంభాలు లేవు. ఉన్నా లైట్లు వెలగవు. విద్యుత్‌ సౌకర్యం మెరుగుపరిచేందుకు గాను ఒక్కో దళిత వాడకు లక్ష రూపాయల చొప్పున 4,532 వాడల్లో విద్యుత్‌ సౌకర్యానికి 46 కోట్లు కేటాయించాలి. అలాగే ప్రతి దళితవాడకు సరిపడా స్థంభాలు , లైట్లు వేసేందుకు 50 వేల చొప్పున 254 కోట్లు కేటాయించాలి. 2009 లెక్కల ప్రకారం రాష్ట్రంలో సంవత్సరానికి 68 వేల మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. దళితుల వాటా కింద 11వేల మిలియన్‌ యూనిట్లు కేటాయించాలి. కానీ, ఒక శాతం కూడా పూర్తిగా కేటాయించడం లేదు. 35 లక్షల కుటుంబాలకు 75 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్‌ అందిస్తే సంవత్సరానికి 315 కోట్ల యూనిట్లు అవసరమవుతాయి. ఇందుకు గాను బడ్జెట్‌లో సంవత్సరానికి 630 కోట్లు కేటాయించాలి. రాష్ట్రంలో 593 ఎస్సీ సంక్షేమ హాస్టల్స్‌, 513 కళాశాల హాస్టల్స్‌కు సొంత భవనాలు లేవు. భవనానికి 20 లక్షల చొప్పున లెక్కించినా మొత్తం 1,106 హాస్టల్స్‌కు సొంత భవనాల నిర్మాణానికి 221 కోట్లు కేటాయించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్టీలు కూడా పెంచాలి.దళితవాడల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తగినన్ని లేవు. ఉపాధ్యాయ సిబ్బంది కొరత ఉంది. ప్రాథమిక విద్యను పెంచేందుకు దళితులు 40 శాతంగా ఉన్న 9,189 గ్రామాల్లో ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ వైద్యశాలలు ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మందులు, డాక్టర్లు, సిబ్బంది, కనీస సౌకర్యాలు లేక మూతపడే దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1581 పిహెచ్‌సిలు మాత్రమే ఉన్నాయి. 5 వేలకు పైగా జనాభా కలిగిన 9,201 గ్రామాల్లో పిహెచ్‌సిల ఏర్పాటు చేసి, వైద్యులు, మందులు అందుబాటులో వుండేలా చూడాలి. ఆరోగ్యశ్రీ కింద దళితులకు అన్ని రోగాలకు ఉచిత వైద్య సౌకర్యం ల్పించాలి.
బడ్జెట్‌లో వాటా
ఇన్ని నిధులు ఎక్కడి నుండి వస్తాయని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో 16.2 శాతం దళితులకు కేటాయించి ఖర్చు చేయాలనే నిబంధనలు, జాతీయ ప్రణాళికా సంఘం సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అమలు చేయడం లేదు. కెవిపిఎస్‌ ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేసింది. అయితే నిధులన్నిటినీ కలిపి కేటాయించడం లేదు. మొత్తం 1,95,044.05 కోట్ల ప్రణాళికా బడ్జెట్‌లో దళితులకు న్యాయంగా 31,597.14 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, 27,440.24 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో కూడా 14,361.50 కోట్లు (7.36శాతం) మాత్రమే ఖర్చు చేసింది. ఫలితంగా గత 7 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో దళితులకు ఖర్చు చేయాల్సిన నిధుల్లో 17,235.64 కోట్లు కోత పెట్టారు. అంతకుముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పాలనలోను 4,047 కోట్లు కోత పెట్టారు. ఖర్చు చేశామంటున్న నిధుల్లో దళితులకు ప్రయోజనం లేని రంగాలకు ఖర్చు చేసి దళితులను అభివృద్ధి చేసినట్లు లెక్కలు చూయిస్తున్నారు. గత వార్షిక బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన నిధుల్లో 430 కోట్లు హుసేన్‌ సాగర్‌ ఆధునీకరణ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పార్కుల అభివృద్ధి, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం వంటి వాటికి కేటాయించారు. యస్సీ సబ్‌ప్లాన్‌ ప్రకారం బడ్జెట్‌లో 16.2 శాతం నిధులను ఎస్సీ నోడల్‌ ఏజెన్సీకి కేటాయించాల్సి వున్నా ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. వీటిని ఇతర రంగాలకు మళ్లిస్తున్నారు. గత 19 సంవత్సరాలలో ఇలా దారి మళ్లించిన నిధులు 25,604 కోట్లు, కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం కోత విధించిన 11,340 కోట్లు, ప్రణాళికా సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ సూచనల ప్రకారం తిరిగి ఎస్సీ నోడల్‌ ఏజెన్సీకి కేటాయించి దళితవాడల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఫిబ్రవరి నుండి జరగబోయే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అన్ని పార్టీల శాసనసభ్యులు ఈ సమస్యపై సమగ్రంగా చర్చించాలి. బడ్జెట్‌లో దళితులకు తగు న్యాయం జరిగేలా చూసేందుకు దళితులు, అభ్యుదయవాదులు ఐక్యంగా ఉద్యమించాలి.
(రచయిత కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

కామెంట్‌లు లేవు: