''నేను జగనన్న వదిలిన బాణాన్ని. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురిని..
అసమర్థ్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీడం...
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం....'' రెండే 'మరో ప్రస్థానం' ప్రధాన
లక్ష్యాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వై.ఎస్.షర్మిల
పిలుపునిచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన మరో
మహాప్రస్థానం పాదయాత్రను 2012 అక్టోబరు 18న ప్రారంభించారు. షర్మిల ఉదయం
పది గంటలకు తల్లి విజయమ్మ, వదిన భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి
ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం
సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం 11-45 గంటలకు షర్మిల పాదయాత్రను
ప్రారంభించారు. పాదయాత్రను వైఎస్ విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ
సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో షర్మిల
ప్రసంగించారు. ప్రజా ప్రస్థానం ప్రధానంగా రెండు అంశాలపైనే
దృష్టిపెడుతోందన్నారు. ఒకటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, రెండోది
ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీయడమని అన్నారు. దృఢ సంకల్పంతో
ప్రజల ముందుకు వస్తున్న తనను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. వైఎస్
రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి
వచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని, ఫీజు
రీయింబర్స్‌మెంటు ఇవ్వకుండా విద్యార్థులకు మొండిచేయి చూపుతోందని,
ఆరోగ్యశ్రీనీ మూసేసిందని విమర్శించారు. రాష్ట్రం తీవ్ర విద్యుత్
సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. వీటన్నింటిపై నిలదీయాల్సిన తెలుగుదేశం
పార్టీ మూడేళ్లుగా చోద్యం చూస్తోందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా
టిడిపి తన బాధ్యతను విస్మరించిందన్నారు. బాబు తన హయాంలో కిలో రెండు
రూపాయల బియ్యం, మద్యపాన నిషేధంపై ప్రజలను మోసగించారన్నారు. విద్యుత్
బిల్లులు చెల్లించలేని రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారన్నారు.
అవమాన భారంతో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు అన్ని విధాలా
విఫలమైన ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని బాబును ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి పార్టీలు తప్ప మూడోది ఉండకూడదనే కుట్ర
పన్నుతున్నారన్నారు. జగన్ ప్రజల మధ్య ఉంటున్నారనే ఉద్దేశంతో జైల్లో
పెట్టించారన్నారు. చీకట్లో చిదరబరంతో రహస్య ఒప్పందాలు చేసుకుని..
చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన ఎంపిలను ఆయన
వద్దకు పంపి సాక్షి ఆస్తులను జప్తు చేసేలా కుట్ర పన్నారని దుయ్యబట్టారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని,
నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పనిని
జగన్ చేస్తున్నారనే కుట్రపన్నారని చెప్పారు. జగన్ రాలేని
పరిస్థితుల్లోనే తాను పాదయాత్రను చేపట్టాల్సి వచ్చిందన్నారు. తాను జగనన్న
వదిలిన బాణాన్ని అని అన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడుతామని ఆమె ఈ
సందర్భంగా పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి