శభాష్ చావేజ్! వివా వెనిజులా!
అమెరికా ఆధిపత్యాన్ని అతి సమీపం నుంచి సవాలు చేసి...
అన్ని కుట్రలనూ కుహకాలనూ తట్టుకుని నాలుగో సారి అఖండ విజయం సాధించిన హ్యూగో
ఛావేజ్ హిప్ హిప్ హుర్రే! లొంగుబాటు కాదు తిరుగుబాటులోనే భవిష్యత్తు
వుందంటూ 21 వ శతాబ్ది సోషలిజం నినాదమిచ్చిన ఈ ధీరుడి గెలుపు వర్తమాన
చరిత్రకొక మలుపు. క్యూబా ధృవతార ఫైడెల్ కాస్ట్రో తర్వాత సమకాలీన
ప్రపంచంలో ఉత్తేజ ప్రదాత, ఉదాత్త నేత చావేజ్. అమెరికా కూటమి, అంతర్జాతీయ
బహుళజాతి కంపెనీలు, ముఖ్యంగా చమురు సంస్థల మాఫియా, అభివృద్ధి నిరోధకులు,
ప్రతీఘాత ప్రతిపక్షాలూ కలసి ధనరాశులు గుమ్మరించినా 30 పార్టీల కూటమిగా
ఏర్పడి కుట్రలు పన్నినా 54 శాతం పైగా ఓట్లు తెచ్చుకుని విజయ ఢంకా
మోగించాడు. చావేజ్‌పై అమెరికన్, లాటిన్ అమెరికన్ బడా పత్రికలన్నీ
శాపనార్తాలు పెట్టాయి. ఆయనను ఓడించడానికి ఇదే అదనని హడావుడి చేశాయి. ఆయన
స్వల్ప మెజారిటీతో గెలిచినా తట్టుకోలేడని జోస్యాలు చెప్పాయి.
ప్రత్యక్షంగానూ బోలెడు ప్రతికూల ప్రచారం సాగించాయి. అవన్నీ ఇప్పుడు
పటాపంచలయ్యాయి. చమురు సంపన్న దేశాలలో ఒకటైన వెనిజులా స్వంత కాళ్లపై
నిలబడటం సామ్రాజ్యవాదులకు ఎంతమాత్రం ఇష్టం లేని విషయం. ఎందుకంటే చావేజ్
చమురు సంస్థల జాతీయ కరణతో సహా అనేక ప్రగతిశీల చర్యలు చేపట్టారు. భూ
సంస్కరణలు అమలు చేసి భూమి పంచాడు. అన్నిచోట్లా ఉద్యోగాలు వూడగొట్టి పని
భారం పెంచుతుంటే వెనిజులాలో వారానికి నాలుగు పని గంటలు తగ్గిస్తూ చట్టం
చేశాడు. క్యూబాను ఆర్థిక దిగ్గంధనంలో బిగించాలని అమెరికా వత్తిడి
చేస్తుంటేదాన్ని ఆప్తమిత్రంగా అక్కున చేర్చుకున్నాడు. తనను ప్రాణాంతకమైన
కాన్సర్ వ్యాధి పీడిస్తే ఆ క్యూబాలోనే చికిత్స పొంది ఆరోగ్యంతో పాటు ఆశయ
బలం కూడా పెంచుకుని వచ్చాడు. ఆదివారం జరిగిన ఎన్నికలలో విజయంతో చావేజ్ మరో
ఆరేళ్లు అధికారంలో కొనసాగడమే గాక ఆర్థిక రంగంలో అభ్యుదయ కరమైన చర్యలన్ని
పూర్తి చేసే అవకాశం లభించింది. త్వరలో ఎన్నికలు జరిగే బొలీవియా, పెరూ,
అర్జెంటీనా,నికరాగ్వా తదితర దేశాలలోనూ ఇదే విధమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు
రావడం తథ్యంగా కనిపిస్తుంది. దేశ విదేశీ కార్పొరేట్ల వత్తిడికి
లొంగిపోవడమే పనిగా పెట్టుకున్న మన్మోహన్ సర్కారు ఈ ఎన్నికల తీర్పు కళ్లు
తెరిపించాలి. ప్రజలు ఈ ప్రత్యామ్నాయ విశిష్టతను అర్థం చేసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి