కర్ణాటక సంగీతాన్ని ప్రపంచానికి అందించిన పినాకపాణి సేవలు అందరికీ
స్ఫూర్తి నిచ్చాయని , ఆయన బహుముఖప్రజ్ఞాశాలి అని న్యాయాశాఖా మంత్రి ఏరాసు
ప్రతాపరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ, టిటిడి,
కర్నూలు జిల్లా యంత్రాంగం సంయుక్త నిర్వహణలో పద్మభూషణ్, సంగీత కళానిధి
డాక్టర్ శ్రీపాద పినాకపాణి నూరవ జన్మదినోత్సవాన్ని కర్నూలు కలెక్టరేట్
సునయన ఆడిటోరియంలో 2012 ఆగస్టు మూడున నిర్వహించారు. జిల్లా కలెక్టర్
సుదర్శన్‌రెడ్డి పినాకపాణి సన్మాన సభకు అధ్యక్షత వహించారు. ఈ
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ
ఒక చేతిలో స్టెతస్కోప్, మరోచేతిలో వీణ పట్టి సంగీతాన్ని నలుదిశలా చాటి
కర్నూలుకు కీర్తి ప్రతిష్ట తెచ్చారని అన్నారు. వైద్యంలో పేదలకు అశేష సేవలు
అందించారని కొనియాడారు. వ్యాయామంలో బాడీ బిల్డర్‌గా శరీరాన్ని ధృఢత్వంగా
మలుచుకున్నారని చెప్పారు. పినాకపాణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు.
1913లో శ్రీకాకుళంలో జన్మించి, విజయనగరంలో ఎదిగి, కర్నూలులో 1958లో వైద్య
వృత్తి చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారని తెలిపారు. కర్ణాటక సంగీతంలో ఎన్నో
మెళుకువలు నేర్చి, అనేక కీర్తనలకు, కృతులకు జీవం పోశారని కొనియాడారు.
మెడికల్ కాలేజీలో కొత్తగా నిర్మించే ఒక బ్లాకుకు , ఆయన నివాసస్థలం
నెహ్రూనగర్ రోడ్డుకు పినాకపాణి పురు పెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఆయన ప్రస్థానంలో ఎన్నో బిరుదులు, సన్మానాలు పొందారని, అవన్నీ ఆయన పాదాలను
అలంకరించిన పుష్పాలని పేర్కొన్నారు. టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రమణ్యం
,ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, కళానిధి నేదునూరి క్రిష్ణమూర్తి ,
మల్లాదిసూరిబాబు, చెన్నై కలెక్టర్ డాక్టర్ జయంతినటరాజన్, తెలుగు
విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఎల్లూరి శివారెడ్డి, ప్రపంచ తెలుగు
మహాసభల నిర్వాహకురాలు ఎస్ ఉమాదేవి, చంద్రశేఖర్ కల్కూర తదితరులు
మాట్లాడారు. వేదికపై ఆసీనులయిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ
కార్యక్రమంలో పినాకపాణి శిష్యులు, సంగీత అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు టిటిడి అధికారులు, మంత్రి ఏరాసు మేళతాళాలతో పినాకపాణి
స్వగృహానికి వెళ్లారు. ప్రభుత్వం తరుపున స్వర్ణకంకణంను, టిటిడి వారి రూ.
పది లక్షల వెయ్యి నూట పదహార్ల చెక్కును అందజేశారు. సాంస్కృతిక శాఖ
సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించి
కర్నూలు, తుంగభద్ర ప్రత్యేకతలను వివరించారు. తెనాలిరామకృష్ణుడు లాంటి
కవులు తుంగభద్రపై రాసిన పద్యాలను గుర్తు చేస్తూ సభకు నిండుధనం తెచ్చారు.
అనంతరం పినాకపాణి శిష్యులు నేదునూరు కృష్ణమూర్తి, మల్లాదిసూరిబాబు,
మల్లాది సోదరులు నిర్వహించిన సంగీత కచేరి ఆహుతులను ఆకట్టుకుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి