28, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రణబ్‌ ముఖర్జి బడ్జెట్‌కు సెన్సెక్స్‌కు లింకేమిటి?

ప్రణబ్‌ముఖర్జి బడ్జెట్‌ ప్రవేశపెట్టగానే స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌ పెరిగిపోయింది. స్టాక్‌ మార్కెట్‌కు బడ్జెట్‌కు లింకేమిటి స్టాక్‌ మార్కెట్‌ అనగానే ఇదంతా పెట్టుబడి దారులకు సంబంధించింది. స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో నడుస్తుందంటే ప్రణబ్‌ముఖర్జి బడ్జెట్‌కూడా పెట్టుబడి దారులకు అనుకూలమైనదనేగా అర్థం. యుపిఎ -1 ప్రభత్వ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా వామపక్షాల మద్దతుతో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఏర్పాటయింది. అప్పుడు పార్లమెంటులో బడ్జెట్‌ పవేశపెట్టిగానే సెన్సెక్స్‌ పడిపోయింది. అంటే అప్పుడు మెజార్టీ ప్రజలకు ఉపయోగపడే తరహాలో బడ్జెట్‌ ఉన్నది. కొన్ని వ్యాపార సంస్థలకోసం కాకుండా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆనాటి బడ్జెట్‌ అంటే రాజకీయ డాక్యుమెంటు తయారు చేశారు. ఈనాడు అంటే 2011-12 బడ్జెట్‌ మాత్రం ప్రజల ప్రయోజనాలను విస్మరించిందనే చెప్పవచ్చు.బహుళజాతి సంస్థలు తయారు చేసిన కార్పొరేట్‌ కంపెనీల డాక్యుమెంటులా ఉంది. ఒక పక్కధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు కష్టాల్లో ఉన్నారు. అన్ని స్థాయిల్లో అవినీతి పెరిగి పోయింది. నల్లధనం నిల్వలు పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో వాటిని అదుపు చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం శూన్యం. కేవలం ఆందోళన వ్యక్తం చేస్తే ధరలు తగ్గుతాయా? అవినీతి తగ్గుతుందా? పేదల ఆదాయం పెరుగుతుందా? ఒక పిల్లవాడికి గణితంలో మార్కులు తక్కువగా వస్తున్నాయంటే మార్కులు పెంచడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి. ట్యూషన్‌ చెప్పించాలి. పిల్లవాడికి పౌష్టికాహారం ఇప్పించాలి. కాని మార్కులు తగ్గడానికి గల కారణాలను అన్వేషిస్తాం. నల్లధనాన్ని అదుపు చేయడానికి ఐదంచెల విధానాన్ని రూపొందిస్తామని ప్రకటనలు చేయడం. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడానికి వ్యవసాయానికి సబ్సిడీలు ఇవ్వకుండా ఆందోళన కలిగిస్తుందని ప్రకటన చేస్తే సరిపోతుందా?.
2011-12 వార్షిక పేదలకు మాటలు చెప్పి విదేశీ బహుళజాతి సంస్థలకు, స్వదేశీ సంపన్నులకు మూటలు కట్టబెట్టేలా ఉంది. కాకులను కొట్టి గద్దలకు దోచిపెట్టడమంటే ఇదే. రోజుకు ఇరవై రూపాయలు కూడా ఖర్చు చేయలేని పేదలు, అరకొర ఆదాయాలతో బతుకీడుస్తున్న సామాన్య, మధ్యతరగతి జీవులు కలిపి దేశంలో 95 శాతం మంది ఉన్నారు. భారీసంఖ్యలో ఉన్న ఈ జనాలకు విదల్చడమో లేక వారి వంక చూడకపోవడమో చేసిన ఆర్థిక మంత్రి సంపన్నులకు మాత్రం రెండు చేతులతో తవ్వి పోశారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ద్రవ్యోల్బణాన్ని ఆదుపు చేస్తామంటూనే ఆందోళన కలిగిస్తున్న ఆహార ద్రవ్యోల్బణంపై నోరుమెదపలేదు సరికదా ఆహార పదార్ధాల ధరలు పెరుగుతాయన్నారు. ధరల నియంత్రణపై చేతులెత్తేశారు. ఆహార భద్రత బిల్లును ఈ ఏడాదిలో పార్లమెంట్‌లో ప్రవేశపెడతామంటూనే, సబ్సిడీలకు కోత పెట్టారు. సబ్సిడీలను నగదు రూపంలో చెల్లిస్తాం, కిరోసిన్‌, గ్యాస్‌, ఎరువులకు కూపన్లు ఇస్తాం అంటూ సబ్సిడీలను దిగ్గోస్తామని ప్రణబ్‌ బాహాటంగా ప్రకటించారు. బడ్జెట్‌లో నిరుటి కంటే 27 కోట్లు కోత పెట్టారు. డీజిల్‌, పెట్రోలు ధరల పెంపుతో అన్ని వస్తువుల ధరలూ పెరిగి సామాన్యులు అవస్థలు పడుతున్నారు, పెట్రోలియం ఉత్పత్తులపై కష్టమ్స్‌, ఎక్సయిజ్‌ సుంకాలు తగ్గిస్తే కొంత వరకూ ధరలు తగ్గుతాయని ప్రతిపక్షాలు, ప్రధానంగా వామపక్షాలు నెత్తీనోరు మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవినపెట్టింది. బడ్జెట్‌లో ఆ ఊసు లేదు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టడానికి వీలుగా భారీ యంత్రాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. ఏడాదిలో వ్యవసాయ కూలీలకు వంద రోజులు పని కల్పించాలని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన చేత్తోనే భారీ యంత్రాలను ప్రోత్సహించడం ఏం నీతి? ఉపాధి హామీ కార్మికుల వేతనాలు పెంచామని కొండంతరాగం తీసిన ఆర్థిక మంత్రి గతేడాది కంటే ఈ బడ్జెట్‌లో వందకోట్లు తగ్గించి ఆమాద్మీకి ప్రాధాన్యమిచ్చామంటే ఎలా చెల్లుబాటవుతుంది? వృద్ధాప్య పింఛన్లకు వయో పరిమితి తగ్గించి ఆ మేరకు పెరగనున్న పింఛన్లకు నిధులు కేటాయించలేదు.
వినాశకర సంస్కరణల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ప్రజల నుండి నిరసనలు మిన్నంటుతున్నా వాటినే పట్టుకు వేలాడుతోంది యుపిఎ-2 సర్కార్‌. భవిష్యత్తులో ఆ 'సంస్కరణ'లనే అమలు చేస్తామని విత్త మంత్రి నిస్సిగ్గుగా ఢంకా భజాయించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను గతేడాది కంటే 15 వేల కోట్లు ఎక్కువగా అంటే 40 వేల కోట్లు ఉపసంహరిస్తున్నట్లు సెలవిచ్చారు. మౌలిక వసతుల రంగంలో విదేశీ పెట్టుబడులకు ఉవ్విళ్లూరుతూ పెట్టుబడులు రావాలంటే భారీ రాయితీలు తప్పనిసరని కుతర్కం వినిపించారు. కార్పొరేట్లపై సర్‌ ఛార్జి 7.5 శాతం నుండి 5 శాతానికి ఉదారంగా తగ్గించేశారు. వేతన జీవులకు ఆదాయ పరిమితి 1.6 లక్షల నుండి 1.8 లక్షలకు పెంచినట్లు ఫోజు పెట్టినప్పటికీ పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ పెంపు ఏ మాత్రం సరిపోదు. గతంలో మహిళలకు, పురుషులకు మధ్య ఆదాయ పన్ను పరిమితి తేడా ఉండేది. ఈసారి పురుషులతో సమానం చేసి మహిళలకు ఇంతకాలం ఉన్న ఆ మాత్రం ప్రోత్సాహకాన్ని సైతం లేకుండా చేశారు. ఆదాయ పరిమితి పెంపువల్ల ప్రత్యక్ష పన్నుల నుండి 11,500 కోట్లు ఆదాయం తగ్గుతుందన్నప్పటికీ అదే జనం నుండి పరోక్ష పన్నుల ద్వారా సర్కార్‌ 11,300 కోట్లు గుంజుతోంది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో అడుక్కోవడమంటే ఇదే. వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉందని ఆర్థిక సర్వేలో పేర్కొన్న విత్త మంత్రి బడ్జెట్‌లో అందుకు తగ్గట్టు కేటాయింపులు చేయలేదు సరి కదా తగ్గించారు. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం అంటూ విదేశీ సంస్థలకు తలుపులు బార్లా తెరిచి కార్పొరేట్‌ వ్యవసాయాన్ని నిస్సిగ్గుగా ప్రవేశపెడతామన్నారు. కార్పొరేట్‌, కాంట్రాక్టు వ్యవసాయం వల్ల పేద, చిన్న సన్నాకారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. వ్యవసాయ రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రుణాల పెంపు అంటున్నా పేదలకు అవి బహుదూరంగా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల వ్యధలపై ఈ బడ్జెట్‌లో మాట మాత్రం లేకుపోవడం ప్రభుత్వ దగాకోరు విధానాలకు నిదర్శనం.
యుపిఎ-2 ప్రభుత్వంలో అవినీతికి హద్దూ అదుపు లేకుండా పోయింది. అవినీతి కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తామన్న హామీ కంటితుడుపునకే పనికొస్తుంది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వ్యవహారంపై రోజుకో విన్యాసం చేస్తున్నారు ప్రణబ్‌. నల్లధనం వెలికితీతపై ఐదంచెల వ్యవస్థ కూడా ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప చిత్తశుద్ధితో నల్లధనాన్ని రప్పించడానికి కాదని ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఆర్థిక రంగంలో కీలకమైన బీమా, బ్యాంకింగ్‌, పెన్షన్‌ నిధుల వంటి వాటిని సరళీకరించే చట్టాలను వేగంగా అమలు చేస్తామనడం వెనుక విదేశీ పెట్టుబడుల మార్కెట్‌ను సంతృప్తి పర్చే రంధి దాగుంది. దానిలో భాగంగానే ప్రైవేటు బ్యాంకులకు లైసెన్సులిస్తామన్నారు. భారతీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ను మరింత సరళీకరించడం ద్వారా విదేశీ పెట్టుబడులను అందుబాటులోకి తేవడమంటే ఆశల పల్లకిలో విహరించినట్లే అవుతుంది. భారత కరెంట్‌ అకౌంట్‌ లోటు మరింత పెరగడానికి దోహద పడుతుంది. పెట్టుబడి వ్యయం జిడిపిలో 1.7 శాతం నుండి 1.2 శాతానికి తగ్గడం వల్ల ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై నీలి నీడలు అలముకున్నాయి. జిడిపి గతేడాది కంటే 14 శాతం మేరకు పెరగ్గా ప్రణాళికా బడ్జెట్‌ నిరుటికంటే 12 శాతమే పెరిగింది. సమాజంలోని మహిళ, దళితులు, మైనార్టీలు, గిరిజనుల సంక్షేమానికి జరిపిన కేటాయింపులు పూర్తి అసమగ్రంగా ఉన్నాయి. మహిళలు మైక్రోఫైనాన్స్‌ సంస్థల వేధింపులు, అధిక వడ్డీలతో ఇబ్బందులపాలవుతుండగా మైక్రో సంస్థల కోసం బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించడం అత్యంత దుర్మార్గం. మొత్తమ్మీద ప్రణబ్‌ బడ్జెట్‌ యుపిఎ ఆమాద్మీ ఎజెండాను పక్కనపెట్టి నయా సరళీకరణ విధానాలను దూకుడుగా అమలు చేయాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.

కామెంట్‌లు లేవు: