23, అక్టోబర్ 2010, శనివారం

ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగుర గలదా!!?

సోనియాను ఒప్పిస్తాం.. తెలంగాణ తెస్తాం...
నివాళి సభలో కాంగ్రెస్‌ నేతల స్పష్టీకరణ
12 కుటుంబాలకు చెక్కులు పంపిణీ
రసాభాసగా సమావేశం
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు శనివారం మహబూబ్‌నగర్‌లో సమావేశమయ్యారు. మేమున్నామని చెప్పుకోవడానికి తప్ప ఏం చేద్దామని... ..సోనియాగాంధీని ఒప్పిస్తాం... తెలంగాణా తెస్తాం... అని ప్రకటించారు. సరే మీ వెంట ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలనే ఒప్పించే శక్తి లేదే....సోనియాగాంధీని ఎలా ఒప్పిస్తారు. ''ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగుర గలదా!!? '' అన్న చందంగా ఉంది. వీరి వ్యవహారం. మీరు తెలంగాణా తెస్తామంటే మీ కార్యకర్తలు మీ పైకి కుర్చీలెత్తుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి అడ్డుకున్నారు అప్పుడే తెలంగాణా వచ్చేదని మీరంటారు. ఆయన లేడు కదా ఆయన గురించి చెప్పడ మెందుకు ..మీకార్యకర్తలను మీరే రెచ్చగొట్టి డౌన్‌డౌన్‌ అనిపించుకోవడ మెందుకు. ఎఐసిసి అధ్యక్షురాలిని ఒప్పించే శక్తి ఉంటే పిసిసి అధ్యక్షులు కరీంనగర్‌ ఉప ఎన్నికల్లో ఓడిపోయేవారేనా...మీరు తెలంగాణా తెస్తారో లేదో తెలువదు కాని ప్రజల సమస్యల పరిష్కారం గురించి ఆలోచించక పోతే వచ్చే ఎన్నికల్లో మీగురించి సమస్యల్లో ఉన్న తెలంగాణా ప్రజలు బాగా ఆలోచిస్తారు. రాజకీయాల్లో కనబడకుండా పోతారు. పైగా మీది జాతీయ పార్టీ రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన ప్రాంతాలగురించి కూడా ఆలోచించండి.
మహబూబ్‌నగర్‌ సమావేశం గురించి కొంత తెలుసుకుందామా....ఎఐసిసి అధినేత సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంత నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 12 మంది కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ తెలంగాణ కార్యాచరణ కమిటీ నేతృత్వంలో జిల్లాలోని కొత్తూరు, షాద్‌నగర్‌, బాలానగర్‌, మహబూబ్‌నగర్‌ మండలాల పరిధిలో సభలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జరిగిన సభకు డిసిసి అధ్యక్షులు ముత్యాల ప్రకాష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎఐసిసి నేతలు కె.కేశవరావు, వి.హనుమంతరావు ముఖ్యోపన్యాసం చేశారు. కేశవరావు మాట్లాడుతూ తెలంగాణను రాష్ట్రాన్ని సాధించే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. సోనియాగాంధీని ఒప్పించి రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రజలపైనా, విద్యార్థులపైనా ఎంతో బాధ్యత ఉందని చెప్పారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో కేశవరావు మాట్లాడుతున్న సందర్భంగా వైఎస్‌ అభిమానులు లేచి ఒక్కసారిగా కుర్చీలు ఎత్తేశారు. నిరసన తెలిపారు. కెకె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనల మధ్యే కెకె తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సే తెలంగాణకు పెద్ద అడ్డంకి అని అన్నారు. ఆయన అడ్డుతగలకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఏర్పడి ఉండేదన్నారు. దీంతో వైఎస్‌ అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్‌ జిందాబాద్‌, వైఎస్‌ జగన్‌ జిందాబాద్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ విహెచ్‌ తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఒక దశలో కార్యకర్తలు కుర్చీలను ఆయనపైకి విసిరేందుకు యత్నించారు. దీంతో ఆయన వేదిక మీద నుండి కిందకు దిగి 'ఏం కొడతారా? కొట్టండి చూద్దాం'అంటూ వారి మధ్యకు వెళ్లారు. ఆయన్ను సముదాయించడం వేదికపై ఉన్న ఎవరి వల్లా కాలేదు. చివరకు మాజీ మంత్రి జానారెడ్డి, కేశవరావు, జూపల్లి కృష్ణారావు, డికె అరుణ నచ్చజెప్పారు. వేదికపైకి రావాలని కోరారు. కార్యకర్తల నిరసనల మధ్యనే ప్రసంగాన్ని ముగించారు.
బాబు ఇంటి ముందు ధర్నా చేయండి
టిడిపి నేతలు సోనియా గాంధీ ఇంటి ముందు కన్నా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తే బాగుంటుందని నాగర్‌కర్నూల్‌ ఎంపి మంద జగన్నాథం, మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపి విఠల్‌రావు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఇప్పటికీ తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదన్నారు. శ్రీ కృష్ణ కమిటీకి మూడు ప్రాంతాల నుండి నివేదికలు ఇప్పించడం సరికాదన్నారు. సభలో మాట్లాడిన అత్యధిక మంది టిడిపి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో 12 మంది తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడినా ఆయన స్పందించలేదని విమర్శించారు. ఒక్క కుటుంబానైనా పరామర్శించారా? అంటూ ప్రశ్నించారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలకు ఘన స్వాగతం పలికారు. అక్కడ కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించారు. షాద్‌నగర్‌ బస్టాండ్‌ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. బాలానగర్‌లోనూ సభ నిర్వహించారు.

కామెంట్‌లు లేవు: