14, నవంబర్ 2010, ఆదివారం

అన్నిట్లో ముందుంటూ.. ఆకలితో అల్లాడుతూ...

నిరాదరణకు గురవుతున్న కావలికారులు
రోజంతా పని చేస్తే కూలి 56 రూపాయలే..
కనీసం ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించలేని స్థితి
ప్రజలను దోపిడీ చేస్తూ అన్యాయానికి పాల్పడే వారిని నియంత్రించి.. బాధితులకు న్యాయం చేసేది ప్రభుత్వం. కానీ ప్రభుత్వమే శ్రమదోపిడీ చేస్తూ.. శ్రమకు తగ్గ ఫలితం ఎగ్గొడుతున్న తీరు విస్మయం కల్గించకమానదు. కనీస వేతనాలు అమలు చేయాల్సిన ప్రభుత్వమే.. కావలికారులతో వెట్టిచాకిరీ చేయిస్తోంది. ఊరంతా నిద్రపోయినా తను మాత్రం గ్రామ క్షేమం కోరి మేల్కొని ఉండే కావలికారు.. దోపిడీలు, గొడవలు అరికట్టడంలో ముందుంటున్నాడు. మూడు రంగుల చేతికర్రతో ఊరంతా గస్తీ తిరుగుతూ... ఎవరికి ఏ ఆపద వచ్చినా తన సొంత ఆపదలా వణికిపోతాడు. గ్రామానికి ఏ అధికారి వచ్చినా 'జీ సలాం' అంటూ సహాయకారిగా ఉంటాడు. గ్రామానికి వచ్చిన ఏ అభివృద్ధి పథకమైనా కావలికారులు లేనిదే ప్రజలకు చేరదు. ఇంతటి ప్రాధాన్యత గల వారి జీవితంలోకి తొంగి చూస్తే... ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతభత్యాలు సరిపోక అర్ధాకలితో అలమటించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ రెవెన్యూ డివిజన్‌లోని 13 మండలాల్లో 534 మంది గ్రామసేవకులు ఉన్నారు. ఇందులో బంట్రోతు, సోడు, గ్రామ కావలికారులు ఉన్నారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరు 3,562 మంది వీరిపై ఆధారపడి ఉన్నారు. వంతులవారీగా చేస్తున్న గ్రామసేవకులు మరో 5 వేలకు పైగానే ఉంటారు. మొత్తం 8,562 మంది గ్రామసేవకులు ప్రభుత్వం ఇచ్చే అరకొర జీతభత్యాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఎలాంటి ఇతర ఆస్తులూ ఉండవు. భూములు, మాన్యాలు గతంలో ఉన్నా క్రమంగా పటిక, పట్వార్వీలు వీటిని అన్యక్రాంతం చేసుకున్నారు.
నిరాదరణలో గ్రామసేవకులు
ప్రభుత్వ నిరాదరణతో గ్రామసేవకులు తల్లడిల్లుతున్నారు. 24 గంటలూ పనిచేసే వీరికి నెల జీతం 1,700 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే రోజుకు 56 రూపాయలు అన్నమాట. ఉపాధి కూలికి 100 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం.. గ్రామసేవకులకు మాత్రం 56 రూపాయలు చెల్లించడమేమిటని ప్రజాసంఘాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల కార్యాలయానికి డ్యూటీలో వెళితే రాత్రి ఉండాలి. వీటికి గానూ అలవెన్సుల కింద రోజుకు పది రూపాయలను అధికారులే మెక్కుతున్నారు. మండల కార్యాలయానికి వెళ్లడానికి ప్రతి ఒక్కరికీ ఒక సైకిల్‌ ఇవ్వాల్సి ఉండగా.. దీన్ని ఎక్కడా అమలు చేయడం లేదు. వీరిని నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కొంతకాలంగా కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వీరిలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ పదోన్నతి కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వచ్ఛంద పదవీ విరమణ వర్తింపజేసి అర్హులైన వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కూడా వీరంతా కోరుతున్నారు. అధికారుల వేధింపులను, గ్రామ పెద్దల బెదిరింపులను అరికట్టాలని కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ వెట్టి పనులే..
గ్రామంలో వీరు చేస్తున్న పనులన్నీ వెట్టిపనులే. సర్పంచి ఇంట్లో పెళ్లి జరిగినా, పేరంటాలు అయినా గ్రామసేవకులు అన్నీ అయి చూసుకోవాలి. కట్టెలు కొట్టాలి. వంటలు చేయాలి. వడ్డించాలి. సాగనంపాలి. ఇలా ప్రతి పనీ గ్రామసేవకులే చేయాలి. సర్పంచికే కాదు గ్రామ భూస్వాములందరికీ ఈ వెట్టిచాకిరి చేయాల్సిందే. ఊర్లో ఎవరైనా చనిపోతే, ఆక్సిడెంట్‌ అయితే, మందుతాగి చనిపోతే ఆ శవం దగ్గర జాగారాలు చేయాల్సిందే. కేసు అయితే పోలీసులు వచ్చి పోస్టుమార్టం చేసి తిరిగి సమాధి పెట్టేవరకు అంతా వీరే చేయాలి. గొడవలు జరిగినా, ఇళ్లు కూలినా అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వీరిదే. ఇంకా జనాభా లెక్కింపు, ఓటింగు సమయంలో వెటర్నరీ సేవలు, హౌసింగ్‌ బిల్లులు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ పనికీ కావలికారులే ముందుండి అధికారులకు సహాయం అందివ్వాలి.
సమ్మె చేసినా లేని ఫలితం శూన్యం
జీతభత్యాల పెంపు కోసం ట్రేడ్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో గతంలో 45 రోజుల పాటు సమ్మె చేశారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేత ఒప్పందం కూడా చేసుకున్నారు. అయినా ఈ కోరికలు నెరవేరకపోవడంతో మళ్లీ గ్రామసేవకులు సమ్మెబాట పట్టనున్నారని గ్రామసేవకుల సంఘం జిల్లా అధ్యక్షులు నిరంజన్‌ హెచ్చరిస్తున్నారు.
తినేది కూడా నమ్మకం లేదు
ఏ అధికారి ఎప్పుడు వస్తాడో తెలియదు. అన్నం తింటుంటే అధికారి వచ్చినా, పోలీస్‌ వచ్చినా మధ్యలోనే పోవాలి. పూర్తిగా తింటామో, లేదో తెలియదు. అన్ని సౌకర్యాలు అధికారులకు చేయాలి. మేము ఉపవాసం ఉండాలి.
- లక్ష్మయ్య, గ్రామ సేవకుడు, నడిగడ్డ
ఉపాధి పనే నయం
ఉపాధి పనికి పోతే రోజు కూలి రూ.100 ఇస్తారు. మాకు మాత్రం 56 రూపాయలే. పెరిగిన ధరలకు ఈ మొత్తం దేనికీ సరిపోదు. దీంతో ఒక్కోరోజు పస్తులుండాల్సి వస్తోంది. పోలీసోల్ల లాగా ఎప్పుడూ టెన్షన్‌గా ఉండాల్సి వస్తోంది.
- కాశన్న, తాడూరు
కనీస వేతన చట్టం
అమలు చేయాలి
గ్రామసేవకులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. వీరిని నాలగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ పిఎఫ్‌, డిఎలు వర్తింపజేయాలి. ప్రతి గ్రామసేవకునికి సైకిల్‌ ఇవ్వాలి. పింఛన్‌, కారుణ్య నియామకాలు, పదోన్నతి తదితర సదుపాయాలు కల్పించాలి. వీటి అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే తీవ్ర ఉద్యమాలు చేపడతాం.- పొదిల రామయ్య,
సిఐటియు నాయకులు

కామెంట్‌లు లేవు: