6, డిసెంబర్ 2010, సోమవారం

మంత్రుల కు స్వాగతం పలకని ఎమ్మెల్యేలు

కర్నూలు జిల్లా టిజి వెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డికి మంత్రి పదవులు లభించాయి. ఇద్దరూ సోమవారం కర్నూలు నగరానికి వచ్చారు. వారికి నగరంలో భారీ స్వాగతం లభిస్తుందని అనుకున్నారు. ప్రజలు , కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. కాని జిల్లాలోని 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాను కేవలం నందికొట్కూరు ఎమ్మెల్యే ఏరాసు ప్రతాపరెడ్డి మాత్రమే వచ్చారు. మిగతావారెవరూ రాకపోవడంతో చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి సారి కర్నూలు నగరానికి వచ్చిన న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్‌లు కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు. మంత్రులకు స్వాగతం పలకడానికి కాకపోయినా ప్రజాప్రతినిధులుగా సమీక్షా సమావేశానికి కూడా రాలేదు. ఈ సమీక్షా సమావేశానికి మొదట జర్నలిస్టులను ఆహ్వానించిన జిల్లా ఉన్నతాధికారులు ఆ తరువాత మంత్రుల సూచన మేరకు వారిని బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు జర్నలిస్టులను, ఫొటో గ్రాఫర్లను, వీడియో గ్రాఫర్లను బయటికి పంపించేశారు. పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను సమీక్షించాల్సిన మంత్రులు రహస్యంగా సమీక్షించడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా నిరసించారు. ఈ మేరకు కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ బయటికి వచ్చి మళ్లీ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేల్లో ఒక్కరు మినహా అంతా గైర్హాజరు కావడం చర్చనీయాంశమయింది. నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మినహా ఎమ్మెల్యేలంతా మంత్రుల పర్యటనకు దూరంగా ఉన్నారు. తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రులు మొదట ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. అతిథి గృహంలోనూ కాంగ్రెస్‌ నేతలు లబ్బి వెంకటస్వామి మినహా నగరంలోని మిగిలిన నాయకులెవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి గ్రూపుగా ముద్ర పడిన జడ్‌పి ఛైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి, కోడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ సైతం మంత్రుల పర్యటనకు దూరంగా ఉండడం చర్చనీయాంశమయింది. తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యేలంతా దూరంగా ఉండడంతో భవిష్యత్తులో సహాయ సహకారాలు అందుతాయో లేదోనన్న చర్చసాగింది. గతంలో శిల్పా మోహన్‌ రెడ్డికి కొంత మంది నుంచి ఇబ్బందులు ఉన్నా మిగిలిన ఎమ్మెల్యేలంతా కలుపుకుపోయే విధంగానే వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌లో పెద్ద చీలిక రావడంతో ఎమ్మెల్యేలు కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లోని మంత్రులకు ఏ మాత్రం సహకారం అందిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే జిల్లాలో లబ్బి వెంకటస్వామి, నీరజా రెడ్డి, బాలనాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు జగన్‌ గ్రూపుగా ముద్ర పడి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి తోడు తెలుగుదేశం ఎమ్మెల్యేలూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌లోనే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, శిల్పా మోహన్‌ రెడ్డిలు బహిరంగంగానే ముఖ్యమంత్రిని విమర్శించారు.

కామెంట్‌లు లేవు: