22, డిసెంబర్ 2010, బుధవారం

చలిలో వేడెక్కిస్తున్న ఎపి రాజకీయాలు

చలికాలం తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో 44 ఏళ్ల తరువాత ఇంతటి చలి వచ్చిందని నిఫుణులు చెబుతున్నారు. 1966 డిసెంబర్‌ 24న 8.7 డిగ్రీలు నమోదు కాగా 2010 డిసెంబర్‌ 21న 8.9 డిగ్రీలు, 22న 8 డిగ్రీలకు పడిపోయింది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం విశేషం. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం డిసెంబర్‌ 31నాటికి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు వస్తుంది. ఆతరువాత తెలంగాణా ఉద్యమం ఉదృతం చేస్తామని, టిఆర్‌ఎస్‌, తెలంగాణా వాదులు హెచ్చరికలు చేయడంతో ముందుచూపుగానే ప్రభుత్వం ప్రత్యేక బలగాలను సిద్దం చేస్తోంది. సంక్రాంతిదాకా చూస్తాం కేంద్రం స్పందించకపోతే దీక్షలు ప్రారంభిస్తానని కెసిఆర్‌ హెచ్చరించారు. మర్రిచెన్నారెడ్డి కాలంలో జరిగిన పరిస్థితి పునరావృతం కాకూడదని ప్రభుత్వం అనుకుంటుండగా యుద్ధం తప్పదని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అంటున్నారు. అందులో భాగంగానే హెచ్చరికగా వరంగల్‌లో సభ పెట్టారు. విదేశాల్లో ఉండే తెలంగాణా వాదులు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 2014 వరకు కాంగ్రెస్‌కు అధికారంలో ఉండే అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాలంటే చిదంబరంతో మరో సానుకూల ప్రకటన ఇచ్చి మరో కమిటీ వేసి కాలయాపన చేయవచ్చని అనుకుంటున్నారు. లేదా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాం కదా త్వరలో తేల్చుతామంటారా? లేక మూడు ప్రాంతాల ప్రజలకు అనుకూల మైన నిర్ణయం తీసుకుంటారా అనేది చర్చ జరుగుతుంది. ఇటీవల అకాల వర్షాల వల్ల రైతులను నిలువునా ముంచాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగింది.
దీనిని ఆసరాగా చేసుకుని చంద్రబాబు ఆందోళనకు దిగారు. తెలంగాణాలో ఎలాగు మాట్లాడే ఆవకాశం లేకుండా పోయింది. మహారాష్ట్ర వెళ్లి ఆందోళన చేసినా తెలంగాణా ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టిడిపి రైతుల పక్షాన దీక్షలు చేసి లబ్ధిపొందాలని అనుకున్నారు. ప్రతిపక్షనేతలంతా మద్దతు తెలిపారు. వామపక్షనేతలు సంఘీభావం తెలిపారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ ఎపి రైతులను ఆదుకోవాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేక రాశారు. అదే విధంగా రాష్ట్రంలో సిపిఎం , సిపిఐ పార్టీల శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. రైతుల పక్షాన పోరాడటం మంచిదే కాని అధికారంలో లేనప్పుడే అన్ని గుర్తుకొస్తాయి మన నేతలకు. ముఖ్యమంత్రి పదవి దక్కలేదని ఏంపీ పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జగన్‌ కూడా త్వరలో పార్టీ పేరు ప్రకటిస్తానన్నారు. ఆయనకూడా రైతుల పక్షాన పోరాడితే మంచి ఫలితాలుంటాయని ఆలోచించారు. విజయవాడలో 24 గంటల దీక్షకు కూర్చున్నారు. అధికారంలో ఉండగా రైతులుగాని, వాళ్ల సమస్యలు గాని పట్టని నేతలు ఇప్పుడు దీక్షలు చేయడం సరయినదేనా? కాదా? ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగుతుంతే రాష్ట్ర ఎంపీలు ఢిల్లీలో సమావేశమై రైతులను ఆదుకుంటామని చెప్పారు. మేము ఒకపక్క సర్వేలు చేస్తున్నాం. నివేదికలు రాకుండా ఆదుకోవడమెలా అని కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి అంటున్నారు. మరో పక్క అధికధరలు, అవినీతి వివిధ సమస్యలపై ఆయా సంఘాలు, ప్రతిపక్షపార్టీల ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలిసే ప్రయత్నం మాత్రం ముమ్మరమైంది. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు. ఎవరు వారివారి ప్రయోజనాలకోసం పని చేస్తున్నారనేది అర్థం చేసుకోవల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ల వద్ద కోట్ల రూపాయలు ఉన్నాయి కదా అందులో నుంచి కొన్ని కోట్లు సహాయం చేస్తే రైతుల సమస్యలు తీరుతాయని ఓ ప్రతిపాదన వచ్చింది. అది మాటలకే పరిమితం తప్ప అలాంటిది సాధ్యం కాదు. మన రాజకీయ నాయకులు పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించు కోవడం తప్ప పంపిణీ చేయడం సాధ్యమయ్యేదేనా? . ఇవన్ని జరుగుతున్న ప్రభుత్వం మాత్రం దున్నపోతుమీద వాన కురిసిన చందంగా ఉంది. ప్రభుత్వం మంటే ఎవరో కాదండి మన ప్రధాని, మఖ్యమంత్రి, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీయే. ఈ మధ్య కాంగ్రెస్‌ ప్లీనం జరిగింది. అందులో అవినీతిపై చర్చిస్తూ గత అవినీతి కుంభకోణాలకు బాధ్యవ వహించకుండా దేశంలో బిజెపి , సిపిఎం రెండూ అవినీతి పార్టీలే నని ఓ తీర్మానం చేశారు. ఇదెక్కడి న్యాయం పశ్చిమ బెంగాల్‌లో 35 సంవత్సరాల పాటు ఏకధాటిగా అధాకారంలో ఉన్న సిపిఎంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. మంత్రులు కూడా సాధారణ జీవనం గడుపుతారు. వ్యక్తిగత ఆస్తులకు ప్రాధాన్యత ఇవ్వరు. అదే బిజెపి మతపరమైనపార్టీ, అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్న నేతలున్న పార్టీ. గాలిజనార్థన్‌రెడ్డి- మైనింగు కుంభకోణం, యడ్యూరప్ప- భూమి కుంభకోణం, నితీష్‌గడ్గరీ- ఆదర్శ్‌ అపార్టుమెంట్ల కుంభకోణం, లలిత్‌మోడి- ఐపిఎల్‌ కుంభకోణం ఇలా అనేక అవినీతి పరులున్న బిజెపి ఎక్కడ జీవితాలను త్యాగం చేసిని మార్క్సిస్టు పార్టీ ఎక్కడ ఈ పోలికను చూస్తే ఎఐసిసి ప్లీనం తీర్మానాలకు ఎంత నిర్ధిష్టత, నైతికత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అధికారంలో ఎంతకాలం ఉంటామో అనేది కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి, తెలంగాణా వస్తుందో లేదోనని కెసిఆర్‌కు, ఇలాంటి పరిస్థితిలో జనంలో ఎలా పేరు పొందాలనేది టిడిపికి, వీలయినంతగతొందరగా కీర్తి పొందాలనేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయ చలి వణికిస్తుందనేది మాత్రం వాస్తవం. పరిస్థితిని గమనించి ప్రజలంతా పోరుబాట పడితే అసలయిన వేడి పుట్టే అవకాశం ఉంది. చిరంజీవి మాత్రం చలిని తట్టుకోలేక ఎక్కడో దాచుకున్నట్లు కనబడుతుంది.

కామెంట్‌లు లేవు: