రాష్ట్రవ్యాపితంగా మేడేను కార్మికులు ఉత్సాహంగా.. ఓ దీక్షా దినంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాడవాడలా ప్రదర్శనలూ, బహిరంగ సభలూ జరిగాయి. కర్నూలు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.అంతకు ముందు కర్నూలు సుందరయ్య భవన్ ఎదుట ఎర్రజెండాను సీనియర్ నాయకులు టి.నర్సింహాయ్య ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో సిిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రజాశక్తి కార్యాలయం వద్ద సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల పరిరక్షణకు ఉద్యోగ, కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కార్మికవర్గంపై దాడి మరింత పెరుగోతందనీ, ఐక్య పోరాటాలతో కార్మికులు ప్రతిఘటించాలనీ కోరారు. హైదరాబాద్‌లో జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలే ఏకైక మార్గమన్నారు. సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇందిరాపార్కు వద్ద జరిగిన బహిరంగ సభలో వీరయ్య మాట్లాడుతూ సోషలిజంతోనే కార్మిక హక్కులు సాధ్యమన్నారు. అయితే సోషలిజం పని అయిపోయిందని పెట్టుబడిదారీ విధానంలోనే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని అమెరికా సామ్రాజ్యవాదం దుష్ప్రచారం చేస్తోందన్నారు. గ్రీసులో 14 మార్లు దేశవ్యాపిత సమ్మెలు, ఫ్రెంచిలో వారం రోజులపాటు జరిగిన సమ్మెను గుర్తు చేశారు. కార్మికుల ఆందోళనతో పోర్చుగల్ అట్టుడుకుతోందన్నారు. అరబ్ దేశాల్లో రాజరిక వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. ఈ పోరాటాలన్నింటిలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతూ పెట్టుబడిదారుల దుర్మార్గాన్ని ఎదుర్కోవాలంటే కార్మికులంతా ఏకమై ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసి బస్టాండు వద్ద జరిగిన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.సుధాభాస్కర్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు వాటిని కాలరాసేందుకే ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం పన్నుతున్న కుట్రను ఎదుర్కోవాలని కోరారు. సాయంత్రం షార్ బస్టాండు నుండి సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.
1 కామెంట్:
మీ బ్లాగు చూశాను బాగుంది. మీ అకాలి పొస్టులు వివరంగా ఉన్నాయి. veeraiah
కామెంట్‌ను పోస్ట్ చేయండి