పిల్లలకే కాదు పెద్దలకు కూడా  ఆహారం అందించే స్థోమత మన పాలకులకు లేదు. పరిపాలనా వ్యవహారాల పట్ల  చిత్తశుద్ధి లేదు. మనదేశంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని ఈ దేశంలోని  కోటేశ్వరులు, దోపిడీ దారులు అత్యధిక ప్రజల శ్రమను దోచుకుంటున్నారు. సంపద  కొందరితో పోగయ్యాక అందరికీ కూడు, గూడు, గుడ్డ దొరకడం కష్టంగా మారే  పరిస్థితి దాపురించింది. దీనికి తోడు పరిపాలనా వ్యవహారాల్లోని అమాత్యులు,  ఉన్నతాధిóకారులు అవినీతికి పాల్పడుతున్నారు. దీంతో ప్రజలకు అందాల్సిన  పథకాలేవీ సక్రమంగా అందడం లేదు. మరి పోషకాహారం ఎలా అందుతుంది. ఇప్పటికీ  రక్తహీనతతో బాధపడుతున్న మహిళ అత్యధికంగానే ఉన్నారు.   పిల్లలకు పోషకాహారం  కూడా అందించలేని ప్రభుత్వం దేశ ప్రజల కోసం చేస్తున్నదేమిటి.  పోషకాహార లోపం  దేశానికే సిగ్గుచేటని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు మన  పాలకుల పరిపాలనా తీరును ప్రశ్నిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 42 శాతం మంది  చిన్నారులు బరువు తక్కువగా ఉన్నారని, 59 శాతం మంది వయస్సుకు తగ్గట్టుగా  ఎదగలేదని ప్రధాని చెప్పిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఆహార భద్రత బిల్లు ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపలేదు.  ఇప్పటికే పలు  రాష్ట్రాలు ఒక్క రూపాయి, రెండు రూపాయలకే కిలో బియ్యం సరఫరా చేస్తుంది.   బియ్యం, గోధుమల వంటి ఆహారధాన్యాలను తక్కువ ధరలకు ప్రజలందరికీ అందుబాటులోకి  తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా కిలో రెండు రూపాయలకే ఆహార  ధాన్యాలను సరఫరా చేయాలి. కుటుంబానికి నెలకు 35 కిలోలు ఇవ్వాలి.ఆహార భద్రత  బిల్లుకు సవరణలు ప్రతిపాదించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆహార  భద్రత బిల్లు వాస్తవానికి ఇప్పటికే ఉన్న భద్రతను కూడా దూరం చేస్తుంది. పలు  రాష్ట్రాలు ఒక్క రూపాయికి, రెండు రూపాయలకు కిలో ఆహారధాన్యాలను  అందిస్తుండగా, కేంద్రం మూడు రూపాయలకు కిలో ఇవ్వాలని ప్రతిపాదించింది.  బిపిఎల్ కుటుంబాలకే దీన్ని పరిమితం చేయడంతో పాటు రేషన్‌ను పరిమితం  చేయించింది. బిపిఎల్ కుటుంబాలను ప్రాధాన్యత వర్గంగా పరిగణించిన కేంద్ర  ప్రభుత్వం ఎపిఎల్ కుటుంబాల్లోని దిగువ తరగతి ప్రజలను పూర్తిగా  విస్మరించింది.  బిపిఎల్ కుటుంబాలకిచ్చే సబ్సిడీని సైతం నేరుగా ఇవ్వకుండా  కొన్ని షరతులతో నగదు బదిలీ రూపంలో ఇవ్వాలని ప్రతిపాదించారు. దీని వల్ల  బిపిఎల్ కుటుంబాలు సైతం నష్టపోయే పరిస్థితి వస్తుంది. దీనికి భిన్నంగా  ప్రజలందరికీ అవసరమైన మేరకు తక్కువ ధరకు ఆహారధాన్యాలు అందుబాటులో ఉంచాలి.

 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి