విద్యార్థి
దశ నుంచే కష్టపడి చదవకుండా సుఖపడితే భవిష్యత్‌లో కష్టపడాల్సిన పరిస్థితి
వస్తుందని శాసన మండలి సభ్యులు డాక్టర్ కె నాగేశ్వర్ విద్యార్థులను
హెచ్చరించారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైన సాధించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలోని
జయప్రకాశ్‌నగర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 2013 జులై 13న
పూర్వ విద్యార్థుల సమ్మెళనం జరిగింది. ఈ సమ్మేళనానికి సాంఘిక సంక్షేమ శాఖ
కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ నాగేశ్వర్ ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ, ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి
నాగేశ్వర్ ప్రసంగించారు. ప్రతి విద్యార్థి మరొకరికి ఫాలోవర్‌గా ఉండకుండా
లీడర్‌గా ఎదిగి నెంబర్-1గా ఉండాలని కోరుకోవాలని సూచించారు. నేను పలాన
కావాలనే తపన విద్యార్థుల్లో ఉంటే ఆ తపన శక్తిని ఇస్తుందని చెప్పారు.
విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చని అన్నారు.
తపన ఉంటే ఆ తపననే విద్యార్థిని నడిపిస్తుందని అన్నారు. సమాజానికి
రాజకీయాలు ఎంతో అవసరమని విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి రావాలని కోరారు.
చెడు రాజకీయాలకు ప్రత్యామ్నాయం మంచి రాజకీయాలేనని చెప్పారు. రాజకీయాలను
అసహ్యించుకుంటే మార్పు రాదన్నారు. మంచి రాజకీయాలు చేసి చెడు రాజకీయాలను
పారదోలాలని సూచించారు. జీవితంలో మనిషి అసంతృప్తి, సంతృప్తి చెందకూడదని
అన్నారు. విజయానికి హద్దులు అనేవి లేవని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే
విజయం వరిస్తుందని చెప్పారు. ఒకరు సాధించింది... తాను ఎందుకు సాధించకూడదు
అనే ధృడ సంకల్పంతో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సాంఘిక
సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా
ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలలను అభివృద్ధి పరచడానికి కృషి చేస్తానని
అన్నారు. ఈ ఏడాది పాఠశాలల్లో అనేక మార్పులు తెస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షలు ఖర్చు చేసి సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో
చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ ఏడాది డిక్షనరీ అందజేయనున్నట్లు
చెప్పారు. సోషల్ వెల్పేర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి గుర్తింపు
కార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే లేపాక్షి కార్పొరేషన్‌కు
ప్రింటింగ్ కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా
మూడు చోట్ల సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో డిగ్రీ క్లాస్‌లు
ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు
దాదాపు మూడు వందల మందిని ఎంపిక చేసి ఎవరెస్ట్ శిఖరానికి తీసుకుపోనున్నట్లు
హర్షద్వానాల మధ్య చెప్పారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న
విద్యార్థులకు ఈ ఏడాది స్టేట్ లెవల్ ఆపరేషన్ నిర్వహించి విద్యార్థులకు
ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కల్వకుర్తి జెపినగర్
సాంఘిక సంక్షేమ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిని
తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో మరమ్మతులు చేయించి వాటర్
ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని, కొత్తగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు
చేస్తామని హామీ ఇచ్చారు. కంప్యూటర్ లాబొరేటరీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మెళనంలో ఐఆర్టిఎస్ ఆఫీసర్ భరత్‌భూషన్,
ఐఆర్ఎస్ బల్‌రాంనాయక్, ప్రజాశక్తి కర్నూల్ ఎడిషన్ ఇన్‌ఛార్జి పానుగంటి
చంద్రయ్య, పూర్వ విద్యార్థులు స్వాములు, మొగులయ్య, శ్రీనివాసులు,
స్కైలాబ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
వైభవంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలోని సాంఘిక సంక్షేమ
రెసిడెన్సియల్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2013 జులై 13న ఘనంగా
జరిగింది. 1984 నుంచి 2012 వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు,
ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు నాటకాలను ప్రదర్శించారు. పూర్వ
విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలో చదివిన
సమయంలో వారి అనుభవాలను తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ళ
క్రితం పాఠశాలలో చదివి ఎక్కడెక్కడో స్థిర పడ్డ పలువురు ఒకే చోట కలుసుకొని
ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి
తెలుసుకున్నారు. విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఎమ్మెల్సీ
నాగేశ్వర్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌తో పాటు
ఐఆర్ఎస్లో ర్యాంక్ పొందిన బల్‌రాంనాయక్, శంకర్, విద్యార్థులకు వారు ఏ
విధంగా పైకి వచ్చిందీ వివరించారు. జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ పాఠశాలల
ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో
పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు
ప్రోత్సాహం ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు
అభిప్రాయపడ్డారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే వచ్చి ఎంజారు చేసి
వెళ్ళకుండా ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు బోధన చేయడం అభినందనీయమని
ఎమ్మెల్సీ నాగేశ్వర్ నిర్వాహకులను అభినందించారు.
1 కామెంట్:
నాగేశ్వర్ గారు అనుభవంతో నేర్పిన పాటాలు సత్వర ఆచరణయోగ్యాలు!విద్యార్థులు కష్టపడి ఇష్టపడి లోలోతుగా పుస్తకాలకు పుస్తకాలు చదివేసి అవతల పారెయ్యాలి!విద్యార్ధులుగా బీరుకోట్టుకుంటూ సెల్ లో మాట్లాడుకుంటూ సాయిలాపాయిలాగా జులాయిలలా తిరుగుతూ ఆనందంగా సంతోషంగా తింగరిబుచ్చుల్లా తిరుగుతూ మజాచేసుకుంటూ ఇప్పుడు సుఖపడిపోతే ఆనక జీవితంలో యమ కష్టపడిపోతూ ఇక్కట్లు పడాల్సివస్తుందని వారి అంతరార్థం!
కామెంట్‌ను పోస్ట్ చేయండి