పేదరికం, ఆకలి, వ్యాధి, అజ్ఞాన రహిత భారతదేశ నిర్మాణానికి సమిష్టి కృషి
అవసరమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. 67వ స్వాతంత్య్ర
దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన
అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా
అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి ఫలాలను అందించాలని కోరారు. రాజకీయ
సుస్థిరత, సామాజిక ఐక్యత, భద్రత అవసరమని ఉద్ఘాటించారు. ప్రకృతి
వైపరీత్యాలు, వరదలు, పలు సమస్యల నేపథ్యంలో భారతీయులు సమిష్టి సహకారాలను
అందజేసిన విషయాలను కొనియాడారు. ఆకలి, పేదరికాలను కొలత వేయడం కష్టసాధ్యమైన
పని అని, దీనికి నిర్వచనమేదైనా తగ్గింపు వేగం పెరిగిందన్నారు. విద్యా
వ్యవస్థను ఇంకా ఎంతో సంస్కరించాల్సివుందని అనేక పాఠశాలల్లో ఇప్పటికీ
మంచినీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు లేవని అన్నారు. విద్యా
ప్రమాణాలను పెంచాల్సిన అవసరం వుందని, ఉపాధ్యాయ శిక్షణపై దృష్టి
సారించాల్సివుందని ప్రధాని చెప్పారు. గతేడాది ఆర్థిక వృద్ధి రేటు 5
శాతానికి పడిపోయయిందని చెబుతూ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి
చేస్తామన్నారు.
మెరుగ్గా పొరుగు సంబంధాలు..
గతంలో లేని విధంగా నేడు
దేశాల మధ్య పరస్పర అనుసంధానం పెరిగిందని, ఈ పరిస్థితిని భారత్
ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకునేందుకు వీలుగా విదేశీ విధానాన్ని
అనుసరిస్తున్నామని తెలిపారు. తొమ్మిదేళ్లలో ప్రధాన ప్రపంచ దేశాలతో సంబంధాలు
మెరుగుపరుచుకున్నామని గుర్తు చేశారు. జాతీయ భద్రతలో కూడా అభివృద్ధి
సాధించినట్లు ప్రధాని తెలిపారు. 2012లోనూ, ఈ ఏడు ఏవో కొన్ని మత ఘర్షణలు
మినహా గడిచిన తొమ్మిదేళ్లలో మంచి మతసామరస్యం నెలకొంద న్నారు. ఉగ్రవాద,
నక్సలైట్ హింసాకాండ కూడా తగ్గిందని చెప్పారు. అయినా కూడా జాతి భద్రతలపై
నిరంతర నిఘా ఉంచడం చాలా అవసరమని పేర్కొన్నారు. గత మే 25న ఛత్తీస్‌గఢ్‌లో
జరిగిన నక్సల్ హింసాకాండ వంటి ఘటనలు ప్రజాస్వామ్యంపై గొడ్డలిపెట్టు వంటి
వని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల వాస్తవాధీన రేఖ వద్ద జవాన్లపై
పాకిస్తాన్ దాడిని ప్రస్తావిస్తూ మున్ముందు ఈ ఘాతుకాన్ని అరికట్టేందుకు
చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహార భద్రత చట్టం వచ్చి న తరవాత దాని అమలు
మన ప్రాధాన్యతల్లో ఒకటిగా వుంటుందన్నారు.
మధ్యాహ్న భోజనంలో మార్పులు..
ప్రజా పంపిణీ వ్యవస్థను కంప్యూటరీకరించే ప్రక్రియను వేగవంతం
చేస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
పిల్లలకు ఇచ్చే భోజనం పోషక సమృద్ధమే కాక వంటలు కూడా పరిశుభ్రంగా జరగాలని
చెప్పారు. ఆధునాతన, ప్రగతిశీల, లౌకికవాద దేశంలో సంకుచిత సిద్ధాంతాలకు
తావులేదని చెప్పారు. ఈ విధమైన సిద్ధాంతాలు సమాజాన్ని విభజించి,
ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తాయన్నారు. వీటిని ప్రోత్సహించరాదని కోరారు.
పరస్పర సహనాన్ని, గౌరవాన్ని పెంచుకునే విధంగా వున్న సంప్రదాయాన్ని పటిష్టం
చేసుకోవాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి