22, మార్చి 2015, ఆదివారం

జనరంజక కవిత్వం అవసరం


                                                సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి
         నేటి సమాజంలో కవిత్వాన్ని జనరంజకంగా మార్చేందుకు కవులు, రచయితలు మరింత కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. ఏప్రిల్‌లో విశాఖపట్నంలో జరిగే సిపిఎం అఖిల భారత 21వ మహాసభల సందర్భంగా సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో నిర్వహించిన ‘జనకవనం’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాక్‌ యుద్ధం తరువాత ప్రజా కవిత్వం బలోపేతమైందన్నారు. నేడు దేశంలో హక్కుల్ని ఊడ్చేసే స్వచ్ఛభారత్‌ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఆయా పార్టీల కార్యాలయల్లో జరిగిన మన్మథనామ ఉగాది పంచాంగ శ్రవణం చూస్తే ఆ పార్టీలకు అనుకూలంగా సిద్ధాంతులు వ్యవహించారని స్పష్టమవుతోందన్నారు. ఎవరు ఎలా చెప్పినా ఈ సంవత్సరానికి నాయకుడు శని అని మాత్రం  అందరూ స్పష్టంగా చెప్పారన్నారు. పాలకులు చంద్రులైనా, ఇంద్రులైనా ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేయటంలో ఒకే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శాసనసభల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధికి సంబంధించి చర్చించడం, ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించటం, ప్రభుత్వ విధానాలను వివరించటం అనేవి జరగటం లేదన్నారు. ఇలాంటి సందర్భాల్లో కవుల బాధ్యత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రపంచంలో కవిత్వానికి ప్రాధాన్యత ఉందా అని కూడా చర్చించాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు. పెరుమాళ్లు కవిత్వమైనా, పికె సినిమా అయినా సాహసంతో కూడుకున్నవేనన్నారు. కవిత్వం, కవితా రీతులు ప్రజలు తమవిగా భావించే విధంగా ఉండాలని సూచించారు. అనంతరం ‘సింగపూర్‌ అనేది సిటీ స్టేట్‌ అని, అది మన ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వర్తిస్తుందని, ఢల్లీి దిక్సూచి న్యూయార్కని’ పేర్కొంటూ కవితను చదివి వినించారు. ప్రజాసాహితి సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ ‘పొయెట్స్‌ ఎగనెస్ట్‌ ఫండమెంటల్స్‌’ అనే సంస్థను ప్రారంభించాలని సూచించారు. పాత్రికేయులు వడ్లమూడి పద్మ మాట్లాడుతూ కవి నిబద్ధతతో అవిశ్రాంతంగా పనిచేయాలన్నారు. ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రగతిశీల, అభ్యుదయ భావాలు కలిగిన కవులు వాటిని బయటకు తీసుకెళ్లాలనే ఆలోచన చేయాలన్నారు. దాని కోసం మళ్లీ ఉద్యమానికి నాంది కావాలని చెప్పారు. ఈ సందర్భంగా 22 మంది కవులు పాల్గొని పలు అంశాలపై కవితలు చదివారు. నూతన రాజధాని, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు, మాతృభాష, యువత పెడదోవపట్టం వంటి అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రముఖ కవి బండ్ల మాధవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను నిర్వహించిన అనంతవరం గ్రామ చిత్రాన్ని అద్దంపట్టేలా సుదీర్ఘమైన కవితను వినిపించారు. ప్రముఖ కవయిత్రి మందరపు హైమవతి మాట్లాడుతూ నేటి యువత చెడుపోకడలను వివరించారు. అరసం నగర కార్యదర్శి కొండపల్లి మాధవరావు పడిపోతున్న విలువలకు సంబంధించిన పద్యం ఆలపించారు.  సభకు సాహితీ స్రవంతి నగర అధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్షులు కె.సత్యరంజన్‌ వందన సమర్పణ చేశారు.

కామెంట్‌లు లేవు: