17, మే 2015, ఆదివారం

పరిపక్వత చెందిన కథకుడు పాలగుమ్మి పద్మరాజు


                                                  ‘గాలివాన’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
                                                  శతజయంతి సభలో  వేదగిరి రాంబాబు

             ప్రకృతి, సమాజ పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహనతో రచనలు చేసిన పాలగుమ్మి పద్మరాజు పరిపక్వత చెందిన కథకుడని ప్రముఖ రచయిత, సాహిత్య విశ్లేషకుడు డాక్టర్‌ వేదగిరి రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలగుమ్మి పద్మరాజు శతజయంతి సభ  ఘనంగా నిర్వహించారు. సభకు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించారు. డాక్టర్‌ వేదగిరి రాంబాబు మాట్లాడుతూ పాలగుమ్మి  కథానికలోని  వాస్తవికతకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిందన్నారు. కథానికలు తక్కువ సమయంలో బుల్లెట్‌లా దూసుకెళ్లేలా ఉండాలని చెప్పారు. పాలగుమ్మి పద్మరాజు కథలు వాస్తవికతకు దగ్గరగా ఉంటూ అందరి మనస్సులకు హత్తుకుపోతాయన్నారు.  గాలివాన కథానిక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని చెప్పారు. 1985లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డుకు ఎంపికయిందన్నారు. కథలు, కథానికలు, ఏడు నవలలు రాశారు.  ఆయన రచనల ఆధారంగా బంగారుపాప, భాగ్యరేఖ, భక్తశబరి, శాంతినివాసం, బికారి రాముడు, రంగుల రాట్నం, శ్రీరాజరాజేశ్వరి విలాస్‌ కాఫీక్లబ్‌  లాంటి సినిమాలు వచ్చాయని వివరించారు. ఆయన శత జయంతి ఉత్సవాలు జూన్‌ 24తో ముగుస్తాయని తెలిపారు. క్లుప్తంగా, స్పష్టంగా ముందుకు సాగే కథానికకు కొన్ని నింబంధలున్నాయని చెప్పారు. కథానికకు పరిమితులతోపాటు పరిపూర్ణత కూడా ూండాలని అన్నారు.  బాగా పండిన పండు రాలితే ఎలా ఉంటుందో కథానిక అలా ఉండాలని వివరించారు.  పాలగుమ్మి పద్మరాజు రాసిన కథానిక అలా ఉండటం వల్లనే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పారు. గాలివాన నవలను ఆయన ఆంగ్లంలోకి అనువదించారని, ఆ రోజుల్లో ఆంగ్లంలో కథలు రాసి ఉంటే గొప్ప ఆంగ్ల రచయితగా పేరు పొందేవారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో   మన పాలకులు పద్మరాజు శతజయంతి ఉత్సవాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
          పాలగుమ్మి పద్మరాజు కుమార్తె సీత ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో తల్లీతండ్రితో ఉన్న అనుబంధం, అనుభూతులను ఆమె  వివరించారు.  మాతండ్రి జీవితంలో ప్రతి పాత్ర వాస్తవమని, కల్పితం కాదని చెప్పారు. ఆయన గొప్పతనం బతికుండగా తనకు తెలియలేదని మరణానంతరం తెలిసిందని అన్నారు. మనిషి యంత్రాలతో మాట్లాడటమనేది ఆరోజుల్లోనే ఆయన రచనల్లో తెలిసిందని చెప్పారు. మా తండ్రి బహుదూరపు బాటసారి అని చెబుతూ తిరుపతిపురంలో పుట్టి ఢల్లీిలో తుదిశ్వాస విడిచారన్నారు. క్రమశిక్షణ ఆయనను చూసి నేర్చుకున్నామని చెప్పారు. కథా రచయిత అనంతపురం శాంతి నారాయణ మాట్లాడుతూ జీవితాల మధ్య సంఘర్షణలో ూన్న కథలు నవల కన్నా ఆయన కథలే హృదయానికి తాకాయన్నారు. పడవ ప్రయాణం కథానికను వివరిస్తూ సభికులకు కళ్లకు కట్టేలా వివరించారు. కథా రచయిత నరసింహమూర్తి మాట్లాడుతూ పాలగుమ్మి పద్మరాజు కథలు మాతృత్వం గొప్పదనాన్ని, మానవ సంబంధాలను తెలిపాయన్నారు. తెలుగు రథం అధ్యక్షులు  కొంపెల్లి శర్మ మాట్లాడుతూ పాలగుమ్మి రచనల గురించి వివరించారు. సాహితీ వేత్తల జయంతి, వర్ధంతులు ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. తెలుగు రథం పేరుతో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రముఖ కథారచయిత వియోగి ప్రసాద్‌ మాట్లాడుతూ పాలగుమ్మి పద్మరాజుతో ఉన్న పరిచయాలను, ఆయన రచనలను వివరించారు. సాహితీ స్రవంతి కర్నూలు జిల్లా కార్యదర్శి కెంగార మోహన్‌  మాట్లాడుతూ పాలగుమ్మి పద్మరాజు రచనల్లోని భాష సున్నితమైన వ్యవహారిక మాండలికాల్లో రాశారని చెప్పారు. అనంతరం అతిథులకు శాలువాలు, సాహితీ పుస్తకాలతో ఘనంగా సన్మానించారు. పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘అనుకోని అతిథి రాకోయి’ అనే పాటను ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి బసవరాజు పాడారు. ఈసభలో  సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: