18, డిసెంబర్ 2017, సోమవారం

గుజరాత్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వం!

            అత్యంత హోరాహోరీగా జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ పట్టు చాటుకుంది. ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో వరుసగా ఆరోసారి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సమయాత్తమవుతోంది. అయితే, గుజరాత్‌లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడక కాలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన దానికి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ చాలా గట్టిపోటీ ఇచ్చింది. 180 స్థానాలు ఉన్న గుజరాత్‌లో బీజేపీ 99 స్థానాలు మాత్రమే గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ 92 సీట్లు అవసరం కాగా.. బొటాబొటీ మెజారిటీతో బీజేపీ గట్టెక్కింది. రాహుల్‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మరోసారి అధికారానికి దూరంగానే ఉండిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 77 సీట్లు గెలుచుకోగా.. మిత్రపక్షాలు మూడుచోట్ల విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌ కూటమికి 80 సీట్లు తగ్గాయి.  ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. 2012 ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్‌ సీట్లు 19 పెరగడం గమనార్హం. 2012లో 115 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 16 స్థానాలు తక్కువ గెలుపొందింది. 100 సీట్ల మార్కును దాటలేకపోయింది.
              ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న పరిశ్రమలు, వ్యాపారస్తులు దెబ్బతిన్నట్టు ఎన్నికలకు ముందు విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ ప్రభావం గుజరాత్‌ ఎన్నికలపై ఉంటుందని భావించారు. కానీ ఎన్నికల ఫలితాలను చూస్తే వాణిజ్య, పారిశ్రామికవర్గాలు అండగా నిలబడినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా పట్టణప్రాంతాల్లో బీజేపీ మళ్లీ పట్టు నిలుబెట్టుకోగలిగింది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ 46 స్థానాల్లో గెలుపొందగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కేవలం 10 సీట్లకు పరిమితమైంది. అదే గ్రామీణప్రాంతాల్లో ఓ మేరకు కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు హస్తానికి మొగ్గుచూపడంతో ఆ పార్టీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 67 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ 54 గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో గెలుపొందింది. ప్రధానంగా బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య ద్విముఖ పోరుగా ఈ ఎన్నికలు సాగాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు పెద్దగా ప్రభావం చూపలేదు.
           పటేల్‌ సామాజికవర్గానికి రిజర్వేషన్‌ కోసం ఉద్యమం నిర్వహించిన హార్థిక్‌ పటేల్‌ ప్రభావం ఈ ఎన్నికల్లో కొంతమేరకు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసిందని భావించవచ్చు. పటేల్‌ సామాజికవర్గం అధికంగా ఉండే సూరత్‌లో ఈ ఉద్యమ ప్రభావం అంతగా కనిపించకపోయినా.. సౌరాష్ట్రలో మాత్రం బీజేపీకి గట్టిపోటీనిచ్చింది. బీజేపీ అగ్రనేతలు సౌరాష్ట్రలో విజయం కోసం హోరాహోరీగా పోరాడాల్సిన పరిస్థితి కలిగింది. పటేల్‌ ఉద్యమానికి కేంద్రంగా ఉన్నా ఉన్జా నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపాలైంది. ఇక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ్‌భాయ్‌ లల్లూదాస్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థి ఆశా పటేల్‌ ఓడించారు. ప్రధాని మోదీ సొంతూరు వాద్‌నగర్‌ ఈ నియోజకవర్గంలోనే ఉంది. మొత్తానికి పటేల్‌ సామాజికవర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ పర్వాలేదనిపించగా.. ఓబీసీ సామాజికవర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పాగా వేసింది.
విజేతలు..పరాజితులు
                  గుజరాత్‌ సీఎం విజయ్‌ రుపానీ రాజ్‌కోట్‌ వెస్ట్‌ నియోజకవర్గంలో గెలుపొందారు. మెహసానా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ను విజయం వరించింది. కాంగ్రెస్‌కు మద్దతు పలికిన యువనేతలైన దళిత హక్కుల కార్యకర్త జిగ్నేష్‌ మేవానీ, ఓబీసీ నేత అల్ఫేష్‌ ఠాకూర్‌ విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. భావ్‌నగర్‌లో బీజేపీ గుజరాత్‌ చీఫ్‌ జీతు వాఘనీ గెలుపొందారు. పోర్‌బందర్‌లో కాంగ్రెస్‌ కీలక నేత అర్జున్‌ మొద్వాడియా ఓడిపోయారు. బీజేపీ కీలక నేత రాఘవ్‌జీభాయ్‌ పటేల్‌ జామ్‌నగర్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు.
ఓట్ల శాతం!
               ఈ ఎన్నికల్లో బీజేపీకి 49.1శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌ పార్టీకి 41.4శాతం ఓట్లు వచ్చాయి. గుజరాత్‌ ఎన్నికల్లో ‘నోటా’కు కూడా గణనీయంగా ఓట్లు పడ్డాయి. బరిలోకి దిగిన అభ్యర్థులెవరూ నచ్చలేదంటూ..  5,51,580మంది (1.8%) ఓటర్లు నోటాకు ఓటేశారు.

కామెంట్‌లు లేవు: