భారత్ సాధించిన ఆర్థిక పురోగతి ఇదే
అమెరికా, చైనా దేశాల తర్వాత భారత దేశం ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక
వ్యవస్థగా బలపడుతోంది. గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో సరాసరి ఏడు శాతం
ఆర్థిక వృద్ధిరేటును సాధించడమే అందుకు కారణం. దీన్ని మనకు ఆర్థిక నిపుణులు
గొప్పగా చెబుతారు. మన నాయకులు కూడా తమ విజయంగా ఈ విషయాన్నే వల్లె
వేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. భారత్ మూడవ బలమైన ఆర్థిక
శక్తిగా బలపడిందంటే కొనుగోలు శక్తిలో మాత్రమే. దీన్ని కూడా గర్వించతగ్గ
పరిణామంగానే పరిణమించినా ప్రపంచంలోనే ప్రజల మధ్య ధనిక, పేద వ్యత్యాసాల్లో
రష్యా తర్వాత స్థానాన్ని భారతదేశం ఆక్రమించి ఉందన్న అపకీర్తిని ఎలా
జీర్ణించుకోవాలి?
క్రెడిట్ సూస్స్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ అంచనాల
ప్రకారం భారత దేశంలోని 60 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే
పేరుకుపోయింది. అదే రష్యాలోనైతే 74 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల
వద్దనే పేరుకుపోయింది. ఇక 80 శాతం భారత్ ఆస్తి 10 శాతం ప్రజల వద్దనే
పోగుబడిపోయింది. మన జాతీయ స్థూల ఉత్పత్తి తలసరి సరాసరి సగటు 1990 నుంచి
ఇప్పటివరకు ఆరు రెట్లు పెరిగింది. అంటే, 1,130 డాలర్ల నుంచి 6, 576
డాలర్లకు పెరిగింది. దీంతో మౌలిక సౌకర్యాలతోపాటు పరిశుభ్రత, మహిళల్లో
అక్షరాస్యత పెరిగింది. ప్రసవ సమయంలో తల్లుల మృతి, అదే సమయంలో పిల్లల మృతి
తగ్గుముఖం పట్టి ఆయు: ప్రమాణం పెరిగింది. దేశ జనాభా 130 కోట్లకు చేరుకుంది.
మొత్తంగా జీవన ప్రమాణాల్లో భారత్, బంగ్లా, పాకిస్థాన్ లాంటి దేశాలను
అధిగమించింది.
అయితే ఈ అభివృద్ధి దేశంలోని ఉన్నత వర్గాలకే పరిమితం
అయింది. హిందువుల్లోని అగ్రకులాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం
మైనారిటీ వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంతో పెరిగింది. ఈ వర్గాలకు చెందిన
28 శాతం ప్రజలు, అంటే 36 కోట్ల మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు.
ప్రపంచ ధనిక దేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న భారత్‌లో సగటు భారతీయులు
దారిద్య్రంలోనే జీవిస్తున్నారు. భారత ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం ఆర్థిక
వృద్ధి రేటుపై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆ ఆర్థికాభివృద్ధిని
ప్రజలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూసినప్పుడు మాత్రమే ఆ ఆర్థిక ఫలాలు
పేదలకు కూడా చేరుతాయి. దాన్నే సామాజిక అభివృద్ధిగా నిపుణులు చెబుతారు.
2000 సంవత్సరం నుంచి 2016 వరకు భారత్ ఆర్థికంగా
వేగంగా అభివృద్ధి చెందినా.. సంపన్నులే ఎక్కువగా లబ్ధి పొందారు. 2000
సంవత్సరంలో 1 శాతం ధనికుల వద్ద 36.8 శాతం ఆస్తులుండగా, నేటికి అవి 60
శాతానికి చేరుకున్నాయి. మొత్తం దేశం ఆస్తిలో 4.1 శాతం వాటానే పేదలు
అనుభవిస్తున్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్
సూస్స్, ఆక్స్‌ఫామ్ సంస్థల అంచనా ప్రకారం 1988 నుంచి 2011 మధ్య కాలంలో
పేదవారిలో పది శాతం పేద వారి ఆదాయం సగటున రెండు వేల రూపాయలకు చేరుకోగా,
పదిశాతం సంపన్నుల ఆదాయం సగటున 40వేల రూపాయలకు పెరిగింది. పేదవారి ఆదాయం ఏటా
ఒకశాతం పెరగ్గా, సంపన్నుల ఆదాయం ఏటా 25 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది.
క్రోని క్యాపిటలిజం, కార్పొరేషన్ సంస్థలు తమ ఎగ్జిక్యూటివ్‌లకు,
వాటాదారులకు డివిడెండ్లు ఎక్కువగా ఇవ్వడం, ఉద్యోగులకు తక్కువ వేతనాలు
చెల్లిస్తూ రావడం వల్ల ప్రజల మధ్య ఈ ఆదాయ అంతరాలు తీవ్రంగా పెరిగాయి.
మధ్య తరగతి కూడా పెద్ద దెబ్బ
ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్కృతి సంరక్షణలో కీలక పాత్ర పోషించే మధ్య తరగతిపై కూడా ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం 2011లో భారత్‌లోని మధ్య తరగతి ఆదాయం రోజుకు పది డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు ఉంది. అంతకుముందు నుంచి వారి ఆదాయం పురోగతిని పరిశీలిస్తే ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా దేశాలకన్నా భారత్ వెనుకబడింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్కృతి సంరక్షణలో కీలక పాత్ర పోషించే మధ్య తరగతిపై కూడా ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం 2011లో భారత్‌లోని మధ్య తరగతి ఆదాయం రోజుకు పది డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు ఉంది. అంతకుముందు నుంచి వారి ఆదాయం పురోగతిని పరిశీలిస్తే ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా దేశాలకన్నా భారత్ వెనుకబడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి