అప్పటి ఫలితాలు
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపా కూటమి 106 స్థానాల్లో విజయం సాధించింది. వైకాపా 67 సీట్లతో స్వతంత్రులు 2 సీట్లలో గెలుపొందారు.
ఓట్లశాతం పరంగా చూస్తే తెదేపా 44.61, వైకాపా 44.58, కాంగ్రెస్ 2.77, భాజపా 2.18, స్వతంత్రులు 1.77 శాతంగా ఉన్నాయి. తెదేపా-భాజపా కూటమికి వైకాపాకు మధ్య ఓట్ల తేడా కేవలం 2.21 శాతం కావడం గమనార్హం.
పశ్చిమలో క్లీన్‌స్వీప్
తెలుగుదేశం కూటమి విజయంలో పశ్చిమ గోదావరి జిల్లా్ కీలకభూమిక పోషించింది. ఇక్కడ మొత్తం 15 స్థానాలుంటే కూటమి అన్నింటినీ గెలుచుకుంది. తెదేపాకు 14, భాజపాకు 1 సీటు లభించాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలకు తెలుగుదేశం 7, వైకాపా 3 గెలుచుకున్నాయి. విజయనగరంలో 9 స్థానాలుంటే తెదేపాకు 6, వైకాపాకు 3 లభించాయి. విశాఖపట్నం జిల్లాలోనూ తెలుగుదేశం కూటమి తిరుగుదేని విజయాన్ని అందుకుంది ఇక్కడ మొత్తం 15 సీట్లు ఉంటే 12 సీట్లను కూటమి తనఖాతాలో వేసుకుంది.
తూర్పులోనూ కూటమిదే హవా
తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలుండగా కూటమి 14 స్థానాల్లో తెదేపా-భాజపా కూటమి జయకేతనం ఎగరవేసింది. వైకాపాకు 5 సీట్లు దక్కాయి.
కృష్ణా, గుంటూరులో తెలుగుదేశం జోరు
కృష్ణాలో 16, గుంటూరులో 17 సీట్లు వున్నాయి. కృష్ణా జిల్లాలో కూటమి 11 సీట్లను గెలుచుకోగా, వైకాపా 5 సీట్లలో విజయం సాధించింది. అలాగే గుంటూరులో తెదేపాకు 12, వైకాపాకు 5 దక్కాయి.
ప్రకాశం, నెల్లూరులో వైకాపా ఆధిక్యం
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైకాపా ఆధిక్యం ప్రదర్శించింది. ప్రకాశంలో మొత్తం 12 సీట్లు ఉంటే అందులో తెదేపాకు 5, వైకాపాకు 6 దక్కాయి, చీరాలలో నవోదయం పార్టీ విజయం సాధించింది. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలుండగా వైకాపా 7 స్థానాల్లో జయకేతనం ఎగరవేయగా మిగిలిన సీట్లలో తెదేపా గెలుపు సాధించింది.
రాయలసీమలో..
రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొత్తం 14కు గాను తెదేపాకు 12, వైకాపాకు 2 లభించాయి. వైఎస్సార్ కడప జిల్లాలో వైకాపా భారీ విజయాన్ని నమోదుచేసింది. ఇక్కడ 10 నియోజకవర్గాలుండగా వైకాపా ఏకంగా తొమ్మిది స్థానాలను స్వీప్ చేసింది. తెదేపా ఒకే స్థానం (రాజంపేట)లో గెలుపొందింది. కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకర్గాలుండగా వైకాపా 10 స్థానాలను, తెదేపా 4 స్థానాలను దక్కించుకున్నాయి. చిత్తూరు జిల్లాలో 14 సీట్లు ఉండగా తెదేపా 6, వైకాపాకు 8 సీట్లలో విజయాన్ని అందుకున్నాయి.
2019లో
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవాలని తెలుగుదేశం, అధికారాన్ని అందుకోవాలని వైకాపా, కొత్తగా బరిలో దిగిన జనసేన తన సత్తా చూపించాలని ఆశిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖపోరు నెలకొనింది. భాజపా సైతం ఒంటరిగా బరిలోకి దిగింది. అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరుగుతుండటంతో రాష్ట్రంలో రాజకీయవాతావరణం ఉత్కంఠగా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హామీల అమలు, ప్రభుత్వ పనితీరు, వైకాపా ప్రకటించిన నవరత్నాలు, పోలవరం.. తదితర అంశాలు కీలకంగా ప్రభావం చూపించే అవకాశముంది.