18, ఆగస్టు 2019, ఆదివారం

ఎపిని మార్చడమే నా కల

* పరిశ్రమలకు ఎర్ర తివాచీతో స్వాగతం
* ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పాత్ర గొప్పది
* డల్లాస్‌ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

                రాష్ట్రాన్ని అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రంగా మార్చాలన్నదే తన కల అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంవత్సరానికి ఒకటి, రెండు సార్లయినా సొంత గ్రామాలకు వచ్చి అందరినీ పలకరించాని, పెట్టుబడులు పెట్టడానికి ముందడుగు వేస్తూ మీరు రావాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుంటుందని సిఎం చెప్పారు. గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాటం ఉన్నవాళ్లు, గ్రామాల్లో వైద్యశాలలు మార్చాలని తపన ఉన్నవాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి గ్రామాలను బాగుపరుచుకుందామని, ప్రభుత్వ ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతివ్వాలని కోరారు. పరిశ్రమలకు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నామని, పిపిఎల సమీక్ష ద్వారా పరిశ్రమలకు మేలు కలుగుతుందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పోషించిన పాత్ర చాలా గొప్పదని, చరిత్రాత్మక విజయం వెనుక మీ కృషి ఉందని అన్నారు. అమెరికన్లను మించి తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు చేపట్టామని, ప్రతి మనిషీ, ప్రతి కుంటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు చేశామని చెప్పారు. అన్నం పెడుతున్న రైతులకు అన్నం దొరక్క అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదన్నది, రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదన్నది, పల్లెలు కళకళలాడాలని, ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది తన కోరికని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలని, పేదవాడు వైద్యం ఖర్చు భరించలేక, చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదన్నది, సొంత ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నది, పేదరికం, నిరుద్యోగంతో పస్తులు ఉండకూడదన్నది తన కల అని చెప్పారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది తన కల అని తెలిపారు. రెండున్నర నెలల వ్యవధిలోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నానన్నారు. అణగారిన వర్గాలు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా, నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడాలేని చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలను కుదుర్చుకుంటున్నామని తెలిపారు. మూడేళ్లలో పాఠశాలలు, ఆస్పత్రుల పరిస్థితిని మారుస్తామని, నాడు, నేడు అని ఫొటోలు చూపిస్తామని చెప్పారు.

కామెంట్‌లు లేవు: