-సిందూరం కవితా సంపుటి పరిచయ సభలో ప్రసాదమూర్తి
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్కారల్మార్క్సు పెట్టుబడి గ్రంథాన్ని మరో కోణంలో చదవడానికి ప్రేరణ ‘సిందూరం’ అని ప్రముఖ రచయిత, కవి, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ప్రసాదమూర్తి అన్నారు. ఆదివారం కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో ఉన్నం వెంకటేశ్వర్లు, ఉష రచించిన ‘ సిందూరం’ పెట్టుబడి కవితల కట్టుబడి అనే పుస్తక పరిచయ సభ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షతన సిందూరం కవితా సంపుటిని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి ప్రసాదమూర్తి మాట్లాడుతూ రచయిత పున్నం వెంకటేశ్వర్లుతో ఉన్న పరిచయాన్ని ఆయన వివరిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా యూనివర్సిటీలో కమ్యూనిజం గురించి కవిత్వం రాయాలనేవారన్నారు. ప్రజాశక్తిలో తాను సబ్‌ఎడిటర్‌గా పని చేస్తున్నప్పుడు, కలిసి పని చేశామన్నారు. ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా, ప్రజాశక్తి జర్నలిజం స్కూలుకు ప్రిన్సిపల్‌గా వివి పని చేశారన్నారు. పట్టుదల గల వ్యక్తి మానసిక బలాఢ్యుడని కొనియాడారు. మనుషులు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని చెప్పారు. మానవజాతి చరిత్ర అజెయమన్నారు. సింధూరంలో పెట్టుబడి కీలక అంశమన్నారు. కవి పెట్టుబడి అనే అంశాన్ని కవిత్వంలో అన్వయించడం చాలా సాహసోపేతమైన పని అన్నారు. సిందూరమనే కవితా సంపుటిలో సరళంగా రాశారని, పెట్టుబడిని కవిత్వంలోకి తీసుకురావడంలో సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు.
‘ఇది స్త్రీ నుదిటి సిందూరం కాదు/ శ్రమశక్త్తి వాటామార్పుకు/ తెగువచూపే కష్టజీవుల/ బలగాలు చేసే యుద్ధాల/ నుదిటిపై దిద్దిన పోరాటాల కొత్త సిందూరం’ అని ఉన్న వెంకటేశ్వర్లు కవితలో చెప్పారన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు పెట్టుబడులు మతతత్వాలకు నిలయంగా మారాయని అన్నారు. ప్రముఖ కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వస్తువుగా ఉపయోగించా రన్నారు. పెట్టుబడి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వివరించారన్నారు. మానవ సమాజానికి పెట్టుబడికి ఉన్న సంబంధం గురించి సిందూరం పేరుతో చక్కగా రాశారన్నారు. మార్క్స్ క్యాపిటలిజం గురించి చెప్పడంతోపాటు సమాజంలో జరుగుతున్న విషయాలను సిందూరంలో ఉద్వేగ భరతమై విషయం తీసుకున్నా రన్నారు. విధ్వంస చర్యలను గురించి వివరించారని చెప్పారు. సమసమాజ భావ జాలాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించా రని చెప్పారు. ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్ ఇంచార్జి పానుగంటి చంద్రయ్య మాట్లాడుతూ ఉన్నం వెంకటేశ్వర్లు , ఉష ఎల్లప్పుడూ పత్రికల్లో కొత్తదనం ఉండాలని సూచించేవారని, పట్టుదల, క్రమశిక్షణ గలవ్యక్తులని అన్నారు. సిందూరం కవితా సంపుటిలో సరళమైన బాషలో, అర్థవంతమైన పదాల పొందికతో అందరినీ చదివించ దగినదిగా ఉందని చెప్పారు. మార్పు అనివార్యం అని కొత్తకోణంలో చెప్పిన ఈ పుస్తకాన్ని చదవాలన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ మాట్లాడుతూ మానవ సమాజ మార్పును కోరుకునే మార్క్సు పెట్టుబడిని గ్రంథాన్ని కవిత్వంలో రాయడం గొప్ప పని అన్నారు. మనిషికి మనిషిని దూరం చేసే సమాజంలో మనం ఉన్నామన్నారు. బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి ఆవుల చక్రపాణి ఉన్నం వెంకటేశ్వర్లు ఉషాలో పంపిన సందేశాలను చదివి వినిపించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రీశ్రీ అభిమానులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.