11, ఆగస్టు 2025, సోమవారం

గ్రామాల్లో బెల్ట్‌షాపులను నిషేధించాలి




బుద్దారం చరిత్ర `సంస్కృతి పుస్తకావిష్కరణ సభలో జి.చిన్నారెడ్డి
                గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెల్టుషాపులను పూర్తిగా నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. రచయిత  హెచ్‌.రమేష్‌బాబు రచించిన గోపాల్‌పేట మండలం  ‘బుద్దారం చరిత్ర`సంస్కృతి’ పుస్తకాన్ని చిన్నారెడ్డి ఆవిష్కరించారు. విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  పాలకులు ఆదాయంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గురించి కూడా ఆలోచించాలని అన్నారు. శతాబ్దాల బుద్దారం చరిత్ర గ్రంథస్తం కావడం రేపటి తరాలకు ఎంతో అవసరమని గ్రామాల చరిత్రనే దేశ చరిత్రలకు మూలంగా ఉన్నదని అన్నారు.   ఇలాంటి చరిత్రలను ప్రతి గ్రామంలోనూ రచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుద్దారం విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రచయిత  హెచ్‌. రమేష్‌ బాబును ప్రోత్సహించి గ్రామ చరిత్ర రాయడానికి చేసిన కృషిని అభినందించారు. బుద్దారం గోనబుద్దారెడ్డితో మొదలుకొని కాకతీయుల కాలం నుండి వర్ధమాన పురం మీదుగా గొప్ప చరిత్రను కలిగి ఉన్నదన్నారు. గ్రామంలో చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారని చెప్పారు.  పూర్వకాలం బుద్దారం ఒక గొప్ప నగరం అని పేర్కొన్నారు. రమేష్‌బాబు చాలా రచనలు చేశారని సినిమా దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గురించిరాసిన పుస్తకం చదివానన్నారు.   వనపర్తి జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షులు లోకనాథ్‌ రెడ్డి ప్రసంగిస్తూ ఇలాంటి గ్రామ చరిత్రలతో కూడిన గ్రంథాలు అన్ని గ్రామాలలో రూపొందాలని పేర్కొన్నారు. పానుగల్‌ ఎంఇఒ శ్రీనివాసులు పుస్తకాన్ని సమీక్షించారు. చారిత్రక నేపథ్యంతో పాటు, గ్రామంలో విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం, అంబేద్కర్‌ విజ్ఞాన సేవాసంఘం చేసిన సేవలను రచయిత వివరించారని తెలిపారు.  గ్రామపంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి సర్పంచులు, గ్రామంలో నిశ్నాతులు, వివిధ వృత్తులలో స్థిరపడిన వారి వివరాలు బాగా సేకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.బలరాంరెడ్డి, డి.అచ్యుత రామారావు, డాక్టర్‌ ఎల్‌.శ్రీనివాసులు, ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య, మాజీ సర్పంచులు జాంప్లానాయక్‌, పానుగంటి శివకుమార్‌,  డాక్టర్‌  పలుస శేఖర్‌, అమర్‌నాత్‌, పి.రాములు, పసుపుల కృష్ణారావు, విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం నాయకులు పూల్యానాయక్‌, ఉమామహేశ్వర్‌, ఓంకార్‌ మాట్లాడారు. రచయిత రమేష్‌బాబును సన్మానించారు.


కామెంట్‌లు లేవు: