2, మార్చి 2026, సోమవారం

చీకటిలో పుట్టిన నిండు చంద్రుడు


​పుట్టుక వెనుక కథ

                ​అది 70వ దశకం. ఊరంతా హోలీ పండుగ సంబురాల్లో ఉంది. కాముని దహనం కోసం కట్టెలు పేర్చి, ఊరంతా ఆ సెగల్లో చలి కాచుకుంటున్న వేళ.. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ పేదింట్లో ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. చదువు రాని ఆ తల్లిదండ్రులకు తేదీలు తెల్వదు, తిథులు తెల్వదు. కానీ, ఆకాశంలో నిండుగా వెలుగుతున్న జాబిలిని చూసి, "నా కొడుకు పౌర్ణమి నాడు పుట్టిండు.. వీడు అందరికీ వెలుగునిచ్చే చంద్రయ్య" అని మురిపెంగా పేరు పెట్టుకున్నారు.

​కష్టాల కౌగిలిలో బాల్యం

          ​చంద్రయ్యకు ఏడేళ్లు వచ్చేసరికి ఆటలు పోయి ఆవుల గాడిదలు వచ్చాయి. అమ్మనాన్నలు రెక్కాడితే గానీ బుక్కాడని కూలీలు. అందుకే ఏడాదికి ఆరు వందల రూపాయల జీతం మీద చంద్రయ్యను ఒక యజమాని దగ్గర గేదెల కాపరిగా కుదిర్చారు. ​కోడి గూయక ముందే చంద్రయ్య బతుకు చక్రం తిరగడం మొదలయ్యేది. చలికి వణుకుతూనే పది గేదెల పేడ తీయాలి, పాక కడిగి శుభ్రం చేయాలి. ఆ తర్వాత గేదెలను అడవికి తోలుకెళ్లి, ఎండలో ఎండుతూ అవి మేసే దాకా కనిపెట్టుకోవాలి. కానీ చంద్రయ్య కళ్ళల్లో ఏదో ఒక తపన. యజమాని కూతురు పారేసిన ఒకటో తరగతి పాత పుస్తకాలే అతనికి నిధి. పగలు గేదెలు కాస్తూ ఆ బొమ్మలు చూసేవాడు, రాత్రి వీధి దీపాల కింద కూర్చుని 'పెద్దబాలశిక్ష'లోని అక్షరాలు దిద్దేవాడు.

​ఆ గాయం.. ఒక మలుపు

    ఒక వేసవి మధ్యాహ్నం.. స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లినందుకు యజమాని చంద్రయ్యను విపరీతంగా కొట్టాడు. ఆ దెబ్బకు చంద్రయ్య మోకాళ్లు పగిలి రక్తం కారింది. ఆ నొప్పి భరిస్తూనే గేదెలను తోలుకొచ్చి, పని ముగించుకుని రాత్రికి రాత్రే ఊరు విడిచి పారిపోయాడు.​రెండు రోజుల పాటు అడవిలో మామిడి తోట దగ్గర తన తాత తమ్ముడి దగ్గర దాక్కున్నాడు. ఆ ముసలాయన పెట్టే సద్ది అన్నం తింటూ ఆకాశం వైపు చూశాడు. "నేను గేదెలు కాస్తే నా బతుకు ఈ పేడ కుప్పలోనే కలిసిపోతది.. అదే సదువుకుంటే నా పేరు వెనక అక్షరాలు చేరతాయి" అని ఆ పౌర్ణమి బిడ్డ గట్టిగా నిర్ణయించుకున్నాడు.

​అక్షర యోధుడు

          ​ఇంటికి తిరిగి వచ్చిన చంద్రయ్య మొండికేశాడు. "నేను గేదెలు కాయను.. సదువుకుంటా" అని తెగేసి చెప్పాడు. ఊరి హెడ్ మాస్టర్ సాయంతో బడిలో చేరాడు. ఏ అక్షరాల కోసం అయితే యజమాని దగ్గర దెబ్బలు తిన్నాడో, అదే అక్షరాలను తన ఆయుధాలుగా మార్చుకున్నాడు. పట్టుదలతో చదివి పీజీ పట్టా పుచ్చుకున్నాడు.

​ముగింపు

                  ​ఈ రోజు చంద్రయ్య చేతిలో కర్ర లేదు.. గేదెల వెంట తిరిగే బతుకు లేదు. సమాజంలోని అన్యాయాలను ఎండగట్టే జర్నలిస్టుగా అతను కలం పట్టాడు. ఒకప్పుడు పేడ గంప మోసిన అదే చేతులతో ఇయ్యాల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ​ఎక్కడైతే మోకాళ్లు పగిలి రక్తం ఓడిందో, అక్కడే తన విజయకేతనాన్ని ఎగురవేశాడు. అమ్మ చెప్పినట్టుగానే చంద్రయ్య తన పేరును సార్థకం చేసుకున్నాడు. చీకటిలో పుట్టినా, పౌర్ణమి వెలుగులా అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

​ముగింపు సందేశం:
                    "బాల్యంలో తగిలిన గాయం మానసిక ధైర్యంగా మారితే.. ఒక గేదెల కాపరి కూడా చరిత్రను రాసే జర్నలిస్టు కాగలడని చంద్రయ్య జీవితం నిరూపించింది."
                                                                                                                                    -పానుగంటి రాధమ్మ