ఎత్తైన కొండలు, పచ్చనిచెట్లతో భూమికే తలమానికంగా ఉన్న నల్లమల అందాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. వాటిని చూస్తేనే తప్ప తనివితీరదు. పక్షుల కిలకిలారావాలు, ఎత్తైన కొండల మీదనుండి పారే జలపాతాలు, సెలయేర్లు చూపరులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. నల్లమలలో మల్లెలతీర్థం, సలేశ్వరం, లొద్ది తదితర ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో ఈ సుందర ప్రదేశాలు కనిపిస్తాయి.
శ్రీశైలం రహదారిలో..
నాగర్‌కర్నూల్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో రంగాపూరం గ్రామం దాటగానే అడవి ప్రారంభమౌతుంది. ముందుగా ఉమామహేశ్వర దేవాలయం వస్తుంది. ప్రధాన రహదారి నుండి ఐదు కిలోమీటర్లు వెళ్తే ఈ దేవాలయం ఉంది. ఇది ఎత్తైన కొండల మధ్య ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి జలపాతాలు వేసవిలో సైతం పారుతుంటాయి. దీంతో ఇక్కడి నీటిని తాగి సాధువులు, వన్యమృగాలు, భక్తులు దాహం తీర్చుకుంటుంటారు. ఇదేదారిలో మన్ననూర్ తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో లొద్దికి డొంక దారి ఉంటుంది. ఇది ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది. అక్కడ కిలోమీటరు వరకు కాలినడకన లోయలోకి దిగాల్సి ఉంటుంది. అడవి ప్రాంతం నుండి వచ్చే నీరు ఈ లోయలో పడుతుంది. అన్ని కాలాల్లోనూ పారే ఈ నీరే చెంచులు, వన్యమృగాలకు ఆధారం. ఇదే దారిలో మరో 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే సలేశ్వరం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. నడవడానికి ఏలాంటి పట్టూ ఉండదు. అంతా రాళ్లు, చెట్లు, నీటి ధారలు పడుతుండడం వల్ల జారుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ 200 అడుగుల ఎత్తు నుండి నీరు ఉధృతంగా కిందకు దూకుతూ చూడడానికి మనోహరంగా ఉంటుంది. ఇక్కడి నుండి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే మరో జలపాతం కనిపిస్తుంది. అదే మల్లెలతీర్థం. ఇది వటవర్లపల్లి నుండి తొమ్మిది కిలోమీటర్లు అడవిలోకి వెళ్తే వస్తుంది. ఎండాకాలంలో అంతగా నీరు లేకపోయినా వర్షాకాలంలో జలఉధృతి తీవ్రంగా ఉంటుంది. ఈ జలపాతాలు అడవి మధ్యన ఉండడం వల్ల ఇక్కడ ఏలాంటి సదుపాయాలూ ఉండవు. సందర్శకులు ఆహార పదార్థాలు వారి వెంటే తెచ్చుకుని తినాల్సి ఉంటుంది. వటవర్లపల్లి నుండి మరో 40 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలం ప్రాజెక్టు, 60 కిలోమీటర్ల వేళ్తే శ్రీశైల దేవస్థానం వస్తాయి.
యాత్రికుల తాకిడి
శ్రీశైల దేవస్థానానికి వచ్చే యాత్రికుల తాకిడికి ప్రధాన కారణం ప్రకృతి అందాలు. వీటిని ఆస్వాదించడానికి కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా సందర్శకులు వస్తుంటారు. అడవి సంపద, జలపాతాలు, వన్యమృగాలను చూసిన తర్వాతనే సందర్శకులు శ్రీశైలం వెళ్తారు. శ్రీశైలం ప్రాజెక్టు, నీటి ప్రవాహం, పవర్‌హౌజ్ చూడడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన టన్నెల్ పవర్‌హౌజ్ ప్రపంచంలోనే రెండవది. దీన్ని చూడడానికి విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
ప్రకృతిపై కన్ను
ప్రకృతి సిద్ధంగా ఏర్పడే జలపాతాలను చూడడానికి కూడా డబ్బులు చెల్లించాల్సిందే. ఏపి టూరిజం వారు ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రతి మనిషికీ ఐదు రూపాయలు, వెహికిల్‌కు 25 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. డబ్బులైతే వసూలు చేస్తున్నారు కాని వసతులు కల్పించడంలో టూరిజం శాఖ అధికారులు విఫలమయ్యారని సందర్శికులు విమర్శలు చేస్తున్నారు.
కనీస వసతులు లేవు
ఏపి టూరిజం వారు డబ్బులు వసూలు చేస్తున్నారు కాని ఏలాంటి వసతులూ కల్పించలేదు. స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు లేవు. ఒక క్యాంటిన్ లేదు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఇక్కడికి రావడానికి బస్సులు లేకపోతే నడిచి రావాల్సిందే. వాహనాలు కూడా ఏర్పాటు చేయలేదు. రహదారి అంతా ఎర్రటి దుమ్ము. బీటీ రోడ్డు లేదు. ఇవన్నీ లేకుండానే టోల్‌ఫీజు వసూలు చేయడం యాత్రికులను మోసం చేయడమే.
- మంగమ్మ, శ్రీశైలం యాత్రికురాలు.
1 కామెంట్:
nice
కామెంట్‌ను పోస్ట్ చేయండి