ఇప్పటికైనా లౌకిక వాదులు మేల్కొనాలి
దక్షణాదిలో బిజెపికి తగిన శాస్తి జరగాలి
కర్ణాటక అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్ష ఓ 'ఫార్సు' అని తేల్చిన గవర్నర్ రాష్ట్రపతి పాలన కోసం కేంద్రానికి సిఫార్సు పంపినట్లు సమాచారం. అయితే ఇప్పటికైనా లౌకిక వాదులు మేల్కొని మేల్కొని బిజెపికి ముకుదాడు వేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. మతోన్మాదంతో పాటు బడా వ్యాపారుల చేతిలోకి వెళ్లిన పాలనపై ప్రక్షాలన జరగాల్సిఉంది. రాష్ట్ర పాలనపై కేంద్రం ఏ క్షణాన్నైనా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన విధించటం జరిగితే మూడేళ్ల వ్యవధిలో ఇది రెండోసారి అవుతుంది. శాసనసభలో జరిగిన పరిణామాలన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. సోమవారంనాటి బలపరీక్షకు ముందే స్పీకర్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసారు. ఎడ్యూరప్ప సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, జెడి(ఎస్) సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ ముందున్న వెల్‌లో గుమిగూడిన సమయంలోనే ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన ముందు గుమిగూడి నినాదాలు చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను పట్టించుకోకుండానే స్పీకర్ 106 మంది బిజెపి సభ్యులతో విశ్వాస తీర్మానం నెగ్గినట్లు ప్రకటిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. కేవలం 15 నిముషాల్లోనే బలపరీక్షను పూర్తి చేసిన స్పీకర్, ఎడ్యూరప్ప సర్కారు నెగ్గినట్లు ప్రకటించారు.
వందలాది పోలీసుల మోహరింపు
ఇదిలా ఉండగా శాసన మండలికి చెందిన ముగ్గురు సభ్యులు బలపరీక్ష సమయంలో సభలో ప్రత్యక్షమయ్యారు. అనర్హులుగా ప్రకటించిన శాసన సభ్యులను సభలోకి రానివ్వకుండా తలుపులు మూసివేసిన ఘటన కర్నాటక అసెంబ్లీ చరిత్రలో సోమవారం తొలిసారిగా జరిగింది. అసెంబ్లీ మార్షల్స్, వందలాదిమంది పోలీసులు అసెంబ్లీ చుట్టుపక్కల మోహరించారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎడ్యూరప్ప సర్కారును గెలిపించిన స్పీకర్‌ను 'బిజెపి ఏజెంట్' అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. స్పీకర్ ప్రకటనపై ఆగ్రహించిన ప్రతిపక్షాలు గవర్నర్‌ను ఆశ్రయించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బిజెపి సర్కారు దుర్వినియోగం చేయటంపై కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యేనూ వదల్లేదు
సర్కారు తన అధికారాన్ని కాపాడుకునే క్రమంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను సైతం వదిలిపెట్టలేదు. ఎళబాగురి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈశన్న గులగన్నవార్ సోమవారం అంబులెన్స్‌లో శాసనసభకు హాజరై విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. ఆయన గత కొద్ది వారాలుగా గుండెనొప్పితో నగరంలోని ఒక ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేను వీల్ ఛైర్‌లో శాసనసభలోకి తీసుకువచ్చిన అంబులెన్స్ సిబ్బంది తరువాత అదే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. హైకోర్టుకెళ్లిన రెబల్స్
తమను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ కెజి బొప్పయ్య తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అసమ్మతి శాసనసభ్యులు సోమవారం కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి కేసును మంగళవారానికి వాయిదా వేసింది. గవర్నర్ చర్యను సమర్ధించిన మొయిలీ
కర్నాటకలో ఎడ్యూరప్ప సర్కారు బలపరీక్ష నెగ్గిన కొద్దిసేపటికే గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయటాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ గట్టిగా సమర్ధించారు. స్పీకర్ కెజి బొప్పయ్య రాజ్యాంగ విరుద్ధంగా అసమ్మతి ఎమ్మెల్యేలను
సస్పెండ్ చేయటం వల్లే గవర్నర్ ఈ చర్య తీసుకున్నారని ఆయన ముంబయిలో ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సోమవారం నాటి బలపరీక్ష సందర్భంగా శాసనసభలో భయానక వాతావరణం నెలకొందన్నారు. సర్కారు బర్తరఫ్‌కు ప్రతిపక్షం డిమాండ్
శాసనసభలో బలపరీక్ష ముగిసిన అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్, జెడి(ఎస్) శాసనసభ్యులు గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బలపరీక్ష నిర్వహణకు స్పీకర్ అనుసరించిన విధానంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపును ఎవరూ కోరలేదు: స్పీకర్
అసెంబ్లీలో బలపరీక్షకు తాను అనుసరించిన విధానాన్ని స్పీకర్ కెజి బొప్పయ్య గట్టిగా సమర్ధించుకున్నారు. ఈ బలపరీక్షలో ఓట్ల లెక్కింపును ఏ పార్టీ కోరలేదని, అందువల్లే తాను మూజువాణి ఓటింగ్‌ను అనుమతించానని ఆయన చెప్పారు. అసెంబ్లీలోకి పోలీసుల ప్రవేశాన్ని కూడా ఆయన గట్టిగా సమర్ధించారు. ధనబలంతో సర్కారును కూల్చే కుట్ర
విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం ధనబలంతో తన సర్కారును కూల్చేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. ఈ కుట్రలో ప్రతిపక్షం వెదజల్లిన నోట్ల కట్టల గుట్టును తాను త్వరలోనే రట్టు చేస్తానన్నారు. గవర్నర్ రీకాల్‌కు బిజెపి డిమాండ్
రాజ్యాంగ ప్రతినిధిగా కాక రాజకీయ నేతల తరహాలో వ్యవహరిస్తున్న గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్‌ను రీకాల్ చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బదులుగా ఆయన అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జెడి(ఎస్)లను ఎగదోస్తున్నారని కర్నాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎఎస్ ఈశ్వరప్ప విమర్శించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి