12, అక్టోబర్ 2010, మంగళవారం

అపరమేథావి గ్రామం అథోగతి



మాడ్గుల పంచాయతీలో ఎక్కడి సమస్యలక్కడే
30 ఏళ్లుగా జైపాల్‌రెడ్డి కుటుంబీకులదే పాలన
''ఆయన అపరమేథావి... ఆయన పార్లమెంటులో ఆంగ్లంలో ప్రశ్నలడిగితే సభ్యులు నిఘంటువులు వెతకాలి. సమస్యలను, సవాళ్లను చాకచక్యంగా చర్చించగల సమర్థునిగా గుర్తింపు పొందారు. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు కీలకమైన పదవులే లభించాయి. ఆయన స్వగ్రామం మాత్రం సమ్యలకు నిలయమైంది. పరిష్కారానికి నోచుకోలేదు. అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్నచందంగా ఉంది. స్వగ్రామంపై ప్రేమలేకనా?.... నిధులు లేకనా? ఆసమస్యలను పరిష్కరించేందుకు సాధ్యంకాకనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయనెవరోకాదు.... కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి. ఆయన సొంత గ్రామం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా మాడ్గుల. ఆ గ్రామాన్ని 30 ఏళ్ల పాటు ఆయన కుటుంబీకులే పాలించారు. ఇప్పటికీ గ్రామంలో అనేక సమస్యలు తిష్టవేశాయి''.
ప్రధానంగా గ్రామంలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు అనేక రోగాల బారిన పడ్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పాడుబడిన ఇండ్లు, గుంతలమయమైన రోడ్లే కనిపిస్తాయి. గ్రామపంచాయతీలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 30ఏళ్ల పాటు జైపాల్‌రెడ్డి కుటుంబం పాలించినప్పటికీ గ్రామం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. తమ గ్రామం నుండి కేంద్ర స్థాయిలో పలుకుబడి ఉన్న వ్యక్తి తమ గ్రామస్తుడైనా తమకెలాంటి ప్రయోజనం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికీ తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలు ఏర్పడినప్పుడు తొలి సర్పంచిగా సూదిని రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. 1967వరకు ఆయన కొనసాగారు. ఆ తర్వాత సంవత్సరంపాటు వెంకటయ్య, మరోసంవత్సరం పాటు సూదిని నర్సింహారెడ్డి, మరో సంవత్సరం పాటు రసూలు, సూదిని క్రిష్ణారెడ్డి 11సంవత్సరాల పాటు గ్రామ సర్పంచిగా కొనసాగారు. అనంతరం 1981నుండి 94వరకు జైపాల్‌రెడ్డి సోదరుడు సూదిని రామిరెడ్డి కొనసాగారు. 1994 తర్వాత గ్రామ సర్పంచి స్థానం బిసిలకురిజర్వు కావడంతో అప్పటి నుండి 2001వరకు గౌని రాములు కొనసాగారు. 2001నుండి కంబాలపల్లి లక్ష్మమ్మ కొనసాగుతున్నారు. గ్రామపంచాయతీ మొదటి సారి ఏర్పడినప్పుడు మొత్తం జనాభా రెండువేలు ఉండేది. గ్రామంలో వార్డు సభ్యుల సంఖ్య ఆరు ఉండగా ప్రస్తుతం 14కు చేరింది. మొత్తం ఓటర్ల సంఖ్య 4,700కు చేరింది. ఒక్కో వార్డులో 333ఓట్లుగా నిర్ణయించారు. మాడ్గుల గ్రామపంచాయతీ పరిధిలో పెద్దమాడ్గుల, మాడ్గుల తండా, నర్సాయపల్లి, ఖమ్మవారిపాలెం అంబ్లెట్‌ గ్రామాలుగా కొనసాగుతున్నాయి. మాడ్గుల మండల కేంద్రమైనప్పటికీ ఆ రూపు రేఖలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం సర్పంచి లక్ష్మమ్మ హయాంలో గ్రామంలో అక్కడక్కడ సిసి రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ దళితవాడ, హామ్లెట్‌ గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టలేదు. గ్రామానికి నేటికీ సరైన రవాణా సౌకర్యం లేదు. రోడ్లు పూర్తిగా గుంతల మయం కావడంతో ప్రయివేటు వాహనాలు వచ్చేందుకు భయపడుతున్నాయి.
ప్రస్తుత సర్పంచి కూడా జైపాల్‌రెడ్డి అనుచరుడే
ప్రస్తుత సర్పంచి కూడా జైపాల్‌రెడ్డి అనుచరుడే. ఈ సారి గ్రామాన్ని బిసిలకు రిజర్వు చేశారు. కాంగ్రెస్‌ నుండి కాట్లయాదయ్య పోటీ చేసి గెలుపొందాడు. ఎవరున్నా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో జైపాల్‌రెడ్డి చేసింది మాత్రం నామమాత్రమే.
తాగునీటికోసం తంటాలెన్నో ....
తాగునీటికోసం మాడ్గులతో ప్రజలు తంటాలు పడుతుంటారు. 300-350 అడుగుల లోతుకు తవ్వినా మంచినీళ్ళ దొరకవు. ఒకవేళ దొరికినా ఉప్పునీరే! తాగడానికి పనికిరావు. ప్లోరైడ్‌ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఈనీటిని తాగిన వారికి కాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, అరికాళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, నడుంనొప్పులు, పళ్లగారపట్టడం, ఒంటినొప్పులు, కాళ్లు వంకరపోవడం తప్పవు. ఫ్లోరోసీస్‌నుండి తమను తాము రక్షించుకునెందుకు తాటి కల్లును తాగాల్సివస్తుందని మండల ప్రజలు చెప్తున్నారు. ఇటీవల ఈ సమస్య పరిష్కారమైంది.
తాగునీటి హామీ నెరవేరింది
మాడ్గుల మండలంలోని ప్లోరైడ్‌ పీడిత గ్రామాలన్నీటికి కృష్ణాజలాలు అందిస్తామని జైపాల్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. ఆహామీ ఇటీవల నెరవేరింది. 11కోట్ల 25లక్షల రూపాయలతో ఒక పథకానికి రూపకల్పన చేయించారు. నాగార్జునసాగర్‌ ద్వారా కృష్ణాజలాలను ఈ పథకం ద్వారా మాడ్గులకు అందిస్తున్నారు. మాడ్గుల మండలానికి జైపాల్‌రెడ్డి జీవితంలో నెరవేరిన పెద్ద హామీ ఇదొక్కటే. తమ జిల్లాలోని వందలాది ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వకుండా మాడ్గులకు ఇవ్వడం సరికాదని నల్గొండ జిల్లా వాసులు అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది.
జైపాల్‌రెడ్డి స్వగ్రమానికి చేసింది శూన్యం
కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తన స్వంత గ్రామమైన మాడ్గులకు, ఆమండలానికి చేసిందేమి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 1970వ దశకంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. కల్వకుర్తి నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా పని చేశారు. కేంద్రంలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీగాను, గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఎపిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. సుదీర్ఘమైన తన రాజకీయ జీవితంలో మంత్రి జైపాల్‌రెడ్డి ఆయన స్వగ్రామం సమస్యలను సైతం పరిష్కరించలేక పోతున్నారనే విమర్శలున్నాయి.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుకే పరిమితం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరుకే పరిమితమైంది. కల్వకుర్తికి చుక్కనీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రాజకీయ పలుగుపడిని ఉపయోగించి ఎత్తిపోతల పథకం డిజైన్‌ మార్చేశారు. దీంతో కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కరువు , వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు జైపాల్‌రెడ్డి చేసిందేమి లేదు.

కామెంట్‌లు లేవు: