స్థానిక సమస్యలపై ప్రజాసంఘాలు నిర్వహిస్తున్న నిరవధిక, రిలే దీక్షలకు మద్దతుగా ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. దీక్షలకు సంఘీభావంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అదే తరుణంలో ప్రభుత్వం నుంచి కూడా ఆలస్యంగా నైనా మంచి ఫలితాలే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అధికారులు దిగిరాక తప్పడం లేదు. ఇళ్లస్థలాల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. స్థలాలు ఇచ్చిన చోట పట్టాలు ఇవ్వక పోవడం, పట్టాలు ఇచ్చిన చోట స్థలాలు చూపక పోవడం వంటివి రాష్ట్రంలో పలు చోట్ల బయట పడుతున్నాయి. పెండింగు పడిన ఇందిరమ్మ బిల్లులు ఇవ్వడానికి అధికారులు ముందుకు వస్తున్నారు. అదే విధంగా ఇళ్లస్థలాలు చూపుతున్నారు. పించన్లు, రేషన్‌కార్డుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రోడ్లు, డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి కూడా అధికారులు హామీ ఇస్తున్నారు. సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షల మాదిరిగానే ఇతర పార్టీలు, వాటి ప్రజాసంఘాలు కలిసొస్తే పేదల సమస్యలు ఎక్కువగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సిపిఎం దాని అనుబంధ సంఘాలు మాత్రమే ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎట్లాగు అధికార పార్టీ కాబట్టి ప్రజల తరుపున పోరాటాలు చేయడానికి ముందుకు రాలేదంటే అర్థం ఉంది. కాని ప్రధాన ప్రతిపక్షం టిడిపి , బిజెపి , ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్, ఇతర రాజకీయ పార్టీలన్నీ ముందుకు వచ్చి ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కార మయ్యే అవకాశం ఉంది. కాని వాటికి చిత్తశుద్ధి లేదనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేస్తామని ముందుకొస్తాయి. కాని నిజాయితీగా ప్రజల తరుపున పని చేయడానికి వెనుకాడుతున్నాయి. రాజకీయ ప్రజయోజనం ఉందనుకున్నచోట మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ధోరణి నుంచి బయట పడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి