మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన అక్టోబర్ 14న భేటి అయిన రాష్ట్ర మంత్రిమండలి చర్యలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది. ఈ పరిస్థితి రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంతమంది చచ్చే వారు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సంస్థలను నియంత్రించేందుకు 'మైక్రో ఫైనాన్స్ సంస్థల నియంత్రణ ఆర్డినెన్స్'ను మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. మైక్రో సంస్థలు రుణం తీసుకున్న సభ్యులను వేధింపులకు గురిచేస్తే మూడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానాను విధించే అవకాశముంది. మైక్రో వేధింపుల కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. వేధింపుల నివారణ చట్టాన్ని పటిష్టపర్చేందుకు చర్యలు చేపడుతారు. వడ్డీ గురించి చివరి నిమిషంలో ఆర్డినెన్స్ నుంచి తొలగించినట్లు తెలిసింది. దీనిపై కొంతమంది మంత్రులు సూచించినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయం కానందున తొలగించింది. మైక్రో సంస్థలు ఎంత వడ్డీ వసూలు చేసినా ఆర్డినెన్స్ పట్టించుకోదు. వడ్డీల నియంత్రణపై ఆర్డినెన్స్‌కు అధికారం లేదంటున్నారు. వసూళ్ల సమయంలో సంస్థలు పెట్టే ఇబ్బందులపై బాధితులు ఫిర్యాదు చేసిన పక్షంలో అధికారులు చర్యలు తీసుకోవడానికి ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది. మైక్రోఫైనాన్స్ సంస్థలు జిల్లా స్థాయిలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిబంధన విధించారు. అంతేకాకుండా అయా సంస్థలు రిజిస్ట్రేషన్ పొందాయా లేదా అనే అంశాన్ని డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్లు పరిశీలించాలని సూచించింది. సంఘాలకు రుణాలు ఇచ్చేముందు ఎంత వడ్డీని నిర్ణయిస్తారో సభ్యులకు సమాచారమివ్వాలని నిర్ణయించింది. అధిక వడ్డీని నియంత్రించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేయాల్సిన అవసరం ఉంది. మంత్రి మండలిలో చర్చించిన అంశాలను గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి వట్టి వసంతకుమార్ విలేకరులకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రోసంస్థల ఆగడాల గురించి గత కొంత కాలంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వస్తోన్నాయని చెప్పారు. ఈఅంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, మహిళాసంఘాలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించామని చెప్పారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరిధిలోనే సంస్థలు వడ్డీ వ్యాపారం చేస్తోన్నాయి, కానీ అధిక వడ్డీతో
మహిళాసంఘాలను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. అప్పుల నియంత్రణ చట్టం సత్వరం అమలు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో మైక్రోఫైనాన్స్ సంస్థల నుంచి అధిక వడ్డీతో రుణాలు తీసుకున్న సభ్యుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. అధిక వడ్డీని సబ్సిడి పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అధిక వడ్డీ బాధల నుంచి బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాని ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలు తీరును చూస్తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అరికట్టే అవకాశం తక్కువగానే ఉంది. అయినా చూద్దాం తొందరెందుకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి