6, నవంబర్ 2010, శనివారం

దేశాన్ని కొల్లగొట్టడానికే ఒబామా పర్యటన



వ్యాపారంతో భారత దేశాన్ని ఎలా కొల్లగొట్లాలో పూర్తిపథకంతో వచ్చినట్లు ఒబామా ముంబరులో చేసిన తొలిరోజు ప్రసంగం అర్థమవుతుంది. గతంలో ఈస్టిండియా కంపెనీ పేరుతో మొదట వ్యాపారం పేరుతోనే ఇండియాకు వచ్చి 200 ఏళ్లు దేశాన్ని పట్టిపీడించిన ఆంగ్లేయుల మోసాన్ని మనపాలకులు మరిచిపోయారా? లేక అమెరికా మోసపూరిత ఒప్పందాలను అర్థం చేసుకోవడం లేదా? లేక మాట ఇచ్చాం కాబట్టి ప్రజలేమయినా పరవాలేదు. అనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. భారత్‌ తమకు భవిష్యత్‌ మార్కెట్‌ అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అంటున్నారు. ఇక్కడ సుంకాలు, ఇతర అడ్డంకులను తొలగిస్తే పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ దేశంలో 50 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు వీలుగా భారత్‌ను 44 వేల కోట్ల డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాలలో ఇరికించారు. ఈ మేరకు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఒబామా ప్రకటించారు. శనివారం ముంబరులో జరిగిన భారత్‌ -అమెరికా వాణిజ్య మండలి (యుఎస్‌ఐబిసి) ఏర్పాటు చేసిన కార్పొరేట్‌ దిగ్గజాల సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ దేశంతో వాణిజ్యంలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న భారత్‌ను అగ్రస్థానానికి చేర్చడమే తన ప్రస్తుత పర్యటన లక్ష్యమన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం 21వ శతాబ్దంలో భాగస్వామ్యాన్ని నిర్వచించే ఒప్పందాలలో ఒకటిగా మిగిలిపోతుందని తాను భావిస్తున్నానన్నారు. తన పర్యటనలో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు, బోయింగ్‌ సంస్థ కొన్ని డజన్ల విమానాలను, జనరల్‌ ఎలక్ట్రిక్‌ (జిఇ) సంస్థ వందల కొద్ది విద్యుత్‌ ఇంజన్లను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భారత్‌తో తాము కుదుర్చుకోబోయే మొత్తం 44 వేల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాల ద్వారా తమ దేశంలో 50 వేల ఉద్యోగావకాశాలు కల్పించగలమన్నారు. వాణిజ్య మండలి భేటీలో ఒబామా ప్రసంగానికి ముందు రిలయన్స్‌ పవర్‌ సంస్థ తాము జిఇ సంస్థ నుంచి 2,400 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లను, స్పైస్‌ జెట్‌ సంస్థ తాము బోయింగ్‌ సంస్థ నుంచి 33 కొత్త తరం 737 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రకటనలను అభినందించిన ఒబామా ఎగుమతి నిబంధనలను సడలించడం ద్వారా డిఆర్‌డిఒ, ఇస్రో వంటి భారత సంస్థలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తామన్నారు. ఇందులో ఎంత మోసముందో అర్థం చేసుకోకపోతే దేశం మరింత అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు బారాక్‌ ఒబామా పర్యటనతో మన దేశానికి తీరని నష్టం కలుగనుంది. ప్రపంచ పోలీసుగా పెత్తనం సాగిస్తున్న అమెరికా భారత్‌ పర్యటన ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనే లక్ష్యంతో ఆ దేశ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చారు. ఒబామా మూడున్నర రోజుల పర్యటించనున్నారు. ఒబామా పర్యటన ఆంతర్యాన్ని తెలుసుకున్న వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాకు అన్ని విధాలుగా మేలు చేసే ఒప్పందాలను చేసుకునే ఎత్తుగడతో ఒబామా పర్యటన సాగుతోంది. రాజకీయ రాజధాని ఢిల్లీకి కాకుండా వాణిజ్య రాజధాని ముంబయిలో అడుగు పెట్టడంతోనే ఆయన పర్యటనలోని అసలు ఉద్దేశ్యం అర్థం చేసుకోవచ్చు.. రక్షణ, విద్య, వ్యవసాయ, ఆర్థిక తదితర రంగాల్లో పలు ఒప్పందాలను చేసుకునే ముఖ్య ఉద్దేశ్యంతో పర్యటనకు వచ్చారు. 120 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయిస్తున్నారు. ఆయన వెంట దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన రెండొందల మంది సీఈఓలు సైతం ఉన్నారు. ఇటీవల పాకిస్థాన్‌కు ఆర్థికసాయం చేసిన అమెరికా ఆ వెంటనే భారత్‌లో పర్యటించడంలో ఆంతర్యం ఏమిటి.. మన దేశ పాలకులు కూడా అమెరికాకు మోకరిల్లే విధానాలను అనుసరించడం శోచనీయం. అమెరికా మొదటి నుండీ ' మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్‌ ? మా ఇంటికొస్తే ఏం తెస్తావ్‌ ? ' అనే పద్ధతిని అనుసరిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ పచ్చగుంటే అక్కడికి వెళ్లి వారి సంపదను కొల్లగొట్టే విధానాలను అమెరికా అనుసరిస్తోంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ లాంటి వారు అమెరికా విధానాలకు వత్తాసు పలకడం దురదృష్టకరం.

కామెంట్‌లు లేవు: