28, డిసెంబర్ 2010, మంగళవారం

రచ్చకెక్కిన కాగ్రెస్‌ 'అనంత' గ్రూపు రాజకీయాలు

కాంగ్రెస్‌ పార్టీలో అనంతపురం జిల్లా గ్రూపు రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటకు దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో కొట్టుకున్నారు. ఫర్నీచరు ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 125వ వ్యవస్థాపక దినోత్సవం గ్రూపు తగాదాలకు వేదికగా మారింది. చాలా కాలంగా జిల్లాలో మాజీ మంత్రి జెసి.దివాకర్‌రెడ్డి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్‌ మధ్య పొసగడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆధిక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులిద్దరూ ఏనాడైనా జగన్‌ వైపు వెళ్లేవారేననీ, తానొక్కడినే కాంగ్రెస్‌లో మిగులుతాననీ జెసి.దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటి నుండీ ఇరు గ్రూపుల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశానికి రెండు గ్రూపులకు చెందిన వారు హాజరయ్యారు. ప్రారంభం నుంచే రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జెసి హాజరవలేదు. ఆయన సోదరుడు జెసి.ప్రభాకర్‌రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. మంత్రులు రఘువీరారెడ్డి, డాక్టర్‌ శైలజనాథ్‌ పార్టీ పతకావిష్కరణ అనంతరం జాతీయగీతం ఆలపిస్తుండగానే జెసి అనుచరులు, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇరు గ్రూపులవారు కార్యాలయంలోని ఫర్నీచరు ధ్వంసం చేశారు. పరస్పర దాడుల్లో ఓ పత్రికా ఫొటోగ్రాఫర్‌ తలకు గాయమైంది. ఇంత జరుగుతున్నా మంత్రులిద్దరూ ప్రేక్షకపాత్ర వహించారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు. గొడవ చేస్తున్న వారిని బయటకు పంపించారు. అనంతరం జెసి.ప్రభాకర్‌రెడ్డి కలుగజేసుకుని సమావేశం కొనసాగించాలని మంత్రులను కోరారు. శైలజనాథ్‌ ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్‌ఆర్‌ పేరును ప్రస్తావించకుండా ప్రసంగం కొనసాగించడం పట్ల జగన్‌ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి దయతో గెలుపొంది మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు ఆయన్ను విస్మరించడం ఏమిటని నిలదీశారు. జై కాంగ్రెస్‌... జైజై కాంగ్రెస్‌.. అంటూ మంత్రి శైలజ నాథ్‌ ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ మనలో మనం పోట్లాడుకోవడం ద్వారా ఫలితం లేదన్నారు. ప్రతిపక్షపార్టీలు దీన్ని అవకాశంగా తీసుకుని బలపడేందుకు ప్రయత్నిస్తాయని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే పరస్పరం కూర్చొని చర్చిం చుకుందామని తెలిపారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఖాసీం ఖాన్‌ ప్రసంగిస్తున్న సమయంలో బయట అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి బొమ్మ ఉన్న ప్లెక్సీని కొందరు చింపారు. దాంతో మళ్లీ గొడవ మొదలైంది. కాంగ్రెస్‌ కార్యాలయం పక్కనేవున్న దివాకర్‌రెడ్డి గ్యారేజీలో ఉన్న బస్సులపై గురునాథరెడ్డి అనుచరులు రాళ్లురువ్వారు. పరస్పరం దాడులకు దిగడంతో సమావేశం మళ్లీ గందరగోళానికి దారితీసింది. ఈ దాడుల్లో డిఎస్పీ హర్షవర్ధన్‌రాజు భుజానికి గాయమైంది. మంత్రులు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి అక్కడి నుంచి జారుకున్నారు.

1 కామెంట్‌:

మైలవరం చెప్పారు...

జగన్ వర్సెస్ కాంగ్రెస్ కొట్లటా లేక కాంగ్రెస్ లోపలి కొట్లటా