ఉద్యమస్ఫూర్తితో ఉత్సాహభరిత వాతావరణంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కర్నూలులో కదం తొక్కారు. యుటిఎఫ్ 12వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని సోమవారం కర్నూలు ఎస్‌టిబిసి కళాశాల నుంచి ఉపాధ్యాయులు మహాప్రదర్శన నిర్వహించారు. 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉన్న సూర్యతాపం ఉపాధ్యాయుల ఉద్యమ స్ఫూర్తి, ఉత్సాహంతో పోటీ పడలేదు. ప్రదర్శనలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ చైర్మన్ చుక్క రామయ్య, ఎమ్మెల్సీలు గేయానంద్, ఎంవిఎస్ శర్మ, వి బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యుటిఎఫ్ సీనియర్ నాయకులు రామిరెడ్డి, అధ్యక్షప్రధానకార్యదర్శులు నారాయణ, ఐ వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు సుభాష్‌చంద్రబోస్, సహాధ్యక్షులు బాబిరెడ్డి, రాష్ట్ర నాయకులు అగ్రభాగాన నడిచారు. వివిధ జిల్లాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులను కేటాయించాలని, ఉపాధ్యాయుల అప్రెంటీస్ విధానం రద్దు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కూడా పెంచాలని ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, విద్యారంగాన్ని పటిష్టం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. భగత్‌సింగ్, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు, లెనిన్ వేషాధారణలు అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు యుటిఎఫ్ జెండాలను పట్టుకొని ఒక్కసారిగా వేలాది మంది తరలివెళ్తుండటంతో కర్నూలు నగరం ఎర్రకావురు వేసింది. గురువయ్యల డ్రమ్ములు, ప్రజానాట్య మండలి కళాకారుల డప్పుల ప్రదర్శన కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రదర్శన ఎస్‌టిబిసి నుంచి ఆర్‌ఎస్ రోడ్డు, మౌర్యాయిన్, రాజ్‌విహార్ సెంటర్ మీదుగా పెద్దాసుపత్రి, కలెక్టరేట్ నుంచి మాంటిస్సోరీ పాఠశాల ప్రాంగణం వరకూ సాగింది. ప్రదర్శనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డప్పులు వాయిస్తున్నప్పుడు ఉపాధ్యాయులు, నాయకులు నాట్యం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన యుటిఎఫ్ నాయకులు బ్యానర్లు కట్టుకొని ప్రదర్శన చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి