-పని చేసే చోట మహిళాటీచర్లకు మౌలిక సదుపాయాలు కరువు
-లైంగిక వేధింపుల అదుపునకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
- యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి
'' ఆర్థిక అసమానతలు , ప్రభుత్వ వైఫల్యం కారణంగా బాలికలు విద్యలో వెనుకబడుతున్నారు. మహిళా ఉపాధ్యాయులకు 63 శాతం ప్రభత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 600 నుంచి 800 మంది బాలికలు ఉండే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు , విద్యార్థినులకు సరయిన సౌకర్యాలు లేక పోవడం విడ్గూరం. మొత్తం టీచర్లలో 44 శాతం మహిళా టీచర్లు మాత్రమే ఉన్నారు. పని చేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయక పోవడం వల్ల మహిళా ఉపాధ్యాయులపై లైంగికవేధింపులను అదుపు చేయలేక పోతున్నారు. బాలికల విద్యాభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై అదేవిధంగా మహిళా టీచర్లపై లైంగిక వేధింపులు, మౌలిక సదుపాయాలపై మహాసభల్లో తీర్మానాలు ప్రవేశ పెడుతాం ''అని కర్నూలులో జరుగుతున్న యుటిఎఫ్ రాష్ట్ర మహాసభలకు హాజరయిన రాష్ట్ర కార్యదర్శి కె విజయగౌరి ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
బాలికలు విద్యలో వెనుక బడటానికి గల కారణాలేమిటి?
విజయ గౌరి: ప్రభత్వం విద్యను ప్రయివేటు పరం చేయాలనుకోవడం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం. బాలికల్లో అక్షరాస్యత పెరగపోవడానికి పేదరిక కూడా ఒక కారణం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల బాలికలు చదువులకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. 2011 లెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత 59 శాతం మాత్రమే ఉంది. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న బాలికల్లో కేవలం 68 శాతం మాత్రమే ఉంది. అన్నింటికీ మించి ఆర్థిక అసమానతలు కూడా బాలికలు చదువుకోక పోవడానికి కారణమవుతున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. 600 నుంచి 800 మంది బాలికలు ఉండే ఉన్నత పాఠశాలల్లో మహిళా టీచర్లకు మరుగుదొడ్లు లేకపోవడం విచారకరం. కిలో మీటరు దూరంలో ఉండే పాఠశాలలను మూసేయడం వల్ల దూరం వెళ్లి చదవలేక ట్రాపవుట్లు అవుతున్న వారిలో ఎక్కువగా బాలికలు ఉంటున్నారు.
పని చేసే చోట మహిళా టీచర్లకు సదుపాయాలు ఎలా ఉన్నాయి?
విజయ గౌరి: పని చేసే చోట మహిళా టీచర్లకు మౌలిక సదుపాయాలు లేవు. మరుగుదొడ్లు, 60 శాతం ఉన్నత పాఠశాలల్లో విశ్రాంతి గదులు లేవు. మొత్తం టీచర్లలో మహిళలు 44 శాతం మాత్రమే ఉన్నారు. వారు స్వేచ్చగా పని చేసే పరిస్థితులులేవు లైంగిక వేదింపులకు గురవుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదు. వేధింపులను అరికట్టడానికి రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు వేయాలని ప్రభుత్వానికి సూచించి ఏడు సంవత్సరాలు దాటినా అతిగతీ లేదు. ఈ మధ్య కాలంలో అదిలాబాద్, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, జిల్లాలోడ్యూటీలో ముగ్గురు మహిళా టీచర్లను వికృత రూపంలో హత్య చేశారు. అకృత్యాలకు పాల్పడే వారి విచ్చల విడి తనానికి ఈ మూడు హత్యలే నిదర్శనం. విశాలమైన విద్యారంగంలో ఉద్యోగ భద్రత, రక్షణ కల్పించడంలో ప్రభుత్వం గోరంగా విఫలమైంది.
బాలికల విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు అవసరం?
విజయ గౌరి: ఆర్థిక అసమానతలు తొలగించాలి. పేదలకు 360 రోజులు పని కల్పించాలి. పని చేసే హక్కును గ్యారంటీ చేయాలి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలి. బాలికల విద్యకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నబ్జల్ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. బాలికల కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి. చదువుకు అవసరమైన యూనిఫాం, పుస్తకాలు, అల్పాహారం వంటి సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసుకు ఒక టీచర్ ఉండేలా చూడాలి. రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయులను తగ్గించే పద్దతికి స్వస్తి పలకాలి.
బాలికల విద్య, మహిళా టీచర్ల సమస్యలపై యుటిఎఫ్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది?.
విజయ గౌరి: బాలికల విద్యను పెంపొందించడానికి ,మహిళా టీచర్లరక్షణ కోసం ఆందోళన ఉధృతం చేస్తాం. కర్నూలు మహాసభల్లో ప్రత్యేక తీర్మానాలు చేయనున్నాం. ఈ సభల ముగింపుకు హాజరయ్యే కేంద్ర మంత్రి పురంధేశ్వరి దృష్టికి అన్ని సమస్యలను తెస్తాం. సుప్రీం కోర్టు తీర్పు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. అంతే కాకుండా సామాజిక చైతన్యం లేక పోవడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందరిలో సామాజిక చైతన్యాన్ని కల్పించేలా యుటిఎఫ్ తరుపున ప్రయత్నిస్తాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి