ప్రజలను కష్టాలనుంచి గట్టెక్కిస్తాయా?
ప్రజలపై భారాలు తగ్గుతాయా?
ప్రజల పక్షాన చట్టసభల్లో పోరాడేదెవరు?
వామపక్షాలకు ఎదురు గాలి ఎందుకు వీచింది?
దేశంలో వామపక్షాల ప్రాధాన్యత తగ్గిందా?
2011 లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వామపక్షపార్టీలకు ప్రధానంగా సిపిఎంకు ఎదురుగాలి వీచింది. ప్రజలు మార్పును కోరుకున్నారు. అంతేకాకుండా దేశంలో పెట్టుబడిదారులు కమ్యూనిస్టులను బలహీన పరచాలనే ప్రయత్నం కొంత ఫలించింది. ఈ ఫలితంగా దేశంలో వున్న ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులకు మరో ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు తోడయ్యారు. ఢిల్లీనుంచి శీలాదీక్షిత్, ఉత్తర ప్రదేశ్‌నుంచి మాయావతి, తమిళనాడు నుంచి జయలలిత, కొత్తగా పశ్చిమబెంగాల్‌నుంచి మమతాబెనర్జి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇదొక కోణం. మరోకోణం పరిశీలిస్తే.... ప్రజలను కష్టాలనుంచి గట్టెక్కిస్తాయా? ప్రజలపై భారాలు తగ్గుతాయా? ....ప్రజల పక్షాన చట్టసభల్లో పోరాడేదెవరు?......వామపక్షాలకు ఎదురు గాలి ఎందుకు వీచింది?..వీటన్నింటికీ సమాధానాలు వెతకాలి.... పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశంలో వామపక్ష రాజకీయాల ప్రాధాన్యత తగ్గలేదని గుర్తించాలి. రానున్న రోజుల్లో ప్రజల హక్కులపై జరిగే దాడిని ఎదుర్కొనే క్రమంలో వామపక్షాల ప్రాధాన్యత మరింత పెరుగనుంది. దేశ రాజకీయాల్లో వామపక్షాల స్థానాన్ని ఏ పార్టీ, శక్తి పూడ్చలేదనే చెప్పక తప్పదు. బెంగాల్, కేరళ ఫలితాలు దేశవ్యాప్తంగా వామపక్ష అభిమానులను నిరుత్సాహానికి గురిచేసింది. కేరళలో ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సారి ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ విజయం అంచుల దాకా వెళ్లి ఓడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి లేదనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం.
ఈ పరిణామాలకు కారణాలెన్నో...!?
బెంగాల్లో వామపక్ష కూటమి అపజయానికి పలు అంతర్గత, బాహ్య కారణాలున్నాయి. 34 సంవత్సరాల తర్వాత బెంగాల్లో వామపక్షాలకు ప్రతికూల ఫలితాలు రావడంపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి... వస్తున్నాయి. ఎరుపు తెల్లబోయిందని...కమ్యూనిస్టుల కంచుకోటకు బీటలు బారాయని.... 34 ఏళ్లపాలనకు తెరపడిందని... కాని ప్రజల పక్షాన పోరాడేదెవరు? ఈ ఫలితాలు ఎందుకలా వచ్చాయి. చట్టసభలో దేశ, రాష్ట్ర ప్రయోజనాలకోసం గట్టిగా పోరాడే వారు లేకపోయిరని మాత్రం విశ్లేసించలేక పోతున్నారు. అయ్యో ప్రజల కష్టాలను అర్థం చేసుకునే కమ్యూనిస్టులు ఓడి పోయారే...అని మాత్రం విశ్లేసించరెందుకు? అంటే పెట్టుబడి దారులకు మీడియా కొమ్ముకాస్తుందనేగా అర్థం. ... ఈ ఓటమిని సిపిఐ(ఎం) వినమ్రంగా అంగీకరించింది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల పూర్వరంగంలో రాజకీయ వ్యవస్థపైనా దాని ప్రభావం తీవ్రంగా పడింది. కార్పొరేట్ తరహా రాజకీయ విలువలు ప్రవేశించాయి. గత పదేళ్లుగా దేశ ఆర్థిక రంగంలో జరిగిన పెనుమార్పులు సంపదను పెద్ద ఎత్తున కేంద్రీకరింపజేశాయి. పెట్టుబడి దారులు ప్రభుత్వాలను నడుపుతున్నచోట ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడేందుకు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తోడ్పడ్డాయి. బెంగాల్లో భూ సంస్కరణలు, కౌలు సంస్కరణలు, పంచాయతీలకు అధికార బదలాయింపు జయప్రదంగా అమలైన కారణంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఎంతో ఉపశమనం లభించింది. అదే సందర్భంలో ఈ క్రమంలో కొత్త వైరుధ్యాలూ పుట్టుకొచ్చాయి. భూస్వామ్య వ్యవస్థ బలహీన పడింది. భూములు పొందిన చిన్న రైతుల సంఖ్యా పెరిగింది. భూమి ఉన్న రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు మధ్య వైరుధ్యం అభివృద్ధి అయ్యింది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించేందుకే వామపక్ష ప్రభుత్వం పారిశ్రామికీకరణపై దృష్టి సారించింది. పరిశ్రమలకూ భూములు అవసరమే. ఈ భూ సేకరణలో ప్రభుత్వం కొత్త సమస్యలు ఎదుర్కొంది. వీటి విశ్వరూపం నందిగ్రామ్, సింగూర్‌లో వెల్లడైంది. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా వచ్చిన కొత్త సమస్యలూ దీనికి తోడయ్యాయి. బ్యూరోక్రటిక్ ధోరణులు ప్రజలకు, పార్టీకి మధ్య గండిని సృష్టించాయి. 2009 ఎన్నికలకు ముందు నుంచే ప్రభుత్వంపై అసంతృప్తి ప్రారంభమైంది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాల అనంతరం స్థానిక అసంతృప్తికి రాజకీయ రూపం వచ్చింది. పలు దిద్దుబాటు చర్యలూ చేపట్టింది. సమయం తగినంతగా లేకపోవడంతో ప్రజలు ఈ మార్పును గుర్తించలేక పోయారు. దీనికి తోడు ఈ కాలంలో పలు రూపాల్లో పార్టీపై తీవ్ర నిర్బంధం మొదలైంది. అంతర్జాతీయ స్థాయిలోనూ వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు తోడయ్యాయి. ఈ ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటూ, పార్టీ ఐక్యతను కాపాడుకుంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు పార్టీ చేసిన ప్రయత్నంలో విజయం సాధించలేక పోయిందని వామపక్ష వాదులు విశ్లేషించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మమతా బెనర్జీ నేతృత్వం లోని కూటమికి పెద్ద ఎత్తున ఓట్లేశారు. మమతా బెనర్జీ వద్ద ఇప్పటి వరకూ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. మార్పు అన్న ఏకైక నినాదంతో ఆమె విజయం సాధించారు. ఈ మార్పు ప్రగతిపథం వైపా, అభివృద్ధి నిరోధకత వైపా అన్నది భవిష్యత్తే తేల్చాలి. దాన్ని బట్టే ఈ ప్రభుత్వ సుస్థిరత ఆధారపడి ఉంటుంది. సీట్లపరంగా దెబ్బతిన్నప్పటికీ ఓట్లపరంగా ఇప్పటికీ బెంగాల్లో వామపక్షాలు ప్రబల శక్తిగానే ఉన్నాయన్నారు. 'ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వామ పక్షాలు 41 శాతం ఓట్లను సాధించాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వామపక్ష రాజకీయాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందనేది మాత్రం గుర్తించాలి. వామపక్షాల ఓటమి ప్రభావం జాతీయ స్థాయిలోనూ ఉంటుంది.ఈ ఎన్నికల్లో వామపక్షాలు తాత్కాలికంగా నష్టపోయాయి. కానీ వామపక్షాల ఓటమితో శ్రామికవర్గం ఇంకా ఎక్కువ నష్టపోయింది. వారి తరపున మాట్లాడే గొంతుక తగ్గుతుంది. ఇప్పటికే అవినీతి, అధిక ధరలు ఒకవైపు ప్రజలను పీడిస్తుండగా, మరోవైపు కార్మికవర్గంపై పెద్దఎత్తున దాడి జరుగుతోంది. రానున్న కాలంలో ప్రపంచబ్యాంకు, అమెరికా ఒత్తిళ్లు మరింతగా పెరుగు తాయి. పాలకులు మరింతగా పేట్రేగిపోయి ప్రజల హక్కులను కాలరాచే ప్రమాదముంది. వీటన్నింటినీ తట్టుకొని దేశం ముందుకు సాగాలంటే వామపక్ష రాజకీయాలు మరింత అవసరాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సొంతపార్టీ పెట్టాడు. కోట్లు ఖర్చుచేసి ఎన్నికల్లో దిగారు. తల్లీకొడుకు ఇద్దరూ ఎమ్మెల్యే, ఎంపీలే రాజీనామా చేశారు. మంచిదే మళ్లీ ఎందుకు పోటీచేశారు. అత్యధిక మెజార్టీతో గెలిచారు. కాని తండ్రి సంపాదించిన డబ్బు, హోదాను అడ్డుపెట్టుకుని గెలిచారు.సానుభూతిని సొమ్ముచేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో దేశంలో ఎలాంటి మార్పురాదని గుర్తించాలి. నేను గెలిచానహో...అని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఒక మార్పు మాత్రం జరిగింది. సాంప్రదాయ కాంగ్రెస్ ఓటును మాత్రం బద్దలు కొట్టారని మాత్రం చెప్పవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి