అవినీతిని కప్పిపుచ్చుకోవడానికా..?
ధరల భారం మరిచిపోవడానికా..?
ధరల భారం మరిచిపోవడానికా..?
తెలంగాణా ఉద్యమాన్ని అవమాన పరచడం లేదనుకుంటే నాకున్న కొన్ని సందేహాలు చెప్పాలనుకున్నా. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ ఈనాటిది కాదు. అయితే ప్రస్తుతం విస్తరించింది. ఒకప్పుడు ప్రసార, ప్రచార మాధ్యమాలు తక్కువ కాబట్టి ప్రజల్లోకి వెళ్లడానికి సమయం పట్టేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. ప్రజల్లోకి వెంటనే చేరుతుంది. ప్రస్తుతం సిపిఎం మినహా అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. అధికార పార్టీ నాటక మాడుతోంది. కెసిఆర్ దీక్షలకు స్పందించి శ్రీకృష్ణ కమిటీ వేశారు. తెలంగాణా రాష్ట్రం వచ్చేస్తుందనే భ్రమలు కల్పించాయి చిదంబరం వ్యాఖ్యలు. శ్రీకృష్ణకమిటీ నివేదిక వచ్చింది. అందులోని అంశాలన్నీ బహిరంగ పరిచారు. కొన్ని రహాస్యాలన్నారు. చివరికి అవి కూడా బయటకు పొక్కాయి. ఏకాభిప్రాయ సాధన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు. మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర ఇవ్వలేమని స్పష్టం చేయవచ్చు. లేదా పలాన సమయానికి ఇస్తామని అయినా చెప్పవచ్చు. రెండూ చెప్పకుండా అవకాశ వాద ధోరణితో వ్యవహరించడం ఎంతవరకు సమంజసం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిష్ట పడిపోయింది. మంత్రులు కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. జనలోక్‌పాల్ బిల్లు తెస్తామని అన్నారు. అందులో ప్రధాన మంత్రిని చేర్చాలని దీక్షలు మొదలయ్యాయి. ప్రధాన మంత్రిని చేర్చాలో లేదో తేలకముందే ఇంధన ధరలు పెంచారు. ఈ పరిణామాల క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భావించి దీని నుంచి ప్రజల ధృష్టిని మరల్చేందుకు తెలంగాణా రాజీనామాల అస్త్రాలను ప్రయోగించింది అధికార పార్టీ. దీని మర్మాన్ని గ్రహించిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. అధికార పార్టీ వాళ్లతోపాటు మనం కూడా రాజీనామా చేయకపోతే ఎక్కడ ప్రజలకు దూరమవుతామోననే ఆలోచనతో టిడిపి, బిజెపి, సిపిఐ ఇతర ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు గవర్నర్‌కు సమర్పిస్తే రాజ్యాంగ సంక్షోభం ప్రభావం వెంటనే తెలిసేది. స్పీకర్ లేని సమయంలో రాజీనామాలు సమర్పించారు. ఈసారి గొడవలో కొందరి స్వార్థముందని కొన్ని పత్రికలు రాశాయి. స్వార్థముందనేది వాస్తవమే కానీ అధికార పార్టీదే స్వార్థముందనేది మాత్రం రాయలేదు. అబ్బో అధిష్టానం కోపపడినట్లు నటించింది. అందులో కోపం లేదు .... పాడులేదు. తాము వేసుకున్న పథకం బాగా విజయ వంతమయిందనే ఆనందం తప్ప. అయితే తెలంగాణా ఎప్పటికయినా సపరేటు అవుతుందనే చర్చ మాత్రం జనంలో సాగుతోంది. 2014 ఎన్నికల వరకు తేల్చరనేది కూడా అనుకుంటున్నారు. మరి అధికార పార్టీ ఏం చేస్తుందో వేచి చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి