సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు
సమస్త కళల సారాంశం 'మనిషి' అని ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాష్‌రావు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ టిటిడి కళ్యాణ మండపంలో వేకువ కళాసమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కవితాపురస్కారోత్సవాన్ని 2011 జులై 10న ఘనంగా నిర్వహంచారు. ప్రఖ్యాత సాహితీ వేత్తలు శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణ చార్యులు, విద్వాన్‌విశ్వం పేర్లతో మూడు వేదికలుగా ఈ పురస్కారోత్సవాలను నిర్వహించారు. ప్రముఖ అష్టావధాని, డాక్టర్ శావాది ప్రకాష్‌రావు పుట్టపర్తి నారాయణ చార్యుల వేదికకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆశావాది మాట్లాడుతూ కళలకు, సాహిత్యానికి ఎల్లలు లేవన్నారు. వాటి ద్వారా సమాజాన్ని మేల్కొల్పవచ్చునని అన్నారు. అన్నిరంగాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి కళలు, సాహిత్యం ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 13 మంది ప్రముఖ సాహితీవేత్తలు, ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. కేంద్రసాహిత్య అకాడమి అవార్డు గ్రహిత శివారెడ్డి శ్రీశ్రీ వేదికకు, నెలవంక- నెమలీక సంపాదకులు శ్రీరాములు విద్వాన్ విశ్వం వేదికకు అధ్యక్షత వహించారు. ప్రముఖ ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న సీమ సంస్కృతి, సాంప్రదాయాలపై, అనంతకరువుపై పాడిన పాటలు అలరించాయి. బి.కెభవ్య, సుగమ్య, శంకర్లు చేసిన శాస్త్రీయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జూపల్లి ప్రేమ్‌చంద్, ప్రముఖ శ్రీవాద కవయిత్రి శిలలోలిత, కవయిత్రులు లోయాల, డా.ఆశాజ్యోతి, ప్రముఖ కవులు బిక్కికృష్ణ, యాకోబ్, మాలేపల్లిలు పలు అంశాలపై కవితలు వినిపించారు. ఈసందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో వందమందికిపైగా వర్ధమాన కవులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి కవితా పురస్కారోత్సం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలోఎంపికైన కవితలను ఆయా కవితల రచయితలు వినిపించారు. రచయితలకు జ్ఞాపిలకలను, ప్రశంసపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేకువ సంస్థ అధ్యక్షులు జాబిలి జయచంద్ర అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పురస్కార ప్రస్తావకునిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి జయలక్ష్మమ్మ, ఉపసర్పంచి శ్రీరాములు, పలువురు పట్టణ ప్రముఖులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి