కర్నూలు జిల్లాలో అనైతిక రాజకీయాలు మరో సారి అరంగేట్రం చేశాయి. రాజకీయాలు కాదండోరు నీతిమాలిన నాయకులు అని చెప్పాలి. రాజకీయాల్లోకి నీతి మాలిన వారు రావడం వల్ల ఇలాంటివి మామూలు అయిపోయాయి. నవ్విపోదురు కాక నాకేంటి అన్నట్లు రోజుకో పార్టీలో తిరిగే నాయకుల చర్యలు రోత పుట్టిస్తున్నాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మిగనూరుకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టిడిపి సైకిల్ గుర్తుతో గెలిచారు. పార్టీలు పిరాయిస్తారనే ముందుజాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ఎస్వీ మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ముఖ్యమంత్రి పదవి దక్కలేదని కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు నలుగురూ చేరారు. 2011 జులై 18న జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆయన ఓదార్పులో ఆ నలుగురూ కలిశారు. అప్పటికే పలుమార్పు పార్టీలు పిరాయించిన భూమా దంపతులు జగన్‌కు బంధువులు కావడం వల్ల ఆయన వెంటే ఉన్నారు. వారు ముందుగా టిడిపికి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం కాస్త కాంగ్రెస్‌లో కలిసి పోయిన సంగతి తెలిసిందే. దీంతో వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో జతకట్టారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పలువురు నాయకుల అనుచర గణం ఎందరో వైఎస్‌ఆర్ పార్టీలోకి వలస వెళ్తున్నారు. అక్కడ ఎన్నాళ్లుంటారో చూడాలి మరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి