5, నవంబర్ 2012, సోమవారం

సుందరయ్య సందేశం ఆదర్శనీయం

సిపిఎం జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్‌

ఆకట్టుకున్న 'ప్రజాపోరులో పాటలయాత్ర'

                 పీడిత ప్రజల కోసం నిరంతరం పోరాడి మార్క్సిజమే మానవాళికి మనుగడ అని చెప్పిన మహానేత సుందరయ్య జీవితం ఆదర్శనీయమని సిపిఎం మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్‌ అన్నారు. 2012 నవంబర్‌ ఐదున అంబేద్కర్‌ కళాభవన్‌లో సుందరయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో 'ప్రజాపోరులో పాటల యాత్ర'లో సుందరయ్య జీవిత ఘట్టాలను కళాకారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కిల్లెగోపాల్‌ మాట్లాడారు. నేడు రాజకీయం అంటే అవినీతి, అశ్రిత పక్షపాతం, కుంభకోణాలు అని పలువురు విమర్శిస్తున్నారని అన్నారు. సుందరయ్య ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవులకే వన్నె తెచ్చిన మచ్చలేని మహానాయకుడు అని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం పాలక విధానాలకు వ్యతిరేకంగా ముందుండి పోరాడిన ధీరశాలి అని కొనియాడారు. నేడు యువతరం విద్యార్థులు సుందరయ్య పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ప్రజాపోరాటంలో సుందరయ్య ఏనాడూ వెనుకంజ వేయలేదని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న చైతన్య కళలు ఉద్యమానికి ఊతం ఇస్తాయన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఉద్యమాలు చేసి సమసమాజ స్థాపన చేయడమే సుందరయ్యకు నిజమైన నివాళి అని అన్నారు. కళారూపాల్లో సుందరయ్య కళారూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. విప్లవ నేత సుందరయ్యకు పోరుదండాలు అనే గీతం కంటతడి పెట్టించింది. మధ్యమధ్యలో జీవిత విశేషాలు, పోరాట ఘట్టాలను కళారూపాలను కళాకారులు ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు కోత, ఛార్జీల మోతపై కెవ్వు కేక నాటిక నవ్వించడమే కాకుండా ప్రజలను ఆలోచింపజేసింది. శ్రమజీవుల చెమటచుక్కపై నృత్యరూపకం ప్రదర్శించారు. అన్ని వర్గాల ప్రజల జీవనశైలిని చూపించారు. జానపద కళాకారులు సుందరయ్యకు నివాళ్లు అర్పిస్తూ ప్రదర్శించిన 'కదంబం' పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ధరల దెబ్బ నాటిక, వాల్‌మార్ట్‌, షాపింగ్‌మాల్‌ తదితర నాటికలు ప్రభుత్వ విధానాల తీరును ప్రశ్నించేలా ఉన్నాయి. లఘునాటికలు ప్రజలను చైతన్య పరిచాయి. కళారూపాలు ప్రారంభం నుంచి అత్యంత ఉత్తేజితంగా సాగాయి. కళారూపాల బృందం మేనేజర్‌ గాదె సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు జగన్‌, పిఎన్‌ఎం రాష్ట్ర నాయకులు సోమన్న, సాహితీ స్రవంతి కళాకారులు వల్లబాపురం జనార్దన్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యమ్రానికి పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి గోపాల్‌ అధ్యక్షత వ్యవహరించారు..

కామెంట్‌లు లేవు: