7, నవంబర్ 2012, బుధవారం

ఓడిన ఒబామా ప్రత్యర్థి

ఓడిన ఒబామా ప్రత్యర్థి

                         ఒబామా ప్రత్యర్థి ఓటమి పాలయ్యారు. ఒబామాను ఓడించేందుకు రోమ్నీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షునిగా రెండోసారి గెలిచారు. పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగినా ఒపీనియన్‌ పోల్స్‌లో ఫలితాలు కూడా అదే రీతిలో వెలువడినా చివరకు ఒబామానే విజయం వరించింది. మొత్తం 50 రాష్ట్రాలకు గానూ ఇప్పటి వరకు 42 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఒబామాకు 303 ఓట్లు రాగా, రోమ్నీకి 206 ఓట్లు మాత్రమే లభించాయి. మొత్తం 538 ఓట్లకు గానూ 270 మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకున్నవారు అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తారు. 22 రాష్ట్రాల్లో రోమ్నీ, 20 రాష్ట్రాల్లో ఒబామా విజయం సాధించారు. అప్పటికే ఒబామాకు అవసరమైన 270 ఓట్లు వచ్చేశాయి. దాంతో రోమ్నీ తన ఓటమిని అంగీకరిస్తూ ఒబామాను అభినందించారు. ప్రస్తుతం దేశం ముందున్న సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొనగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన విజయం ఖాయమని తెలిసిన వెంటనే ఒబామా ట్విట్టర్‌లో తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ విజయం అమెరికా ప్రజలందరిదీనూ అని ఆయన వ్యాఖ్యానించారు. మున్ముందు అమెరికాకు మంచి రోజులున్నాయని, రాబోయే కాలంలో అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే డెమొక్రాట్లు ఆనందంతో వీధుల్లోకొచ్చి సంబరాలు జరుపుకున్నారు. చికాగోలో ఒబామా తన భార్య మిషెల్‌, కుమార్తెలు సాషా, మలియాలతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమెరికా ప్రజల కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజల కోసం పాటు పడతామని అన్నారు. మన ముందున్న పయనం చాలా సుదీర్ఘమైనది, కఠినమైనది. ఈ పరిస్థితుల్లో సొంతంగా శక్తి సామర్ధ్యాలు పుంజుకుని మన ప్రాభవాన్ని పొందేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. వేలాది మంది మద్దతుదారులు, అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రసంగం సాగింది. అమెరికాకు ఇంకా మంచి రోజులు ముందున్నాయన్నారు. రోమ్నీతో తాను మాట్లాడానని, ఆయన్ని, ఆయన సహచరుడు పాల్‌ రాన్‌ను అభినందించానని చెపుతూ త్వరలోనే వారితో కలిసి కూచుని ముందుకెలా సాగాలో చర్చిస్తానని చెప్పారు. 'ఎన్నికల ప్రచారం సందర్భంగా మేం భీకరంగా పోరాడి వుండవచ్చు, కానీ అది కూడా ఈ దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నందువల్లనే' అని ఒబామా అన్నారు. మన భవిష్యత్‌ పట్ల అత్యంత జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి వుందన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్‌లో తన ప్రత్యర్థికి మద్దతు తెలిపిన వారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ''మీ ఓటు నాకు వచ్చిందో లేదో తెలియదు. కానీ మీరు చెప్పేది నేను వింటాను, మీరందరూ కలిసి నన్ను ఒక మంచి అధ్యక్షుడిగా చేయండి.'' అని అన్నారు. ఇన్ని రోజులుగా ప్రచారంలో పాల్గొని మీ అందరి కష్టసుఖాలు విన్నాను, గతంలో కన్నా కృత నిశ్చయంతో వున్నా, మీ నుండి మరింత స్ఫూర్తి పొందానని చెప్పారు. ఇప్పటివరకు మనం ఎన్ని కష్టాలు అనుభవించినా ఇక మన ముందున్న భవిష్యత్తు సుందరమయంగా చేసుకోగలమని ఆశిస్తున్నానన్నారు. తన విజయం కోసం కృషి చేసిన వారందరికీ ఆయన పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మనమందరం కలిసికట్టుగా మన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ''మన రాజకీయాలు శాసిస్తున్నట్లుగా మనలో విబేధాలు రాకూడదు, మన వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ఈ దేశ ప్రయోజనాలే మనకు మిన్న'' అని అన్నారు. మీ అందరి సహకారంతో ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.

కామెంట్‌లు లేవు: