14, మార్చి 2014, శుక్రవారం

ఆవేశం....ఆత్మవిమర్శ

కాంగ్రెస్‌ను గద్దే దించాలి....దేశాన్ని కాపాడాలి
‘ జనసేన ’ పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌
‘ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, గతుకుల దారి, గుండెల నిండా ధైర్యం’ఉందంటూ బాలగంగాధర్‌తిలక్‌ పద్వంతో జనసేన నేత ప్రముఖ సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాన్ని ప్రారంభించి రెండు గంటలపాటు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. సాయంత్రం ఏడు గంటల ఏడు నిమిషాలకు పవన్‌కళ్యాణ్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  ‘అందరికీ హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దౌర్జన్యాన్ని, అవినీతిని అరికట్టడానికి ముందుకు సాగుతాన్నా పిరికితనంతో నీ బాంచెన్‌ కాల్మోక్తా అనే పిరికిపందను కాదు, ఢల్లీిలో ఉన్నవారిని కాల్మొక్తా అంటూ  మన రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తెచ్చారు’ అని పవన్‌ కళ్యాణ్‌ ఆవేశంగా చెప్పారు.  2014 మార్చి 14న సాయంత్రం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ హైటెక్స్‌ నోవాటెల్‌లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ   పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.  రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌పార్టీ అనుసరించిన విధానాన్ని  తూర్పారపట్టారు.  అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేశానని, అన్నయ్య పార్టికీ ఎదురుగా నిలబడాల్సి రావడం దురదృష్టకరమని, తండ్రి లాంటి అన్నయ్యను తాను ఎదిరించలేనని, అలాంటి పరిస్థితిని ఢల్లీిలో కాంగ్రెసువాళ్లు కల్పించారని ఆయన అన్నారు. గొప్పగా బతకాలంటే సాహసాలు చేయాల్సి వస్తుందని అన్నారు. తాను బానిసను కాదని ఆయన చెప్పారు. ఐదేళ్ల క్రితం గుంటూరులో రాజకీయాలు మాట్లాడానని, ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితి మీద గానీ, రాజకీయాల గురించి గానీ మాట్లాడలేదని అన్నారు. రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని, ఎంపీగా గెలవాలని లేదు, మంత్రినీ ముఖ్యమంత్రిని కావాలని లేదని, అవన్నీ తనకు తుచ్ఛమని వ్యాఖ్యానించారు. నా తెలంగాణ, మన తెలంగాణ, పోరు తెలంగాణ అని గట్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పరిస్థితిని చూసి బాధపడ్డానని అన్నారు.  తాను అందరిలాగా బతకాలని అనుకున్నానని, కానీ సమస్యలు తన వద్దకే వచ్చాయని తనకు ఎదురైన సమస్యలు ఈ సందర్భంగా వివరించారు. రాజకీయాల గురించి మాట్లాడుతానని  2014 మార్చి రెండున ప్రకటన చేసిన నాటినుండి తనపై నోటికి వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గద్దెదింపాలని, దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్‌ హఠావో ... దేశ్‌ బచావో’ అని నినదించారు. సభకు హాజరైన అభిమానుల చేత ఆ నినాదం  పదేపదే చేయించారు. ‘ మిస్టర్‌ జైరామ్‌రమేష్‌, అహ్మద్‌ పటేల్‌, చిదంబరం, వీరప్ప మెయిలీ...మీరు రాష్ట్రాన్ని విభజించిన తీరు మమ్మల్ని గాయపరిచింది. మేం నెత్తురోడుతున్నాం. తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్మారు. మీకు అధికారం అప్పగించారు. మీరు మాకు వెన్నుపోటు పొడిచారు. అందుకే నేను దేశ వ్యాప్తంగా ప్రజలందరికి పిలుపునిస్తున్నా ...’ అని అన్న ఆయన ఆ వెంటనే  కాంగ్రెస్‌ హఠావో...దేశ్‌ బచావో అంటూ పెద్దగా నినాదం చేశారు. కార్యకర్తల చేత చేయించారు. అంతకుముందు ఆయన వేలాది మంది అభిమానుల సమక్షంలో పార్టీ పేరును ప్రకటించారు. ‘పార్టీ పెట్టాను.  దాని  పేరు జనసేన’ అని ఆయన హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తన  పార్టీ సామాన్యుల సేన అని అన్నారు. భారతీయుల సేవకోసమే పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌, జైరాంరమేష్‌ వంటి తదితర నేతలపై నిప్పులు చెరిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కెసిఆర్‌, కేటిఆర్‌, కవిత, వి.హనుమంతరావు, వెంకయ్యనాయుడులకు చురకలంటించారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే అందరి వ్యక్తిగత జీవితాలను బయటపెడతానని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై ఆయన నేరుగా విమర్శలు చేశారు. చట్టం కొంతమందికి చుట్టం గాకుండా ఎవరికైనా సమానంగా పనిచేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. జగన్‌పై విమర్శలు చేయకపోయినా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ మినహా అన్ని పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అన్నయ్య చిరంజీవిపై కోపం లేదని, ఆయనకు వ్యతిరేకంగా నిలబడడానికి కాంగ్రెస్‌పార్టీనే కారణమని అన్నారు. కాంగ్రెస్‌ హఠావో.. దేశ్‌ బచావో అన్నరీతిలో పనిచేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా టిడిపిని గానీ, ఆ పార్టీ నేతలను గానీ ఒక్క విమర్శ చేయలేదు. తనకు నచ్చిన నేతల్లో జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) ఒకరని మెచ్చుకున్నారు.  
టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విసుర్లు, సెటైర్లు
      జనసేన అనే తన పార్టీని కాంగ్రెస్‌పార్టీలో కలపాలని దిగ్విజయ్‌సింగ్‌ చెప్పడంపై పవన్‌ మండిపడ్డారు. దిగ్విజయ్‌ సింగ్‌ను ఆయన ఢల్లీి పవిత్రాత్మగా అభివర్ణించారు. కాంగ్రెస్‌పార్టీలో కలపడానికి అది ఏమైనా గంగానదా అని ఎద్దేవా చేశారు. తాను ఎలా కనిపిస్తున్నానని దిగ్విజయ్‌ను ప్రశ్నించారు.  కెసిఆర్‌పై కూడా ఆయన దుమ్మెత్తి పోశారు. నువ్వు నన్ను చెప్పనీరాదే అని కెసిఆర్‌పై సైటెర్లు వేశారు. క్షమాపణ చెప్పి పార్టీ పెట్టాలని అన్న కల్వకుంట్ల కవితపై ఆయన విరుచుకుపడ్డారు. నా తెలంగాణ గురించి క్షమాపణ చెప్పమనే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తనను తిడితే పైకి వద్దామని అనుకుంటున్నారా అని ఆడిగారు. రెండు నెలల ఎన్నికల ముందు ఇలా వచ్చి భయపడేవాడినైతే నిలబడగలిగేవాడినా అని అడిగారు. పిరికితనమంటే తనకు చిరాకు అని అన్నారు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతానని సవాల్‌ విసిరారు. జనసేన పార్టీ రిజిస్ట్రేషన్‌ అయిపోయిందని ఆయన అన్నారు. రాజకీయాల విషయంలో గుండెల్లో పెట్టుకునే అన్నయ్యను చూసిన తర్వాత ఆగిపోవాలా అనుకున్నానని ఆయన అన్నారు. నాలుగు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలుసుకున్నానని, సమాజం ముఖ్యమా, వ్యక్తిగతం ముఖ్యమా అని ఆలోచించుకున్నానని, అప్పుడు సమాజం ముఖ్యమని అనుకున్నానని ఆయన అన్నారు. సమాజం ముఖ్యమని అనుకున్నప్పుడు కుటుంబం చిన్నదిగా కనిపించిందని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు శత్రువులు లేరని, కోపం కూడా రాదని, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేదని, తనకు మిత్రులు చాలా మంది ఉన్నారని, వారిలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఒకరని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి తాను రావడం త్రివిక్రమ్‌కు ఇష్టం లేదని పవన్‌ చెప్పారు. ప్రజలకు తెలియని మిత్రుడు ూన్నారని, కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను ఆపలేదని, అది ఇప్పుడు జనసేన అయిందని ఆయన అన్నారు. పార్టీ పెట్టడానికి వరంగల్‌కు చెందిన తన మిత్రుడు రాజు రవితేజ కారణమని అన్నారు. సినిమాల మీద ఆసక్తి లేదని, ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని, కొత్త సినిమాలు తీయడం లేదని అన్నారు. ప్రతి పార్టీలోనూ వ్యక్తిగతంగా తనకు తెలిసిన నాయకులున్నారని, సన్నిహితంగా మెలిగేవారున్నారని, కానీ సైద్ధాంతికంగా విభేదిస్తానని, వాళ్ల ఆలోచన సరళికీ తన ఆలోచనా సరళికీ కుదరదని ఆయన అన్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, సీమాంధ్ర ఆత్మగౌరవం దెబ్బ తింటే ఊరుకోనని, తెలుగు ప్రజలను కించపరిస్తే క్షమించబోనని పవన్‌ హెచ్చరించారు. గౌరవంగా తేవాల్సిన తెలంగాణను పార్లమెంటులో ఎలా తెచ్చారో అందరూ చూశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నేత వెంకయ్యనాయుడుపై వ్యాఖ్యలు చేశారు. భగత్‌సింగ్‌ ఆశయాల సాధనకు పనిచేస్తానని అన్నారు. ఆయన జీవితం తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిందని, ఇంకా తిట్టుకోవడం వల్ల పలితం లేదని అన్నారు. ‘నన్నయ్య గొప్పవాడా పాల్కూరికి సోమనాధుడు గొప్పవాడా అని ఇంకా మాట్లాడుకుంటే బంగారు తెలంగాణ రాదు’ అని ఆయన అన్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు  నోవాటెల్‌కు చేరుకున్నారు. మెగా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం స్థాయిలో పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ఆవిర్భావ ప్రకటన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండేసి ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడు గంటల ప్రాంతంలో పవన్‌ కళ్యాణ్‌ వేదిక మీదికి చేరుకున్నారు. తెల్ల ప్యాంట్‌, బూడిద రంగు కుర్తా వేసుకుని ఆయన వేదిక మీదికి చేరుకున్నారు. ఆయనను వేదిక మీద చూడగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇది సామాన్యుడి సేన, ఇది ప్రతి ఒక్కరి సేన, ఇది మనసేన, జనసేన అనే అనే నినాదం తెరపై ఉంది. 

కామెంట్‌లు లేవు: