30, మార్చి 2014, ఆదివారం

తెలుగు సంవత్సరాది ఉగాది


             పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలువులు తదితరాలు మన సంస్కృతిలో భాగం. వీటిలో అన్ని మతపరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించినవి. అందులో వ్యవసాయం, పశుపోషణ వంటివి ముఖ్యమైనవి. కొన్ని మానవుడు ప్రకృతిపై సాధించిన విజయాన్ని కూడా పండుగలుగా జరుపుకుంటారు. కొన్ని పండుగలు పూర్తిగా మత నమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అయితే వాటన్నింటిని విడివిడిగా చూడటం కష్టం. మానవుడు ప్రకృతిపై, ఉత్పత్తులలో సాధించిన విజయాలలో కూడా మతపరమైన నమ్మకాలు ఉండవచ్చు కూడా. పూర్తిగా మతపరమైన కథలలో కూడా పరిశీలిస్తే మానవ సమూహాల అభివృద్ధి చారిత్రక విషయాలు కనిపిస్తుంటాయి. ఏదేమైనా పండుగ ఉత్సవాలను మతం, మూఢనమ్మకాల పేరుతో కొట్టిపారేయరాదు. ఆధ్యాత్మిక విషయాలను భూజాన వేసుకుని మోయరాదు. పండుగలలో ఉగాది వ్యవసాయ ఆధారామైనది. తెలుగువారి కొత్త సంవత్సరం ఆరంభ దినాన్ని ఉగాది అంటున్నాం. చైత్రశుద్ధ పాఢ్యమి నాడు తెలుగు వారికి, కన్నడీగులకు, మరాఠిలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. చంద్రమానాన్ని అనుసరించి వీరికి ఇప్పుడు ఉగాది. సౌరమానాన్ని అనుసరించే తమిళ, మాలయాళ, బెంగాళీ, పంజాబీ, అస్సామీ ప్రజలకు ఉగాది వేరే రోజున వస్తుంది. గుజరాతీలు, మార్వాడీలు బృహస్పతి మానాన్నను అనుసరించి ఉగాది జరుపుకుంటారు. ఉగాదిని కేరళలో ‘విషు’ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది వసంత ఋతువులో వస్తుంది గనుక చెట్టన్నీ కొత్త చిగుళ్లను వేసి కోయిల పాటలతోను, కొత్త పూల పరిమళాలతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. చెరుకు, మామిడి, చింతపండువంటివి చేతికి వస్తాయి. అందువలననే కొత్త చింతపండు, కొత్త బెల్లం, చెరకు, వేపపువ్వు, పచ్చిమిరప, ఉప్పు, అరటిపండు కలిపి షడ్రుచులు గల ఉగాది పచ్చడి చేసుకొని తింటారు. సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆరోజున పంచాంగం చూసి వర్షాలు పరిస్థితి, పంటల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు. పురోహితులు చదివే ఈ పంచాంగాన్ని అందరూ శ్రద్ధగా వింటారు. సంవత్సరం ప్రారంభం గనుక ఆరోజు ఏం జరిగితే సంవత్సరమంతా అదే జరుగుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. గ్రామీణా ప్రాంతాల్లో కుస్తీపోటీలు, బల ప్రదర్శనలు, పరుగు పందెలు, ఎడ్ల బండ్ల పందెలు వంటి వినోద కార్యక్రమాలు జరుగుతాయి. ఉగాది నాడు కవి సమ్మేళనాలు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను ఉగాది రోజున జరుగుతాయి. ఇప్పుడు ఈ సాంప్రదాయం బాగా తగ్గుముఖం పడుతున్నట్లు అనిపిస్తుంది. 
ఉగాది పచ్చడి 
              ఉగాది పచ్చడి అంటే ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అనే ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటి పళ్లు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వినియోగిస్తారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాల్లో  నింబకుసుమ భక్షణం, అశోకళికాప్రాశనం అని వ్యవహరించేవారు. రుతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫి, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందని అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చి మిరపకాయలు, మామిడి చిగుళ్లు, ఆశోక చిగుళ్లు,  వేసి చేసే వాళ్లు. ఈపచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని చెబుతారు. 
గోదావరి ఉగాది పచ్చడి చేసే విధానం
            గోదావరి జిల్లాల్లో చేసే గాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలను పరిశీలిద్దాం. వేపపువ్వు, కప్పుబెల్లం పొడి, కప్పు కొబ్బరి కోరు, కప్పు బాగా మగ్గిన అరటిపండ్లు, మామిడికాయ, చిటికెడు కొత్తకారం, అరస్పూను ఉప్పు, శనగ పప్పు, నిమ్మకాయంత చింతపండు, కొద్దిగా చెరుకు ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు, అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటి పండు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి.  వేపపువ్వు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి. ఇలా తయారు చేసిన పచ్చడికి గోదావరి జిల్లాలో మంచి గుర్తింపు ఉంది.  ‘విజయ నామ’ సంవత్సరానికి వీడ్కోలు పలికి ‘జయ నామ’ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.  అందరికీ జయం చేకూర్చాలని ఆశిద్దాం. 

కామెంట్‌లు లేవు: