5, ఆగస్టు 2019, సోమవారం

28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు..


              జూన్‌ 2, 2014కి ముందు 28గా ఉన్న రాష్ట్రాల సంఖ్య తెలంగాణ ఏర్పాటుతో 29కి చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య మళ్లీ 28కి చేరింది. జమ్ముకశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రాల సంఖ్య తగ్గి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈరోజు రాజ్యసభలో ప్రకటించారు. జమ్ము-కశ్మీర్‌ చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లఢఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు కానున్నాయి. రెండు ప్రాంతాలకు ప్రత్యేక లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉండనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28కి చేరగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది.
            ఇప్పటివరకు కశ్మీర్‌లో 22 జిల్లాలు ఉండేవి. వాటిని జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌ రీజియన్లుగా వ్యవహరించేవారు. కాగా, జమ్ములో 10 జిల్లాలు, కశ్మీర్‌లో 10, లద్దాఖ్‌లో రెండు జిల్లాలు ఉండేవి. తాజా కేంద్రం నిర్ణయంతో లెహ్‌, కార్గిల్‌ జిల్లాలతో కూడిన లఢఖ్ రీజియన్‌ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. పది జిల్లాలతో కూడిన కశ్మీర్‌ను మరో పది జిల్లాలతో కూడిన జమ్ముతో కలిపి చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేశారు.
జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లును ఈరోజు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ఆమోదానికి రానుంది. అలాగే వీటితో పాటు అధికరణ 370ని కేంద్ర రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

జమ్ముకశ్మీర్‌ విభజనబిల్లుకు రాజ్యసభ ఆమోదం
 జమ్ముకశ్మీర్‌ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ బిల్లును ఈ రోజు ఉదయం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ జరిగింది. హోంమంత్రి వివరణ అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా.. స్వల్ప సాంకేతిక సమస్య రావడంతో స్లిప్పులతో ఓటింగ్‌ చేపట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదావేశారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది.

కామెంట్‌లు లేవు: