7, ఆగస్టు 2019, బుధవారం

సుష్మాస్వరాజ్‌ ‘ప్రస్థానం’


         సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా.. కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు సుష్మా స్వరాజ్‌. భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం సంపాదించారు‌. విద్యార్థి నాయకురాలి నుంచి కేంద్ర మంత్రిగా ఆమె ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. భాజపాలో చేరి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన మహిళా నాయకురాలామె. విదేశాంగమంత్రిగా ఎంతో మంది భారతీయులకు ఆపన్నహస్తం అందించారు. భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఆమె స్వయంగా సహాయం చేసిన సందర్భాలెన్నో. 67ఏళ్ల సుష్మా06-08-2019  మంగళవారం రాత్రి గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సుష్మాస్వరాజ్‌ గురించి..
బాల్యం, విద్యాభ్యాసం
సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.
సుష్మా రాజకీయ జీవితం

1977లో జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభకు ఎన్నికయ్యారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రిగా పనిచేశారు. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు. 
జాతీయ రాజకీయాలు
1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అంతకుముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు. 1996లో దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో 12వ లోక్‌సభకు మళ్లీ  రెండో సారి దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయీ రెండో మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖకు మంత్రిగా పనిచేశారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. 
దిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా
దిల్లీ శాసనసభ ఎన్నికల్లో  విజయం సాధించడానికి 1998 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం సుష్మాస్వరాజ్‌ను రంగంలో దింపింది. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో సుష్మా దిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. దిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 
బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ
1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. సోనియాగాంధీపై పోటీకి భారతీయ జనతా పార్టీ తరఫున సుష్మాస్వరాజ్‌ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ ఓడిపోయినప్పటికీ.. సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
‘ఆపన్న’ సుష్మ
కేంద్ర మాజీ మంత్రి సుష్మా సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఆపదలో ఉన్నామని ట్విటర్‌ వేదికగా ఆమెను ఆశ్రయించిన వారిని ఆపన్న హస్తం అందించేవారు. అందుకే ఆమెను అభిమానులు ‘ట్విటర్‌ క్వీన్‌’ అని ముద్దుగా పిలుచుకునేవారు. ఇరాక్‌లో చిక్కుకున్న ఎంతో మందికి ఆమె స్వయంగా రంగంలోకి దిగి సాయం అందించారు. 
తీజ్‌ వేడుకల్లో
సుష్మా రాజకీయాల్లో నే కాదు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తారు. పలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దిల్లీలో భాజపా మహిళా మోర్చ నిర్వహించిన తీజ్‌ వేడుకల్లో పాల్గొని ఇలా చిన్న పిల్లలా ఉయ్యాలలూగారు.
వ్యక్తిగత జీవితం
       క్రిమినల్‌ న్యాయవాది స్వరాజ్‌ కౌశల్‌ను 1975 జులై 13న సుష్మ వివాహమాడారు. రాజకీయాల్లో రాణించేలా ఆయన సుష్మకు పూర్తి ప్రోత్సాహం అందించారు. 1990-93 మధ్య మిజోరం గవర్నర్‌గా కౌశల్‌ పనిచేశారు. మనదేశంలో అతి పిన్న వయసులో గవర్నర్‌ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. 1998-2004 మధ్య కౌశల్‌ ఎంపీగా కూడా ఉన్నారు. సుష్మ-కౌశల్‌ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు బన్సూరీ కౌశల్‌. బన్సూరీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.
విదేశీ ప్రతినిధులతో
          భారత పర్యటనకు వచ్చిన ఎంతో మంది విదేశీ ప్రతినిధులతో సుష్మా సమావేశమై పలు విషయాలను చర్చించేవారు. 2017 అక్టోబర్‌ 17న భూటాన్‌ రాజు నాలుగురోజుల పర్యటనకు భారత్‌ వచ్చారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికి మాట్లాడారు. భూటాన్‌ రాజకుమారుడితో సుష్మా సరదాగా గడిపారు. హైదరాబాద్‌లో 2017 నవంబర్‌ 28న గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ జరిగింది. ఈ సమ్మిట్‌కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ వచ్చారు. అప్పుడు సుష్మా ఆమెతో కాసేపు సమావేశమయ్యారు.
మానవీయ కోణం
            పాకిస్తాన్‌లో బలవంతపు వివాహం బారిన పడి స్వదేశానికి చేరుకున్న భారత మహిళ ఉజ్మాను పరామర్శిస్తున్న అప్పటి విదేశాంగ మంత్రి  సుష్మా స్వరాజ్‌. భారత్‌కు చెందిన ఉజ్మా మలేషియాలో పరిచయమైన తహీర్‌ అలీని కలిసేందుకు 2018లో పాకిస్థాన్‌ వెళ్లారు. ఆలీ ఆమెను తుపాకీతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యకార్యాలయ అధికారులను ఆశ్రయించింది. దీనిపై ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఉజ్మాను భారత్‌కు పంపించడంతోపాటు, వాఘా సరిహద్దు వరకు రక్షణ కల్పించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది.
          పాకిస్థాన్‌కు చెందిన రంజాన్‌ మహ్మద్‌ బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించాడు. 2009లో మహ్మద్‌ తల్లిదండ్రులు విడిపోయారు. వారు విడిపోయే సమయంలో కుమార్తె తల్లి వద్ద, కుమారుడు తండ్రి వద్ద ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. 2010లో రంజాన్‌తో కలిసి తండ్రి బంగ్లాదేశ్‌కు వచ్చాడు. అక్కడ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ రంజాన్‌ను ఇబ్బందులు పెట్టింది. దీంతో తన తల్లి వద్దకు వెళ్లాలని భావించిన అతనికి స్థానిక వ్యక్తి సలహా మేరకు భోపాల్‌ చేరుకున్నాడు. పోలీసుల తనిఖీలో పట్టుబడి స్వచ్ఛంద సంస్థ ఆశ్రమానికి చేరుకున్నాడు. వారు రంజాన్‌ వివరాలను తెలుసుకుని పాకిస్థాన్‌లోని తల్లిని ఫోన్‌లో సంప్రదించారు. వీసా సమస్యతో బాలుడు పాకిస్థాన్‌ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఎన్‌జీవో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించింది. ఆమె బాలుడిని పాకిస్థాన్‌ పంపించే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

2 కామెంట్‌లు:

sri చెప్పారు...

useful, thanks for the post

panuganti చెప్పారు...

thanks