7, నవంబర్ 2020, శనివారం

మధ్యతరగతి జో ముచ్చటగా మూడోస్సారి..

 అధ్యక్ష పదవికి గతంలోనూ బైడెన్‌ యత్నాలు           1987లో, 2008లో నిలబడేందుకు సిద్ధం         పార్టీలో మద్దతు కూడగట్టలేక ఉపసంహరణ

  • మూడో ప్రయత్నంలో దక్కిన అభ్యర్థిత్వం


జోబైడెన్‌ (77).. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌తో సై అంటే సై అన్నట్టుగా ఢీకొని, గెలుపు దిశగా దూసుకుపోతున్న బలమైన ప్రత్యర్థి. 2016లో హిల్లరీ క్లింటన్‌ ఇచ్చిన పోటీ కంటే బలమైన పోటీతో బెంబేలెత్తించిన బైడెన్‌ను అమెరికా రాజకీయాల్లో ముద్దుగా ‘మిడిల్‌ క్లాస్‌ జో’ అని పిలుచుకుంటారు. బరాక్‌ ఒబామా బృందంలో సభ్యుడిగా, ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి మాత్రమే మనలో చాలా మందికి తెలుసు. కానీ.. జో బైడెన్‌ మూడున్నర దశాబ్దాల కల అధ్యక్ష పదవి. ఈ పదవిని అధిష్ఠించేందుకు ఆయన 1988లో ప్రయత్నించారు. కానీ, పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మళ్లీ 2008లో కూడా ప్రయత్నించారు. అప్పుడూ ఒబామా, హిల్లరీ కరిష్మా ముందు తేలిపోయారు. ముచ్చటగా మూడోసారి.. అంటే ఇప్పుడు మాత్రం డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి నామినేట్‌ కావడంలో విజయం సాధించారు. 1942 నవంబరు 20న.. పెన్సిల్వేనియాలోని స్ర్కాన్‌టన్‌లో బైడెన్‌ జన్మించారు. బైడెన్‌ చిన్నప్పుడే ఆయన కుటుంబం డెలవెర్‌లో స్థిరపడింది. నిజానికి వారిది సంపన్న కుటుంబమేగానీ.. బైడెన్‌ పుట్టే సమయానికి ఆయన తండ్రి తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. దీంతో చాలాకాలంపాటు బైడెన్‌ కుటుంబం పేదరికంలో గడిపింది. తర్వాత కొద్దిగా కోలుకుని మధ్యతరగతి జీవనం గడిపింది. బైడెన్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అధికం. ఈ క్రమంలోనే స్కూల్‌ లీడర్‌గా వ్యవహరించారు. 1965లో చరిత్ర, రాజనీతి శాస్త్రంలో బీఏ చేశారు. బైడెన్‌కు మొదట్లో నత్తి ఉండేది. కానీ, అద్దం ముందు నుంచి కవితలు చదవడం ద్వారా ప్రయత్నపూర్వకంగా దానిపై ఆయన విజయం సాధించారు. 


1966లో ఆయనకు తొలిసారి వివాహమైంది. ఆయన మొదటి భార్య నీలియా హంటర్‌. వారికి ముగ్గురు పిల్లలు. 1968లో బైడెన్‌ న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఒక న్యాయసంస్థలో పనిచేశారు. అప్పట్లో ఆయనకు డెలవేర్‌ గవర్నర్‌ అయిన డెమొక్రాటిక్‌ నాయకుడి విధానాలపై ఆగ్రహం ఉండేది. రిపబ్లికన్‌ అభ్యర్థి భావాలు నచ్చేవి. అయితే, రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి రిచర్డ్‌ నిక్సన్‌ అంటే ఇష్టం ఉండేది కాదు. 1969లో ఆయన.. డెమొక్రాటిక్‌ పార్టీలో చురుగ్గా వ్యవహరించే ఒక వ్యక్తి నిర్వహించే న్యాయసంస్థలో పనిచేశారు. అక్కడ ఉండగానే ఆయన తన భావాలు మార్చుకొని డెమొక్రాట్‌గా తన పేరు నమోదు చేసుకున్నారు. అలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. తొలుత స్థానిక కౌంటీ కౌన్సిల్‌కు ఎన్నికైన బైడెన్‌.. 1972లో జూనియర్‌ సెనెటర్‌గా ఎన్నికయ్యారు. చేతిలో డబ్బుల్లేకపోవడంతో.. ఆయన కుటుంబసభ్యులు ఇంటింటికీ తిరగి కరపత్రాలు పంచి ప్రచారం చేశారు. ఆయన ప్రత్యర్థి భారీగా ప్రచారం చేశారు. అయినా బైడెనే గెలిచారు. దురదృష్టవశాత్తూ ఆ ఏడాది ఆయన భార్య, ఏడాది వయసున్న కుమార్తె ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమారులిద్దరూ ఆస్పత్రిలో ఉండగా.. సెనెట్‌ సభ్యుడుగా బైడెన్‌ ఆస్పత్రిలోనే ప్రమాణ స్వీకారం చేశారు.


1977లో ఆయన జిల్‌ ట్రేసీ జాకబ్స్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె. 30 ఏళ్ల వయసుకే సెనెటర్‌గా ఎన్నికైన బైడెన్‌ చురుగ్గా పనిచేయడంతో టైమ్‌ మేగజైన్‌ 1974లో ఆయన్ను ‘200 ఫేసెస్‌ ఫర్‌ ద ఫ్యూచర్‌’లో ఒకరిగా పేర్కొంది. సెనెటర్‌గా ఆయన వినియోగదారుల హక్కులు, పర్యావరణ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించారు. సెనెట్‌కు సంబంధించిన పలు కమిటీలకు నాయకత్వం వహించారు.రాజకీయంగా ఒక్కొక్క మెట్టే ఎదుగుతూ వచ్చారు. 1988 ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఆశపడినా.. ఆయన ప్రచార బృందం చేసిన కొన్ని తప్పుల వలన, ఆయన గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల అభ్యర్థిత్వం దక్కలేదు. మళ్లీ 2007లో కూడా ప్రయత్నించి 2008 జనవరిలో ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ ఏడాది డెమొక్రాట్‌ అభ్యర్థిగా నామినేట్‌ అయిన ఒబామా.. బైడెన్‌ సమర్థతను గుర్తించి, ఆయనను పిలిచి మరీ ఉపాధ్యక్షుడిగా చేసుకున్నారు. అధ్యక్షుడిగా ఒబామా తీసుకున్న పలు నిర్ణయాల్లో బైడెన్‌ కీలకపాత్ర పోషించారు. 


బైడెన్‌.. హిలాల్‌ ఇ పాకిస్థాన్‌

ప్రచార సమయంలో ట్రంప్‌తో వాగ్యుద్ధం జరుగుతున్నప్పుడు బైడెన్‌ ‘ఇన్షా అల్లా’ అని వ్యాఖ్యానించడంతో ప్రపంచమంతా ఒక్కసారి ఆయన వైపు చూసింది. ట్రంప్‌ పన్నుల చెల్లింపు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆ రికార్డులన్నీ ఎప్పుడు చూపిస్తారంటూ వ్యంగ్యంగా ఆయన ఆ మాట అన్నారు. అసలే ఇస్లామోఫోబియాతో భయపడే చాలా మంది అమెరికన్లు ఆ వ్యాఖ్యతో సందేహంలో పడ్డారు. ఇన్షా అల్లా అంటే అర్థం ఏమిటో గూగుల్‌లో వెతికారు. అయితే.. చాలామందికి తెలియని విషయమేంటంటే 2008లో పాకిస్థాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ బైడెన్‌కు హిలాల్‌ ఇ పాకిస్థాన్‌’ అవార్డును ప్రకటించారు. ఆ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అది. రిపబ్లికన్‌ సెనెటర్‌ రిచర్డ్‌ లుగర్‌తో కలిపి సంయుక్తంగా ఆ పురస్కారాన్ని ఇచ్చారు. వారిద్దరూ కలిసి పాకిస్థాన్‌కు సైనికేతర వినియోగం నిమిత్తం 150కోట్ల డాలర్ల సాయం అందించే ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టడమే ఇందుకు కారణం.  



కామెంట్‌లు లేవు: