చంఢీఘర్ : ఒక్కో రంగాన్ని దశలవారీగా ధ్వసం చేసే మోడీ ప్రభుత్వ విధానంతో.. ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, రైతుల పోరాటం .. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధానంగా ఉధ్భవించిందని ప్రముఖ జర్నలిస్ట్ పి. సాయినాథ్ అన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీని అభినందించారు. ఈ ఉద్యమంతో దేశంలోని రైతులు తాము కోల్పోయిన ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. చంఢఘీర్‌లో రైతుల తిరుగుబాటుపై ఆయన ప్రసంగిస్తూ..రిపబ్లిక్ డే రోజున రైతులు చేపడుతున్న ట్రాక్టర్ ర్యాలీ చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఇది ప్రజల పరేడ్ అని, ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించాలని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయాలన్న మోడీ ప్రభుత్వ ప్రతి వ్యూహాన్ని ధైర్యంగా తిప్పి కొట్టారని అన్నారు. కార్పోరేట్ మీడియా, పోలీసుల దాడి ఇలా ప్రతి వ్యూహాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. ప్రధాని దూకుడుగా దాడి చేస్తున్నారని, ఒకదాని తర్వాత మరోకటి రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తూనే ఉన్నారని అన్నారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు ప్రాంతీయ, మత, కులాల పరంగా విభజనలు సృష్టించడం (ఖలిస్తానీయులని), పోలీసులను ప్రయోగించడం, ఇందులో కొందరు మేథావులు కూడా పాల్గొన్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం తప్పుడు మార్గంలో ప్రయాణిస్తోందని అన్నారు. వలస పాలకులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలకు ఇప్పుడు రైతులు చేపడుతున్న ఉద్యమానికి చాలా పోలీకలు ఉన్నాయని, చరిత్ర విద్యార్థిని గనుక తాను స్పష్టం చేయగలుగుతున్నానని అన్నారు. అప్పుడు కూడా చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే అశాభావంతో ఉన్నానని అన్నారు. గత మూడేళ్లలో దేశంలోని మధ్యతరగతి ప్రజలు రైతుల పట్ల సానుభూతి చూపుతున్నారని, గతంలో అలా జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా కార్పోరేట్ మీడియా తీరును కూడా ఎండగట్టారు. దేశంలోని అతిపెద్ద కార్పోరేట్ మీడియాలకు ఈ చట్టాలతో భారీ ప్రయోజనాలు చేకూరుతాయని, దీంతో మీడియాలో అధిక భాగం వారి యజమానుల ప్రయోజనాలకు విరుద్ధమైన వైఖరిని తీసుకోలేరని అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి