10, జులై 2021, శనివారం

పంపిణీకి నిజంగానే భూమి లేదా?

 1973 భూ గరిష్ఠ పరిమితి చట్టంలోని అంశాలను తాజా పరిస్థితులలో పునఃసమీక్షించాలి. రాష్ట్రంలో సమగ్ర భూసర్వే జరిపి, మాగాణి, మెట్ట భూములను వర్గీకరించాలి. ఆ చట్టం ప్రకారం భూ గరిష్ఠ పరిమితులకు అనుగుణంగా మిగులు భూములను నిర్ధారించి వాటిని భూ వసతి లేని పేదలకు పంచాలి. ముఖ్యంగా వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించిన గ్రామీణ కుటుంబాలకు భూ పంపిణీలో ప్రాధాన్యమివ్వాలి.


తెలంగాణలో ఇవాళ్టికీ ‘భూమి సమస్య’ అత్యంత ముఖ్యమైనది. రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో లక్షలాది కుటుంబాలు ఈనాటికీ ఒక్క సెంటు భూమి కూడా లేకుండా ఉన్నాయి. వ్యవసాయేతర వృత్తులలో వున్న వారి చేతుల్లోకి పెద్ద ఎత్తున భూమి వెళ్ళిపోతున్నది. ఒక వైపు కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది. మరోవైపు వందల ఎకరాలను కొనుగోలు చేస్తున్న నయా జమీందారులూ పెరుగుతున్నారు. చాలా మంది అడిగే ప్రశ్న: భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయాలంటే భూమి ఎక్కడ ఉంది? నిజంగా భూమి ఎక్కడ ఉందంటే... పెద్ద విస్తీర్ణంలో నయా జమీందారుల చేతుల్లో ఉంది; 1973 భూ సంస్కరణల చట్టం అమలు చేయకపోవడం వల్ల భూ గరిష్ఠ పరిమితులకు మించి, భూమి పెద్ద రైతుల చేతుల్లో ఉంది; భూములను ఆస్తిగా కొనుగోలు చేస్తున్న వ్యవసాయేతర వృత్తుల వారి చేతుల్లో ఉంది; సాగు యోగ్యమైన భూమి ‘పడావు’ భూముల రూపంలో ఉంది; రాష్ట్ర ప్రజల గృహ నిర్మాణ అవసరాలకు మించి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్ల చేత, వ్యవసాయేతర భూమిగా మార్చబడి ఆస్తి విలువ కలిగిన ప్లాట్లుగా విభజించబడి ఉంది. 


ఈ అవగాహనతో, పరిశీలించకపోవడం వల్ల పంచేందుకు భూమి లేదనే భావం అందరిలో స్థిరపడింది. ఈ కారణం చేతే అణచివేతకు గురవుతున్న వర్గాల ప్రజల కోసం ఆవిర్భవించిన దళిత, వెనుకబడిన వర్గాల సంఘాలు కూడా భూమి సమస్యపై పెద్దగా మాట్లాడడం లేదు. దళిత బహుజన ఫ్రంట్‌ (డి.బి.ఎఫ్‌) లాంటి ఒకటి, రెండు సంఘాలు తప్ప, గ్రామీణ పేద కుటుంబాలకు భూమి దక్కాలనే డిమాండ్‌ను బలంగా ముందుకు తేవడం లేదు. 


అమెరికా, యూరప్‌తో భారతదేశాన్ని పోలుస్తూ మన దేశం కూడా అనివార్యంగా నగరాలు, పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధి దిశగా పయనిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రజలు, గ్రామాల్లో ఉండకుండా ఈ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు అవుతారుగనుక భూ సంస్కరణలను అమలు చేయాలనే డిమాండ్‌కు ఇక కాలం చెల్లినట్టేనని వారు వాదిస్తున్నారు. నిజంగానే గత 60 సంవత్సరాలలో తెలంగాణ జనాభా పొందికలో వచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. అయినా ఇప్పటికీ పారిశ్రామిక, సేవారంగాలు కల్పించిన ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు, పారిశ్రామిక, సేవారంగాలన్నీ మూతపడితే, తిరిగి పేదలను కడుపులో పెట్టుకున్నది గ్రామీణ ప్రాంతమే. అన్నం పెట్టింది గ్రామీణ ఉపాధి హామీ పథకమే. 


1973 భూ సంస్కరణల చట్టం వచ్చిననాటి కంటే, ఇప్పుడు రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు బాగా పెరిగాయి. రైతులు స్వయంగా తవ్వుకున్న బోరుబావుల ద్వారానే కాకుండా, ప్రభుత్వం నిర్మించిన చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతుల పొలాలకు నీరు వస్తున్నది. ఒకప్పటి మెట్ట భూములు, మాగాణి భూములుగా మారుతున్నాయి. అయినా ఇంతకాలం అగచాట్లు పడిన గ్రామీణ ప్రజలు తమ భూములను కోల్పోతున్నారు. వ్యవసాయంతో ఏ మాత్రమూ సంబంధం లేని వారు వచ్చి ఆ భూములను పెద్ద ఎత్తున కొంటున్నారు.


ఈ ‘నయా’ భూ యజమానుల భూములను నీళ్ళు తడపబోతున్నాయి. ఆయా గ్రామాలలో కూలీలు, కూలీలు గానే మిగిలిపోయారు. లేదా వలసపోయారు. వీళ్ళలో కొంతమంది కౌలు రైతులుగా మారినా, పెరిగిన నీటి పారుదల సౌకర్యాల వలన, కౌలు ధరలు బాగా పెరిగాయి. కౌలు ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. వీరికి రైతులుగా గుర్తింపు లేక, ఏ సహాయమూ అందడం లేదు. ఈ పరిస్థితులలో 1973 భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని అమలు చేయకపోతే, పెరిగిన నీటిపారుదల సౌకర్యాల వల్ల భూమి లేని గ్రామీణ పేదలకు చేకూరే ప్రయోజనమేమీ ఉండదు. మిగులు భూములు తేల్చి, పంపిణీ చేయకుండా, కేవలం భూ కొనుగోలు పథకాల ద్వారా భూమి అందించాలని చూడడం, ఆచరణలో అసాధ్యం. భూముల రేట్లు పెరుగుతున్న దశలో, చాలా జిల్లాలలో ఈ పథకం కింద భూములు కొనడమే మానేశారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 


1973 భూ గరిష్ఠ పరిమితి చట్టంలోని అంశాలను కూడా తాజా పరిస్థితులలో పునఃసమీక్షించాలి. రాష్ట్రంలో సమగ్ర భూసర్వే జరిపి, మాగాణి, మెట్ట భూములను వర్గీకరించాలి. 1973 చట్టం ప్రకారం భూ గరిష్ఠ పరిమితులకు అనుగుణంగా మిగులు భూములను తేల్చాలి. ఆ మిగులు భూములను భూమిలేని పేదలకు పంచాలి. ముఖ్యంగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుందామనుకుంటున్న గ్రామీణ కుటుంబాలకు భూ పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలి. పేద కుటుంబాలకు భూ పంపిణీ సమయంలో స్టాండర్డ్‌ హోల్డింగ్‌ ఎంత ఉండాలనేది తిరిగి నూతన మార్గదర్శకాలు జారీ చేయాలి. భూ పంపిణీకి ఇప్పటి వరకూ 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట ప్రాతిపదికగా ఉంది. ఒక కుటుంబం గౌరవంగా జీవించడానికి ఇది ఒక ఆర్థిక కమతంగా సరిపోతుందా అన్నది సమీక్షించాలి. 1973 చట్టంలో ఒక స్టాండర్డ్‌ హోల్డింగ్‌గా ఒక కుటుంబానికి మాగాణి భూమి 18 ఎకరాలు, మెట్ట భూమి 54 ఎకరాలు గరిష్ఠంగా నిర్ణయించారు. అంటే ప్రస్తుతం ప్రభుత్వాలు భూమి పంపిణీకి పెట్టుకున్న ప్రాతిపదికతో పోల్చినపుడు ఇవి మాగాణి విషయంలో 7.5 రెట్లు, మెట్ట భూమి విషయంలో సుమారు 11 రెట్లు ఎక్కువ. 


1973 చట్టాన్ని పట్టించుకోకుండా, అమలు చేయడానికి ప్రయత్నించకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 1 ద్వారా ‘భూమిలేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి కొనుగోలు పథకం’ ప్రవేశపెట్టింది. ఈ జీవో ప్రకారం నీటిపారుదల సౌకర్యం ఉండి, సాగుయోగ్యమైన భూమి కొని ఇవ్వాలని నిర్దేశించింది. ఎకరానికి గరిష్ఠంగా 7 లక్షల రూపాయల ధర కూడా నిర్ణయించింది. 1973 చట్టం నిర్దేశించిన భూ గరిష్ఠ పరిమితి ప్రమాణాలకు, తాజాగా భూ పంపిణీకి పెట్టుకున్న ప్రమాణాలకు మధ్య ఉన్న ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాలి. ఒక ఆర్థిక కమతాన్ని తాజాగా ప్రామాణీకరించాలి. గతంలో 1973 చట్టం వర్తించకుండా ఇచ్చిన మినహాయింపులను కూడా ఇప్పుడు పునఃసమీక్షించాలి. భూమి ఒక సహజవనరు కాబట్టి, దాని కేంద్రీకరణను నియంత్రించాలి. అత్యధికుల జీవనోపాధి వనరు భూమే కాబట్టి, ‘సమగ్ర భూ వినియోగ విధానం’ రూపొందించాలి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రాజెక్టుకు అవసరమైన భూమి సేకరణను తప్ప, ఈ చట్టంలో ఇచ్చిన మిగిలిన అన్ని మినహాయింపులను రద్దు చేయాలి. ‘భూ బ్యాంకు’గా ప్రభుత్వాల ఆధీనంలో ఉండే భూ విస్తీర్ణాలను కూడా, భూ వినియోగ విధాన ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించుకుని మిగులు భూమిని విడుదల చేయాలి. 


గత 47 సంవత్సరాలలో పారిశ్రామిక, సేవా రంగాలలో టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని వివిధ పారిశ్రామిక ప్రాంతాలకు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు, ప్రజలకు సేవలు అందిస్తాయనే పేరున వివిధ సంస్థలకు కేటాయించిన భూములపై కూడా పునఃసమీక్ష జరపాలి. ఇప్పటికీ, వినియోగంలో లేని భూములను, భూ వినియోగ విధాన పరిమితులకు మించి ఉన్న భూములను ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకోవాలి. పడావు భూములను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెడితే మరిన్ని సాగు యోగ్యమైన భూములు అందుబాటులోకి వస్తాయి. ఎగుమతి ప్రధాన లక్ష్యంతో వాణిజ్య పంటల పొందికను రూపొందించకుండా, రాష్ట్ర ప్రజల అవసరాలు ప్రాతిపదికగా పంటల ప్రణాళిక రూపొందించగలిగితే, సాగు భూముల వినియోగం న్యాయబద్ధంగా ఉంటుంది. అప్పుడే ఇతర జీవనోపాధుల ఏర్పాటుకు భూమి అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయేతర అవసరాలకు భూమి మళ్ళించాలనుకుంటే కూడా భూ వినియోగ విధానం అవసరమే. పట్టణ, నగర ప్రాంతాల భూ గరిష్ఠపరిమితిని కూడా ఫునఃసమీక్షించాలి. పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తున్నప్పుడు ఒక్కో కుటుంబానికి 40 చదరపు గజాలు ప్రాతిపదికగా ఉంటున్నది. ఈ విషయంలో భూ గరిష్ఠ పరిమితికీ, పంపిణీకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఇక్కడ కూడా పరిష్కరించాలి.


పేదల గృహనిర్మాణ అవసరాల కోసం ప్రభుత్వం చేతుల్లో భూమి ఉండడంలో తప్పులేదు. అయితే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అవసరాలకు మించి ఖాళీ స్థలాలను పెద్ద ఎత్తున కలిగి ఉండడంపై పరిమితి విధించాలి. రియల్‌ ఎస్టేట్‌ పేరుతో లక్షలాది ఎకరాల సాగు భూములను సేకరించడాన్ని నిషేధించాలి. పెరుగుతున్న జనాభా, గృహ అవసరాలు, పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుంటూనే సాగు భూములు దుర్వినియోగం కాకుండా నియంత్రణ విధించాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న భూ ఖండాలను వ్యవసాయ వినియోగంలోకి తేవాలి. రియల్‌ ఎస్టేట్‌ పేరిట పడావు పెట్టే భూములపై కూడా పన్ను విధించాలి. నేరుగా వ్యవసాయం చేయకుండా ఇతర వృత్తులలో ఉన్న వ్యక్తుల వృత్తిపరమైన ఆదాయంతో పాటు, పరిమితికి మించిన వ్యవసాయ ఆదాయాన్ని, కౌలు ఆదాయాన్ని కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి. ‘భూమిని సరుకుగా సంపదగా చూస్తే పెట్టుబడి దారులకు లాభం, భూమిని జీవనోపాధి వనరుగా చూస్తే గ్రామీణ పేదలకు ప్రయోజనం’ అన్న సత్యం అవిస్మరణీయమైనది.


-కన్నెగంటి రవి (రైతు స్వరాజ్య వేదిక)

కామెంట్‌లు లేవు: